05 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
4 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - శ్రీమతంపై నడుస్తూ అందరికీ సుఖమునివ్వండి, ఆసురీ మతంపై దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు, ఇప్పుడు సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి”
ప్రశ్న: -
బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేస్తారు?
జవాబు:-
ఇది సుఖ-దుఃఖాలు, గెలుపు-ఓటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పము సుఖపు ఆట నడవనున్నది. అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండదు. ఇప్పుడు కొత్త రాజధాని రానున్నది, దాని కోసం తండ్రి తమ పరంధామాన్ని వదిలి, పిల్లలైన మనల్ని చదివించేందుకు వచ్చారు, ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాల్సిందే.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ప్రపంచం మారినా మేము మారము….. (బదల్ జాయే దునియా నా బద్లేంగె హమ్…..)
ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు అర్థాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ ప్రమాణమేమీ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మకు వివేకం ఉండాలి. ఆత్మ తమోప్రధానమైన కారణంగా పూర్తిగా తెలివిహీనంగా అయిపోయింది. మేము ఎంత తెలివిహీనులుగా ఉండేవారము, ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యాము – అని పిల్లలకు తెలుసు. వేరే సత్సంగాలలో ఈ విషయాలు ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణం మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి వెళ్ళిపోతుంది. ఏ ప్రాప్తి ఉండదు. యజ్ఞ-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చాలా చేస్తారు, ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. కానీ, ఏ ప్రాప్తి ఉండదు. ఈ ప్రపంచంలో ఎవరికీ సుఖం లేదు. ఇప్పుడు తండ్రి పూర్తి వివేకాన్ని ఇస్తారు. అందరికీ సుఖ-శాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. భక్తి మార్గం వారు కూడా – హే దుఃఖహర్త, సుఖకర్త, సద్గతిదాత అని స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏమి జరుగుతుందో చూడండి. అందరికీ దుఃఖం కలుగుతూనే ఉంటుంది. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారికి తండ్రి ఎవరు, తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది అనేది తెలియదు. అనంతమైన తండ్రి గురించి అసలు తెలియదు. శాంతి కోసం ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు, మనసుకు శాంతి కావాలని ఎవరు అన్నారు? ఆత్మ అంటుంది, ఇది కూడా మనుష్యులకు తెలియదు. దేహాభిమానం ఉంది కదా. సాధువులు, సత్పురుషులు మొదలైనవారంతా దుఃఖమయంగా ఉన్నారు, అందరూ శాంతిని కోరుకుంటారు. అనారోగ్యం సాధువులు, సత్పురుషులకు కూడా వస్తుంది. ఏక్సిడెంట్లు జరుగుతాయి. ప్రపంచంలో దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము, సుఖము మరియు దుఃఖము యొక్క ఆట తయారై ఉంది. తండ్రి మీ బుద్ధి తాళాన్ని తెరిచారు, మిగిలిన మనుష్యమాత్రులందరి బుద్ధికి గోద్రేజ్ తాళం వేయబడి ఉంది, పూర్తిగా తమోప్రధాన బుద్ధి ఉంది. పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థం అనుసారంగా తెలుసు. అనంతమైన తండ్రి లభించారు, వారు మనకు ఈ ఆట ఎలా తయారై ఉంది అని సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తారు. సుఖమున్నప్పుడు, దుఃఖము అన్న పేరు ఉండదు. మనం తండ్రి నుండి సుఖము, శాంతి, సంపదల వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సత్యయుగం నుండి మొదలుకొని త్రేతాయుగ అంతిమం వరకు ఏ దుఃఖము ఉండదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీ రాజధానిలో ఒకరికంటే ఒకరు ఉన్నత పదవిని పొందాలని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది అనంతమైన స్కూలు. అనంతమైన తండ్రి చదివిస్తారు. వారు అపారమైన మహిమ ఉన్నటువంటి మన అతి ప్రియమైన తండ్రి అని మీకు తెలుసు. ఆ ఉన్నతోన్నతమైన తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. మిగిలిన మనుష్యమాత్రులందరూ ఆసురీ మతంపై పరస్పరంలో ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటారు. మీరు శ్రీమతమనుసారంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఈ డ్రామాలో మనం పాత్రధారులమని ఎవరికీ తెలియదు. ఈ డ్రామాలో భారతవాసులకే ఆల్ రౌండ్ పాత్ర ఉందని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందైతే మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే మూలవతనము నుండి మొదలుకొని సూక్ష్మవతనము, స్థూలవతనము, అన్నింటినీ మీరు తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానముంది. పరమపిత పరమాత్మ వీరి ద్వారా మనల్ని చదివిస్తున్నారు. బాబా మనకు మూడు లోకాల జ్ఞానమంతటినీ ఇస్తున్నారు. ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని పిల్లలకు తెలుసు. ఇక్కడైతే చిన్న-పెద్ద అందరూ దుఃఖాన్ని ఇస్తారు. గర్భంలో పిల్లలు తల్లికి దుఃఖాన్ని ఇస్తారు. ఇది చాలా ఛీ-ఛీ పాత ప్రపంచము. ఈ సృష్టి చక్రం గురించి ఎవరికీ తెలియదు. మనమెక్కడ నుండి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, తర్వాత ఎక్కడకు వెళ్ళాలి?…… ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒకే రాముడు, ఆ నిరాకారుడు. మీరందరూ సీతలు. తండ్రి వరుడు. మీరంతా ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులు, భక్తురాళ్ళు. సీతలు ఎవరైతే ఉన్నారో, అందరూ రావణుని జైలులో చిక్కుకొని శోకవాటికలోకి వచ్చారు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ ఒక్క భగవంతుడిని స్మృతి చేస్తారు. భక్తుల రక్షకుడు అని భగవంతుడిని అంటారు. మీరంతా ఇప్పుడు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. మాకు శివబాబా చదివిస్తున్నారని బ్రాహ్మణులకు తెలుసు. బాబా నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గము అనండి లేదా దైవీ రాజధాని అని అనండి – ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ సత్యయుగమున్నప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడిది కలియుగము. మనుష్యులకు పాపం ఘోర అంధకారంలో ఉన్న కారణంగా, ఇప్పుడిది కలియుగ అంతిమము అని, వినాశనం ఎదురుగా నిలబడి ఉందని అసలేమీ తెలియదు. సీతలైన మీ అందరి సద్గతిదాత రాముడొక్కరే. సీతలందరూ దుర్గతిలో ఉన్నారు కానీ మేము దుర్గతిలో ఉన్నామని ఎవరూ అర్థం చేసుకోరు. తమ షావుకారుతనం యొక్క నషా ఉంటుంది. మాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయని, ఇంత ధనముందని, ఇన్ని మహళ్ళు ఉన్నాయని అనుకుంటారు, కానీ ఈ దుఃఖపు ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవ్వనున్నదని, మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, అంతా మట్టిలో కలిసిపోనున్నది అని ఎవరికీ తెలియదు. ఈ పాత ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో, అది వినాశనమైపోతుంది. వినాశనం కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధము. వారే గీతా భగవంతుడు. కానీ, తండ్రి జీవిత చరిత్రలో కొడుకు పేరును వేసేశారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భగవంతుని పేరును మాయం చేయడమే అతి పెద్ద పొరపాటు.
మనల్ని మనుష్యమాత్రులు కానీ, సాధు-సత్పురుషులు కానీ చదివించడం లేదు, శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. అంతా వారే. ఇదైతే మర్చిపోకూడదు కదా. నాకు అందరూ పిల్లలే, కానీ అందరినీ అయితే చదివించను అని తండ్రి అంటారు. నేను భారతవాసులకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను, భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు, వజ్ర సమానంగా ఉండేవారు, ఇప్పుడు గవ్వ సమానంగా అయిపోయారని తండ్రి అంటారు. ఇంట్లో ఎంత అశాంతి ఉంది. బాబా, మాకు కోపం వస్తుంది, పిల్లలను కొట్టవలసి వస్తుందని అంటారు. మేము 5 వికారాలను శివబాబాకు దానమిచ్చాము, మళ్ళీ మేము ఇలా ఎందుకు చేస్తున్నాము, భయమేస్తుంది అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఈ సమయంలో అందరికీ 5 వికారాల గ్రహణం పట్టి ఉంది, దేహాభిమానమనే భూతం రావడంతో మిగిలిన భూతాలన్నీ వచ్చేస్తాయి. దేహీ-అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీకు వివేకం లభించింది. సత్యయుగంలో కూడా మనం ఆత్మాభిమానులుగా ఉండేవారము. ఆత్మ యొక్క ఈ శరీరము ఇప్పుడు పాతదిగా అయ్యింది, ఆయుష్షు పూర్తయ్యింది కావున ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు కొత్తది తీసుకోవాలి అని భావిస్తారు. (సర్పం యొక్క ఉదాహరణ) సర్పానికి ఒక కుబుసం పాతదైతే, మళ్ళీ మరొక కొత్తది తీసుకుంటుంది. ఇది సత్యయుగానికి సంబంధించిన ఉదాహరణ. అక్కడ మీరు శరీరాన్ని ఎలా వదలుతారంటే, దుఃఖించే విషయమేమీ ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం ఉంటుంది. ఏడ్వడం, పెడబొబ్బలు పెట్టడం చేస్తారు. ఇది పాత శరీరమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ కొత్త శరీరమేమీ లభించదు. ఇది అంతిమ పాత చెప్పు. ఇప్పుడు మీరు దీనితో విసిగిపోయారు. అక్కడైతే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడకు ఎంతమంది కొత్తవారు వస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. రెండు-నాలుగు రోజులు ఇక్కడ అర్థం చేసుకొని వెళ్తారు, తర్వాత మర్చిపోతారు. మంచి రీతిలో విని, సంతోషం కలిగినట్లయితే ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా చాలా మంది తయారవ్వాలి కదా. ఇది ఈశ్వరుని గడప మరియు ఇల్లు, మీరు ఈశ్వరుని ఇంట్లో కూర్చొని ఉన్నారు. పరమపిత వారి పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులోకి వచ్చి కూర్చున్నారు. అక్కడైతే తండ్రి వద్ద ఆత్మలుంటాయి. ఇక్కడ సంగమంలో, పతితులను పావనంగా చేసేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివుడనే అంటారు. ఆత్మలు నిరాకార బాబాను – ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మనుష్యులు అర్థాన్ని తెలుసుకోకుండా – ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ లక్ష్మీ నారాయణులను కూడా యూరోపియన్లు భగవతి-భగవానులని అంటారు. వీరిని ఈ విధంగా ఎవరు తయారుచేసారు? మీరు సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని ఈ దేవతలను అంటారు, తర్వాత స్వయాన్ని ఏమని అనుకుంటారు? వీరు కూడా మనుష్యులేనని, భారత్ లోనే రాజ్యం చేసి వెళ్ళారని తెలియదు. వారి ముందుకు వెళ్ళి మహిమను పాడుతారు. స్వయాన్ని నీచులము, పాపులము అని అనుకుంటూ ఉంటారు. కృష్ణుని మందిరాలకు కూడా వెళ్ళి మహిమ చేస్తారు. శివుడిని ఇలా మహిమ చేయరు. వారి మహిమ వేరు. చాలా వరకు శివుని వద్దకు వెళ్ళినప్పుడు జోలెను నింపండి అని అంటారు. మరోవైపు వారు భంగు తాగేవారని, ఉమ్మెత్త పువ్వులను తినేవారని అంటారు. అరే, అక్కడ భంగు, ఉమ్మెత్త పువ్వులు ఎక్కడ నుండి వచ్చాయి? ఏమీ తెలివి లేదు. పతి కావాలి, ఇది కావాలి….. అని అడుగుతూ ఉంటారు. దీపావళి నాడు కూడా లక్ష్మిని ఆహ్వానిస్తారు. కానీ, లక్ష్మీ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. 8-10 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు ఎందుకంటే అది ప్రవృత్తి మార్గము. వారికి విష్ణువు అన్న పేరును పెట్టారు. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉంటారు. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీనారాయణుల ద్వారా పాలన జరుగుతుందని మనుష్యులకు తెలియదు. చిత్రాలలో లక్ష్మికి 4 భుజాలను చూపిస్తారు. 4 భుజాలున్నవారికి పిల్లలు కలిగితే, వారికి కూడా 4 భుజాలు ఉండాలి. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటివరకైతే రాలేదో, అప్పటివరకు మాకు కూడా ఏమీ తెలియదు – అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. తండ్రి వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తారు. హే పతిత పావనా రండి, అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పరమాత్మ ఎలా వస్తారు? వచ్చి పతితులను పావనంగా ఎలా చేస్తారు? తండ్రి అంటారు – 5 వేల సంవత్సరాల క్రితం నేను దైవీ స్వరాజ్యాన్ని తయారుచేసాను, తర్వాత మీరు 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనే వివేకము ఇంతకుముందు మీ బుద్ధిలో అసలు ఉండేది కాదు. ఈ బ్రహ్మాకు కూడా తెలియదు. రాధా-కృష్ణులు, లక్ష్మీనారాయణుల పూజలు చేస్తూ ఉండేవారు కానీ, రాధా-కృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారని కూడా తెలియదు, అందుకే ప్రిన్సెస్ రాధే, ప్రిన్స్ కృష్ణ (రాకుమారి రాధ, రాకుమారుడు కృష్ణుడు) అని అనడం జరుగుతుంది. స్వయంవరం తర్వాత మహారాజు-మహారాణిగా అవుతారు. ఇలా ఎవరైతే స్వయంగా తయారవుతున్నారో, వారికి కూడా ఇంతకుముందు తెలియదు. కొందరికి సాక్షాత్కారాలు కూడా కలుగుతాయి కానీ ఏమీ అర్థం చేసుకోరు. అయినప్పటికీ, అల్పకాలికముగా భక్తుల భావనలను పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారాలను చేయిస్తాను. ఇక్కడ ధ్యానము-సాక్షాత్కారాల విషయమే లేదు. సాక్షాత్కారాలలో మాయ ప్రవేశించినట్లయితే, మీరు పద భ్రష్టులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. మాకు శివబాబా సాక్షాత్కారం జరగాలని చాలామంది అంటారు. అరే, మీకు అర్థం చేయించడం జరుగుతుంది – మిణుగురు పురుగు ఎంత చిన్నగా ఉంటుంది, దానిని కళ్ళతో చూడవచ్చు. ఆత్మ అయితే దాని కన్నా చిన్న బిందువు. ఆత్మ ఎలా ఉంటుందో, పరమాత్ముని రూపం కూడా అలాగే ఉంటుంది. సాక్షాత్కారం జరిగినా సరే, ఆ చిన్న బిందువు యొక్క సాక్షాత్కారమే జరుగుతుంది. ఇది భృకుటి మధ్యలో ఉండే చిన్న బిందువు. ఆత్మ సాక్షాత్కారం జరిగినా సరే, ఏమీ అర్థం చేసుకోలేరు.
ఇప్పుడు మనం శివబాబా సంతానమని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మాకుమార-కుమారీలందరూ శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇదే మన లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు విద్యార్థులు కదా. తండ్రి నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీరు అంటారు. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. పిల్లలు ఇది మర్చిపోకూడదు. భక్తి మార్గంలోని భక్తులు దేవతల చిత్రాలను తమతో పాటు పెట్టుకుంటారు. అలా మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని పాకెట్ లో పెట్టుకోవాలి. ఈ శివబాబా ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణుల వలె అవుతున్నాము. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శివబాబాకు వికారాల దానమును ఇచ్చి, మళ్ళీ ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. దేహాభిమానమనే భూతం నుండి రక్షించుకోవాలి. ఈ భూతం ద్వారా అన్ని భూతాలు వచ్చేస్తాయి, కావున ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి.
2. ధ్యానము, సాక్షాత్కారాల ఆశను పెట్టుకోకూడదు. లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థం చేయాలి. శ్రీమతంపై అందరికీ సుఖాన్ని ఇవ్వాలి.
వరదానము:-
ఎలాగైతే సాకారంలో (బ్రహ్మాబాబా) స్వయం యొక్క స్మృతిలో ఉండడంతో, వారు ఏ కర్మనైతే చేసారో, అదే బ్రాహ్మణ పరివారానికి నియమంగా అయ్యింది. స్వయం యొక్క నషాలో ఉన్న కారణంగా, సాకారుని ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా కాని, దానిని సరి చేస్తాను అని బాబా అథారిటీతో చెప్పగలిగేవారు. స్వ-స్వరూప స్మృతిలో ఉన్నట్లయితే, ఏ కర్మ కూడా అసలు వ్యతిరేకంగా జరుగజాలదు అన్న నషా ఉంటుంది. అలా పిల్లలైన మీరు కూడా స్వ-స్థితిలో స్థితులై ఉన్నట్లయితే, ఏ సంకల్పం నడిచినా, ఏ మాట మాట్లాడినా లేదా ఏ కర్మ చేసినా, అదే నియమంగా తయారవుతుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!