24 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
23 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు రావణుని మతాన్ని అనుసరించి తండ్రిని నింద చేశారు కావున భారత్ గవ్వ సమానంగా అయింది, ఇప్పుడు ఆ తండ్రిని గుర్తించి స్మృతి చేసినట్లయితే ధనవంతులుగా అవుతారు”
ప్రశ్న: -
మెట్ల చిత్రంలో ఏ అద్భుతమైన రహస్యం ఇమిడి ఉంది?
జవాబు:-
అర్ధకల్పం భక్తి డ్యాన్స్ మరియు అర్ధకల్పం జ్ఞాన డ్యాన్స్ ఉంటుంది. భక్తి డ్యాన్స్ జరుగుతున్నప్పుడు జ్ఞాన డ్యాన్స్ ఉండదు మరియు జ్ఞాన డ్యాన్స్ జరుగుతున్నప్పుడు భక్తి డ్యాన్స్ ఉండదు. అర్ధకల్పం రావణుని ప్రారబ్ధం కొనసాగుతుంది మరియు అర్ధకల్పం పిల్లలైన మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ గుహ్యమైన రహస్యం మెట్ల చిత్రంలో ఇమిడి ఉంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ…
ఓంశాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – భక్తి మార్గంలో భక్తి డ్యాన్స్ చాలా చేశారు, జ్ఞాన డ్యాన్స్ చేయలేదు. భక్తి డ్యాన్స్ జరుగుతున్నప్పుడు జ్ఞాన డ్యాన్స్ ఉండదు. జ్ఞాన డ్యాన్స్ జరుగుతున్నప్పుడు భక్తి డ్యాన్స్ ఉండదు, ఎందుకంటే భక్తి డ్యాన్స్ దిగే కళలోకి తీసుకువెళ్తుంది. సత్య-త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. భక్తి ప్రారంభమైనప్పుడు, జ్ఞాన ప్రారబ్ధం పూర్తవుతుంది, ఇక దిగే కళలోకి వస్తారు. ఎలా దిగుతారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు నన్ను చాలా నింద చేశారని నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలకు చెప్తాను. ఎప్పుడెప్పుడైతే భారత్ లో ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క నింద చాలా జరుగుతుందో, అప్పుడు నేను వస్తాను. నింద అని దేనినంటారు అనేది కూడా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము వచ్చి, భారత్ యొక్క వికారీ నరకవాసులను, స్వర్గవాసులుగా తయారుచేస్తాను. మీరు ఆసురీ మతాన్ని అనుసరించి నన్ను నింద చేసిన కారణంగా ఎంత నిరుపేదలుగా అయిపోయారు. ఇంతకుముందు రామరాజ్యముండేది, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది, వీటినే గెలుపు మరియు ఓటమి, పగలు మరియు రాత్రి అని అనడం జరుగుతుంది. మరి నేను ఎప్పుడు రావాలి అని ఇప్పుడు ఆలోచించండి. ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో, వారే రాజ్యాన్ని పోగొట్టుకుని కూర్చొన్నారు. లెక్కలన్నీ అర్థం చేయించడం జరిగింది. నేను వచ్చి వారసత్వాన్ని ఇస్తాను, తర్వాత రావణుడు వచ్చి మిమ్మల్ని అనగా ముఖ్యంగా భారత్ ను మరియు మొత్తం ప్రపంచాన్ని శాపగ్రస్తులుగా చేస్తాడు. భారత్ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. మొట్టమొదట భారత్ యే ఉండేది, ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది, ఎవరు రాజ్యం చేసేవారు అనే విషయాలు ఎవరికీ ఏమీ తెలియవు. ఏమీ అర్థం చేసుకోరు. దేవతలు ఎవరైతే ఉండేవారో, వారి ముఖం మనుష్యుల వలె ఉండేది, లక్షణాలు దేవతల వలె ఉండేవి. ప్రస్తుతం ముఖం మనుష్యులదే ఉంది కానీ లక్షణాలు అసురత్వం కలవిగా ఉన్నాయి, ఎవరికైనా అర్థం చేయించినా అర్థం చేసుకోరు, ఎందుకంటే పారలౌకిక తండ్రి గురించే తెలియదు, అంతేకాక కూర్చొని వారిని నిందిస్తారు. తండ్రిని నిందిస్తూ-నిందిస్తూ పూర్తిగా గవ్వ సమానంగా అయిపోయారు. భారత్ యొక్క డౌన్ ఫాల్ (పతనం) జరిగింది. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను వస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నాను. కల్పక్రితం కూడా ఇలాగే అర్థం చేయించాను. ఈ దైవీ సంప్రదాయ స్థాపన జరుగుతుంది, మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారు అనేది మనుష్యులకు అసలు తెలియదు, సత్య-త్రేతా యుగాలలో మీరు చాలా సంతోషంగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. దేవతలు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ-అనుభవిస్తూ త్రేతా అంతిమంలో సమాప్తమైపోతారు, తర్వాత రావణుని ఆసురీ ప్రారబ్ధం మొదలవుతుంది, ద్వాపరం నుండి రావణుని శాపాన్ని పొందుతూ-పొందుతూ పూర్తిగా సమాప్తమైపోతారు. భక్తి కూడా ముందు అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. మెట్ల చిత్రం సరైన విధంగా తయారు చేయబడింది. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత సతో-రజో-తమోగా అవుతుంది. మాలిన్యం చేరుతూ ఉంటుంది. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది కానీ ధారణ తక్కువగా జరుగుతుంది. కొందరికైతే అర్థం చేయించే తెలివి అసలు లేదు. కొందరు మంచి అనుభవజ్ఞులున్నారు, వారి ధారణ చాలా బాగుంటుంది. నంబరువారుగా ఉంటారు కదా. విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. ఏదో ఒక నంబరు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. నేను మీ అనంతమైన తండ్రిని, సృష్టి రచయితను. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. స్మృతితోనే మాలిన్యం తొలగుతుంది. భారతవాసులైన మీరు సత్యయుగంలో సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు కలియుగంలో తమోప్రధానంగా అయ్యారని కేవలం ఇది మాత్రమే అర్థం చేయించండి. ఆత్మలో మాలిన్యం చేరుతుంది. పవిత్రంగా అవ్వకుండా ఎవరూ అక్కడకు వెళ్ళలేరు. కొత్త ప్రపంచంలోనే సతోప్రధానమైనవారు ఉంటారు. వస్త్రం కొత్తదైతే, దానిని సతోప్రధానమని అంటారు, అది తర్వాత పాతదిగా, తమోప్రధానంగా అయిపోతుంది. ఇప్పుడు అందరి వస్త్రాలు చిరిగిపోయే విధంగా ఉన్నాయి. అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, వారే పూర్తి పేదవారిగా అయ్యారు. మళ్ళీ వారే షావుకారులుగా అవ్వాలి. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. భారత్ స్వర్గంగా ఉండేది, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, మిగిలిన ధర్మాల వారందరూ తర్వాత వచ్చారు. తండ్రి కూర్చొని మీకు సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. గీతకు ఎంత గౌరవముందో చూడండి. కానీ అది చదువుతూ-చదువుతూ పూర్తిగా కింద పడిపోయారు, అప్పుడు – ఓ పతితపావనా రండి, మేము భ్రష్టాచారులుగా అయిపోయాము అని పిలుస్తారు. భగవంతుడు మాత్రమే సద్గతిని ఇవ్వగలరు. ఇకపోతే, శాస్త్రాలలో ఉన్నదంతా భక్తి మార్గము. మేము బాబా జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతామని – ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చొని ఉంది. ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచం పట్ల వైరాగ్యముంది. సన్యాసులు కూడా భక్తి చేస్తారు, గంగా స్నానాలు మొదలైనవి చేస్తారు కదా. భక్తి కూడా ముందు సతోప్రధానంగా ఉంటుంది, తర్వాత రజో, తమోగా అవుతుంది. ఇది కూడా అలాగే. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని గాయనం చేయబడుతుంది. బ్రహ్మాతో పాటు తప్పకుండా బ్రాహ్మణులకు కూడా రాత్రి-పగలు ఉంటుంది. ఇప్పుడు మీరు పగలులోకి వెళ్తారు, భక్తి యొక్క రాత్రి పూర్తవుతుంది. భక్తిలో చాలా దుఃఖముంది, దానిని రాత్రి అని అంటారు. భగవంతుడిని కలుసుకునేందుకు అంధకారంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భక్తి మార్గంలో సద్గతినిచ్చేవారు ఎవరూ ఉండరు. మీకు తప్ప ఇంకెవరికీ భగవంతుని గురించి యథార్థంగా తెలియదు. ఆత్మ కూడా బిందువు, పరమాత్మ కూడా బిందువు అనే విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. పరమాత్మయే స్వయంగా వచ్చి బ్రహ్మా తనువు ద్వారా అర్థం చేయిస్తారు. దానికి వారు భగీరథుడిని ఎద్దు రూపంలో చూపించారు. ఇప్పుడు ఎద్దు విషయమే లేదు. తండ్రి అన్ని విషయాలను మంచి రీతిలో అర్థం చేయిస్తారు కానీ ఎవరి బుద్ధిలోనూ పూర్తిగా కూర్చోవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – పిల్లలూ, నేను ఆత్మలైన మీకు తండ్రిని, మీరు నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. అయినా సరే మర్చిపోతున్నామని అంటారు. వాహ్! ఇలాంటి ప్రియుడిని మరియు తండ్రిని మర్చిపోతారా? స్త్రీ తన పతిని లేదా పిల్లలు వారి తండ్రిని ఎప్పుడైనా మర్చిపోతారా? మరి ఇక్కడ, మీరెందుకు మర్చిపోతున్నారు? బాబా, మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు, అయినా మేము మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అంటారు – స్మృతి చేయకపోతే లోపల ఏదైతే తుప్పు పట్టిందో, అది ఎలా తొలగుతుంది. ముఖ్యమైన విషయం స్మృతి. మీకు వేరే ఏ ధర్మాలతోనూ సంబంధం లేదు. పాఠశాలలోనైతే చరిత్ర-భూగోళాలను అర్థం చేయిస్తారు. కొందరైతే అసలు అర్థం చేసుకోరు. తండ్రి చదివిస్తున్నారు అనేది బుద్ధిలో కూర్చోదు. అచ్ఛా, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి లేదా ఇది కూడా మర్చిపోతున్నారా! ఎవరి కోసమైతే అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారో, ఆ తండ్రిని స్మృతి చేయరు. ఇప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి రాజ్యంలోకి వెళ్తాము, ఇది అంతిమ జన్మ అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనంలో అవే రూపురేఖలతో వారిని చూస్తారు, అలాగే వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మా-బాబాయే లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు, మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు – ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకోవాలని అర్థమవుతుంది. అక్కడ వారికి సత్యయుగం తర్వాత త్రేతా వస్తుందని, తర్వాత ద్వాపరం వస్తుందని, తాము దిగిపోతూ ఉంటారని తెలియదు. అక్కడ జ్ఞానానికి సంబంధించిన విషయం ఉండదు. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు, తర్వాత ఆత్మాభిమానుల నుండి దేహాభిమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. ఇది జ్ఞాన-జ్ఞానేశ్వరుడైన, జ్ఞాన సాగరుడైన తండ్రి మాత్రమే వినిపిస్తారు. తప్పకుండా బ్రహ్మాకు పిల్లలైన బ్రాహ్మణులకే వినిపిస్తారు. బ్రహ్మా యొక్క పిల్లలు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరు పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అవుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు తండ్రిని స్మృతి చేయండి, కర్మలైతే చేయాల్సిందే. బుద్ధియోగం తండ్రితో జోడించబడి ఉండాలి. ఏ కర్మనైనా చేయండి, వడ్రంగి పనైనా చేయండి లేదా రాజ్యం చేసే పనైనా చేయండి. రాజా జనకుని గాయనం కూడా ఉంది కదా. రాజ్యం చేస్తూ ఉండండి కానీ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించినట్లయితే వారసత్వం లభిస్తుంది. మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. కేవలం శివ అని అన్నట్లయితే లింగం గుర్తుకొస్తుందని శివబాబా అంటున్నారు. మిగిలినవారికి శరీరాల పేర్లు తీసుకోవడం జరుగుతుంది, శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేయడం జరుగుతుంది, ఇది అర్ధకల్పం కొనసాగుతుంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు. అక్కడ యథా రాజా-రాణి, తథా ప్రజా, అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. అందరి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అందరి ఆయుష్షు తక్కువగా ఉంది. కావున, తండ్రి సమ్ముఖంగా కూర్చొని – హే ఆత్మలూ, అని అంటూ పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు, ఎందుకంటే జ్ఞానాన్ని ఆత్మ తీసుకుంటుంది, ధారణ ఆత్మలోనే జరుగుతుంది. బాబాకైతే శరీరం లేదు. ఆత్మలో జ్ఞానమంతా ఉంది. ఆత్మ కూడా నక్షత్రం, బాబా కూడా నక్షత్రం. బాబా పునర్జన్మలు తీసుకోరు, ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి, అందుకే పరమాత్ముని మహిమను మరియు పిల్లల మహిమను రాసుకుని రండి అని బాబా కార్యాన్ని ఇచ్చారు. ఇరువురి మహిమ వేరు-వేరు. శ్రీకృష్ణుని మహిమ వేరు. అతను సాకారుడు, వీరు నిరాకారుడు. అతడిని అంత గుణవంతునిగా ఎవరు తయారుచేసారు? తప్పకుండా పరమాత్మయే తయారుచేశారని అంటారు.
ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సంప్రదాయం వారు. మీకు తండ్రి నేర్పిస్తున్నారు. ప్రారబ్ధాన్ని తర్వాత అనుభవిస్తారు. సత్యయుగంలోనైతే ఎవరూ నేర్పించరు. భక్తి మార్గపు సామాగ్రి సమాప్తమైపోతుంది. ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం కూడా కలగాలి అనగా దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. అశరీరిగా వచ్చాము, అశరీరిగానే వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది, మనమంతా కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటువంటివారము. కేవలం స్మృతి చేసే శ్రమను చేస్తూ ఉండండి, ఇందులోనే ఫెయిల్ అవుతారు. స్మృతి చేయరు. అర్థం చేసుకునేందుకు ఎవరు వచ్చినా కానీ, వారికి కూడా ఇదే అర్థం చేయించాలి – నన్ను స్మృతి చేసినట్లయితే, ఆ స్మృతితో మీ మాలిన్యం తొలగిపోతుందని, మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారని శివబాబా బ్రహ్మా ద్వారా చెప్తున్నారని చెప్పండి. విష్ణుపురియే స్వర్గపురి. కావున ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి, ఏ తండ్రినైతే అర్ధకల్పం స్మృతి చేసారో, వారు ఇప్పుడు సమ్ముఖంగా వచ్చారు, నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. వారి గురించి ఎవరికీ తెలియదు. వారే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఎవరిని, ఎలా ఉంటాను అనేది ఎవరో అరుదుగా తెలుసుకుంటారు మరియు నిశ్చయం ఏర్పరచుకుంటారు. నిశ్చయం ఏర్పరచుకుంటే, పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందుతారు. శివబాబా అంటారు – నన్ను స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎలాంటి వికర్మలను చేయకూడదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా అవ్వాలి. కర్మ ఏదైనా కానీ తండ్రి స్మృతిలో ఉంటూ చేయాలి. ఎలాంటి వికర్మలను చేయకూడదు.
2. ఈ పాత వస్త్రం (శరీరం) శిథిలావస్థలో ఉంది, దీని పట్ల మమకారాన్ని తొలగించాలి. ఆత్మను సతోప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి.
వరదానము:-
ముందు చేయాలి, ఆ తర్వాత చెప్పాలి అని సదా అటెన్షన్ ఉండాలి. చెప్పడం సహజము, చేయడంలో శ్రమ ఉంటుంది. శ్రమకు ఫలం మంచిగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇతరులకు చెప్పి, స్వయం చేయకపోతే, సర్వీస్ తో పాటు డిస్ సర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఎలాగైతే అమృతంలో ఒక్క విషపు బిందువు పడినా సరే, అమృతమంతా విషంగా అవుతుందో, అలా ఎంత సేవ చేసినా కానీ ఒక చిన్న తప్పు సర్వీస్ ను అంతా సమాప్తం చేసేస్తుంది. కావున ముందు స్వయం పట్ల అటెన్షన్ ఇవ్వండి, అప్పుడు సత్యమైన సేవాధారులని అంటారు.
స్లోగన్:-
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు
‘‘ఎక్కే కళ మరియు దిగే కళకు ముఖ్యమైన మూలం ఏమిటి?’’
ఇంత పురుషార్థం చేసి జీవన్ముక్త పదవిని పొందినప్పుడు, మళ్ళీ అక్కడ నుండి కింద పడిపోయేందుకు కారణం ఏమిటి అనే ప్రశ్నను చాలామంది మనుష్యులు అడుగుతారు. ఇది గెలుపు-ఓటముల ఆట అని మనం అంటాము కానీ ఇందులో ఎక్కే కళ మరియు దిగే కళ జరుగుతున్నందుకు కూడా ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఆ కారణం ఆధారంగానే ఈ ఆట నడుస్తుంది, ఎలాగైతే పురుషార్థంతో మనం పైకి ఎక్కుతున్నామో, అలా కిందకు పడిపోయేందుకు కూడా తప్పకుండా కారణముంది. ఆ కారణం కూడా పెద్దదేమీ కాదు, కేవలం ఒక చిన్న పొరపాటే కారణము. ఎలాగైతే పరమాత్మ – నన్ను స్మృతి చేస్తే నేను మీకు ముక్తి-జీవన్ముక్తుల పదవిని ఇస్తానని అంటారో, అలాగే దేహాభిమానులుగా అయి పరమాత్మను మర్చిపోయినప్పుడు కింద పడిపోతారు. వామ మార్గంలోకి వెళ్ళిపోతారు, అప్పుడు 5 వికారాలలో చిక్కుకోవడంతో దుఃఖం అనుభవిస్తారు, ఇది మన దోషం, అంతేకానీ రచయిత దోషం కాదు. మనుష్యులు పరమాత్మయే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు కానీ అది పూర్తిగా తప్పు. బాబా సుఖాన్ని రచిస్తారు కానీ దుఃఖాన్ని రచించరు. ఇకపోతే మనం శ్రేష్ఠ కర్మలతో సుఖం పొందుతాము మరియు భ్రష్ట కర్మలతో దుఃఖం అనుభవిస్తాము. మంచి కర్మల ఫలం మరియు చెడు కర్మల శిక్ష పరమాత్మ ద్వారా తప్పకుండా లభిస్తాయి కానీ సుఖం-దుఃఖం రెండూ పరమాత్మయే ఇస్తారని అనకూడదు. పరమాత్మ ఎక్కే కళలో మనతో పాటు ఉన్నారు కానీ కింద పడేసేది మాయ. మామూలుగా కూడా సుఖం కోసమే ఎవరి తోడునైనా లేక సహాయాన్ని అయినా తీసుకుంటాము. అంతేకానీ, దుఃఖాన్ని పొందేందుకు ఎవరూ ఎవరి తోడును తీసుకోరు. ఇకపోతే కర్మలు ఎలా ఉంటే, ఫలం యొక్క రిజల్టు కూడా అలాగే ఉంటుంది. కావున ఈ డ్రామాలో సుఖ-దుఃఖాల ఆట మన కర్మల ఆధారంగా ఉంటుంది, కానీ తుచ్ఛ బుద్ధి కల మనుష్యులకు ఈ రహస్యం తెలియదు. అచ్ఛా – ఓం శాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!