3 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 2, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానముంటుందో, అప్పుడే తండ్రి యొక్క స్మృతి నిలుస్తుంది, జ్ఞానయుక్తమైన బుద్ధితో ఆత్మిక యాత్రను చేయాలి మరియు చేయించాలి’’

ప్రశ్న: -

ఈశ్వరుడే దాత, అయినప్పటికీ ఈశ్వరార్థము దానం చేసే ఆచారం ఎందుకు కొనసాగుతూ వస్తుంది?

జవాబు:-

ఎందుకంటే ఈశ్వరుడిని తమ వారసునిగా చేసుకుంటారు. దీని ప్రతిఫలాన్ని వారు మరుసటి జన్మలో ఇస్తారని భావిస్తారు. ఈశ్వరార్థము ఇవ్వడము అనగా వారిని తమ కొడుకుగా చేసుకోవడము. భక్తి మార్గంలో కూడా కొడుకుగా చేసుకుంటారు అనగా అంతటినీ వారిపై బలిహారం చేస్తారు, అందుకే ఒక సారి బలిహారం అయినందుకు రిటర్నులో వారు 21 జన్మలు బలిహారమవుతారు. మీరు గవ్వలు తీసుకుని వస్తారు, తండ్రి నుండి వజ్రాలు తీసుకుంటారు. దీని గురించే సుదాముని ఉదాహరణ ఉంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

రాత్రి ప్రయాణీకుడా… (రాత్ కే రాహీ…)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటలోని ఒక్క లైనుతోనే అర్థం చేసుకుని ఉంటారు. తండ్రి మనల్ని పిల్లలూ అని అంటున్నప్పుడు ఆత్మలైన మనకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారని అర్థం చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మ మరియు శరీరము రెండు వస్తువులు అన్నదైతే తప్పకుండా అందరికీ తెలుసు. కానీ ఆత్మలమైన మనకు తండ్రి కూడా ఉంటారని అర్థం చేసుకోరు. ఆత్మలమైన మనం నిర్వాణధామ నివాసులము. ఈ విషయాలు బుద్ధిలోకి రావు. ఈ జ్ఞానం పూర్తిగా కనుమరుగైపోతుంది అని తండ్రి అంటారు కదా. ఇప్పుడు ఈ నాటకం పూర్తవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అపవిత్రమైన పతిత ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఒక్కరు కూడా వెళ్ళలేరు, ఇది డ్రామా. ఎప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడకు వచ్చేస్తారో, అప్పుడు తిరిగి వెళ్ళడం మొదలుపెడతారు. తండ్రి మనకు ఆత్మిక యాత్ర నేర్పిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. వారు అంటారు – ఓ ఆత్మలూ, ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే యాత్రను చేయాలి. జన్మ-జన్మాంతరాలు మీరు దైహిక యాత్రలు చేస్తూ వచ్చారు. ఇప్పుడిది మీ ఆత్మిక యాత్ర. ఇక్కడి నుండి వెళ్ళి, ఇక మృత్యులోకంలోకి మళ్ళీ తిరిగి రాకూడదు. మనుష్యులు దైహిక యాత్రలకు వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. అది దైహిక దేహాభిమానీ యాత్ర. ఇది ఆత్మిక యాత్ర. అనంతమైన తండ్రి తప్ప ఈ యాత్రను ఎవరూ నేర్పించలేరు. పిల్లలైన మీరు శ్రీమతంపై నడవాలి. మొత్తం ఆధారమంతా స్మృతియాత్రపై ఉంది, ఏ పిల్లలు ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పొందుతారు. ఎవరికైతే ఎంతో కొంత జ్ఞానముందో, వారి స్మృతి నిలుస్తుంది. 84 జన్మల చక్రం యొక్క జ్ఞానం కూడా ఉంది కదా. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇది 84 జన్మల చక్రం యొక్క యాత్ర, దీనిని రావడం-వెళ్ళడం యొక్క యాత్ర అని అంటారు. రావడము-వెళ్ళడము అయితే అందరిదీ జరుగుతూ ఉంటుంది. రావడము మరియు వెళ్ళడము. జన్మ తీసుకోవడము మరియు వదిలేయడము, దీనిని ఆవాగమనం అని అంటారు. ఇప్పుడు మీరు ఈ దుఃఖధామం యొక్క రాకపోకల చక్రం నుండి విముక్తులవుతూ ఉన్నారు. ఇది దుఃఖధామము, ఇప్పుడు మీ జనన-మరణాలన్నీ అమరలోకంలో జరగనున్నాయి, దాని కోసం మీరు పురుషార్థం చేయడానికి అమరనాథుని వద్దకు వచ్చారు. మీరందరూ పార్వతులు, సదా అమరుడైన అమరనాథుడి నుండి అమరకథను వింటారు. మీరు సదా అమరులు కారు. మీరు జనన-మరణ చక్రంలోకి వస్తారు. ఇప్పుడు మీ చక్రం నరకములో ఉంది, దీని నుండి మిమ్మల్ని విముక్తులుగా చేసి రాకపోకలు స్వర్గములో జరిగేలా చేస్తారు. అక్కడ మీకు ఏ దుఃఖము ఉండదు. ఇది మీ అంతిమ జన్మ. వినాశనము ఎలా జరుగుతుంది అనేది మీరు చూస్తూ ఉంటారు. యుద్ధము జరగకూడదు అని ఏదైతే వారు తల బాదుకుంటూ ఉంటారో లేక బాంబులు తీసుకువెళ్ళి సముద్రంలో వేయండి అని ఏదైతే చెప్తూ ఉంటారో, ఇదంతా పాపం వారు చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు సమయం పూర్తయ్యిందని వారికి తెలియదు.

ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు మరియు ప్రపంచంలోని వారేమో – ఇప్పుడు ఇంకా కలియుగం మొదలవుతుందని, 40 వేల సంవత్సరాల తర్వాత సంగమం రానున్నదని అనుకుంటారు. ఈ మాట కూడా శాస్త్రాల నుండి వెలువడింది. తండ్రి అంటారు – మీరు జన్మ-జన్మాంతరాలుగా వేద-శాస్త్రాలు ఏవైతే చదువుతూ వచ్చారో, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తూ వచ్చారో – ఇదంతా భక్తి మార్గము. మనం మొదట బ్రాహ్మణులుగా, ఆ తర్వాత దేవతలుగా అవుతామని మీకు తెలుసు. బ్రాహ్మణ వర్ణము అన్నింటికన్నా ఉన్నతమైనది. ఇది ప్రాక్టికల్ విషయము. బ్రాహ్మణులుగా అవ్వకుండా ఎవరూ దేవతా వర్ణంలోకి రాలేరు. మనం బ్రహ్మా యొక్క పిల్లలమని, శివబాబా నుండి దైవీ రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీరు నిశ్చయం ఏర్పర్చుకుంటారు. ఇప్పుడు మీ పురుషార్థం నడుస్తూ ఉంది. రేస్ కూడా చేయాల్సి ఉంటుంది. మంచి రీతిలో చదువుకుని, ఆ తర్వాత ఇతరులను కూడా చదివించాలి, యోగ్యులుగా తయారుచేయాలి, అప్పుడు వారు కూడా స్వర్గ సుఖాలను చూస్తారు. కృష్ణపురిని అయితే అందరూ తలచుకుంటారు. శ్రీరాముడిని చిన్నతనంలో ఊయలలో ఊపరు. శ్రీకృష్ణుడినైతే చాలా ప్రేమిస్తారు, కానీ అంధ విశ్వాసంతో ప్రేమిస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయంలో ఈ సృష్టి అంతా తమోప్రధానంగా, నల్లగా ఉందని తండ్రి అర్థం చేయించారు. భారత్ చాలా సుందరంగా, బంగారు యుగముగా ఉండేది. ఇప్పుడు ఇనుప యుగములో ఉంది. మీరు కూడా ఇనుప యుగములో ఉన్నారు, ఇప్పుడు బంగారు యుగములోకి వెళ్ళాలి. తండ్రి కంసాలి పని చేస్తున్నారు. మీ ఆత్మలో ఇనుము మరియు రాగి యొక్క మాలిన్యం ఏదైతే చేరిందో, అది తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము, రెండూ అసత్యంగా అయ్యాయి. ఇప్పుడు మీరు మళ్ళీ సత్యమైన బంగారంగా అవ్వాలి. సత్యమైన బంగారంలో ఎక్కువ మాలిన్యాన్ని కలిపితే మొత్తం కల్తీ అయిపోతుంది. మీ ఆత్మలో ఇప్పుడు చాలా కొంచెం బంగారం మిగిలి ఉంది. నగ కూడా పాతదిగా ఉంది, 2 క్యారట్ల బంగారమని అంటారు. కావున తండ్రి కూర్చుని శ్రీమతాన్ని ఇస్తారు. తప్పకుండా భారత్ ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇతర ఏ ధర్మం యొక్క రాజ్యము ఉండేది కాదు, మళ్ళీ ఆ స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. కానీ మాయ చేయనివ్వదు. మాయ మిమ్మల్ని చాలా ఎదిరిస్తుంది. యుద్ధ మైదానంలో మిమ్మల్ని చాలా ఓడిస్తుంది. నడుస్తూ-నడుస్తూ కొంతమంది తుఫానులో చిక్కుకుంటారు, వికారాల్లోకి వెళ్ళి పూర్తిగా నల్ల ముఖం చేసుకుంటారు. తండ్రి అంటారు – ఇప్పుడు నేను మీ ముఖాన్ని తెల్లగా చేస్తాను. మీరు వికారాల్లోకి వెళ్ళి మళ్ళీ నల్ల ముఖం చేసుకోకండి. యోగంతో మీ అవస్థను శుద్ధంగా చేసుకోండి. శుద్ధంగా అవుతూ-అవుతూ మొత్తం మాలిన్యమంతా తొలగిపోతుంది, అందుకే యోగ భట్టీలో ఉండాలి. కంసాలులు ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. అగ్నిలో వేయడంతో బంగారంలో మాలిన్యం తొలగిపోతుంది. అప్పుడది సత్యమైన బంగారం కడ్డీగా అవుతుంది. తండ్రి అంటారు – ఎంతగా మీరు నన్ను స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. తండ్రి అయితే శ్రీమతాన్ని ఇస్తారు, ఇంకేమి చేస్తారు. బాబా, కృప చూపండి అని అంటారు. ఇప్పుడు బాబా ఏమి కృపను చూపగలరు! తండ్రి అయితే స్మృతిలో ఉంటే మాలిన్యం తొలగిపోతుందని అంటారు. కావున స్మృతిలో ఉండాలా లేక కృపను, ఆశీర్వాదాలను అడగాలా? ఈ విషయంలోనైతే ప్రతి ఒక్కరూ తమ కృషిని తాము చేయాలి.

తండ్రి అంటారు, ఆత్మిక పిల్లలూ, ఈ యాత్రలో అలసిపోకండి. పదే-పదే తండ్రిని మర్చిపోకండి. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంత సమయము మీరు భట్టీలో ఉన్నట్లు. స్మృతి చేయకపోతే, భట్టీలో లేనట్లు. అప్పుడిక మీ ద్వారా ఇంకా వికర్మలు జరుగుతాయి, అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, దాని వలన మీరు నల్లగా అవుతారు. కృషి చేసి, తెల్లగా అయ్యి మళ్ళీ నల్లగా అయినట్లయితే, మీరు అప్పటికే 50 శాతం నల్లగా ఉన్నారు, ఇప్పుడిక 100 శాతం నల్లగా అయిపోతారు. కామ వికారమే మిమ్మల్ని నల్లగా చేసింది. అది కామ చితి, ఇది జ్ఞాన చితి. ముఖ్యమైన విషయము కామ వికారానికి సంబంధించింది. ఇంట్లో గొడవలు జరిగేదే ఈ విషయముపైన. కుమారీలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది, ఇప్పుడు మీరు పవిత్రంగా ఉన్నారు కావున మంచిగా ఉన్నారు కదా. కుమారీలకు అందరూ పాదాలకు నమస్కరిస్తారు ఎందుకంటే వారు పవిత్రమైనవారు. మీరందరూ బ్రహ్మాకుమారీలు కదా. బ్రహ్మాకుమారీలైన మీరే భారత్ ను స్వర్గంగా చేస్తారు. కావున మీ స్మృతిచిహ్నాలు భక్తి మార్గంలో కొనసాగుతూ ఉంటాయి. కుమారీలకు చాలా గౌరవాన్ని ఇస్తారు. బ్రహ్మాకుమారులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాతలది. తండ్రి స్వయంగా వచ్చి, వందే మాతరం అని అంటారు. మీరు తండ్రిని వారసునిగా చేసుకుంటారు. భక్తి మార్గంలో మీరు ఈశ్వరునికి ఎందుకు దానము ఇస్తారు? తండ్రి అనేవారు పిల్లలకు ఇస్తారు కదా. మరి ఈశ్వరునికి ఎందుకు దానము చేస్తారు? ఈశ్వరార్థము చేస్తారు. కృష్ణార్థము చేస్తారు. కృష్ణుడు మీకు ఏమవుతారని మీరు వారికి ఇస్తారు? ఏదో ఒక అర్థముండాలి కదా. కృష్ణుడేమీ పేదవారు కాదు. అయినా ఈశ్వరార్థము అని అంటారు, కృష్ణార్థము ఉండనే ఉండదు. వారు సత్యయుగం యొక్క రాకుమారుడు. తండ్రి అర్థం చేయిస్తారు – నేను అందరి మనోకామనల్ని పూర్తి చేస్తాను. కృష్ణుడు మనోకామనలను పూర్తి చేయలేరు. వారైతే కృష్ణుడిని ఈశ్వరునిగా భావించి కృష్ణార్పణమ్ అని అంటారు. వాస్తవానికి ఫలమిచ్చేవాడిని నేను. భక్తి మార్గంలోని విషయాలన్నింటినీ అర్థం చేయించడం జరుగుతుంది. శివబాబాకు మీరు ఇస్తున్నారంటే తప్పకుండా వారు మీకు కొడుకు అయినట్లు కదా. భక్తి మార్గంలో కూడా కొడుకు, ఇక్కడ కూడా కొడుకు. భక్తి మార్గంలో అల్పకాలం కోసం ప్రతిఫలం లభిస్తుంది. ఇప్పుడైతే డైరెక్టుగా చేస్తారు, అందుకే మీకు 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే పూర్తిగా బలిహారమవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి బలిహారమయితే, వీరు 21 సార్లు బలిహారమవుతారు. మీరు తండ్రి నుండి వజ్రాలు తీసుకునేందుకు గవ్వలను తీసుకొస్తారు. మేము పిడికెడు బియ్యం శివబాబా భండారములో వేస్తామని లోలోపల భావిస్తారు. సుదాముని విషయము ఇప్పటిదే. శివబాబా మీకు ఏమవుతారని మీరు వారికిస్తారు? వారు మీకు కొడుకు, కావున మీరు పెద్దవారు అయినట్లు కదా. ఒకటి ఇస్తే లక్ష పొందుతామని భావిస్తారు. ఇచ్చేటువంటి దాత వారొక్కరే. సాధువులు మీకేమీ ఇవ్వరు. భక్తి మార్గంలో కూడా నేను ఇస్తాను, అందుకే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని బాబా అడుగుతారు. అలా అడిగినప్పుడు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు – మనం శివబాబాపై బలిహారమవుతాము. మన తనువు-మనసు-ధనము అన్నీ వారివే. వారు మనకు 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. షావుకార్ల హృదయము విదీర్ణమవుతుంది. బాబా పేరే పేదల పెన్నిధి. తండ్రి అంటారు – మీరు మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. అంతేకానీ మీరు ఇక్కడ కూర్చుని ఉండిపోవడం కాదు, కేవలం శ్రీమతంపై నడుస్తూ ఉండండి. నన్నొక్కరినే స్మృతి చేయండి, అంతే. భక్తి మార్గంలో కూడా, నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని మీరు పాడేవారు. పిల్లలైన మీకు ఎన్ని విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది. అందరూ ఒకే లాంటి వివేకం కలవారు ఉండరు. అటువంటివారు చివర్లో వెలువడుతారు. ఆ సమయంలో మనలో శక్తి కూడా ఉంటుంది. మీరు చెప్పింది విని వెంటనే వచ్చి గ్రహిస్తారు. తండ్రి మమ్మల్ని 21 జన్మల కోసం స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారని నిశ్చయముండాలి, అప్పుడిక ఒక్క సెకెండు కూడా వదలరు. ఈ బాబా వారి అనుభవాన్ని కూడా వినిపిస్తారు కదా. వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. కూర్చుని-కూర్చునే ఏమయ్యింది! బాబా నుండి రాజ్యాధికారం లభిస్తుందని చూసారు, అంతే. వినాశనం కూడా చూసారు, ఆ తర్వాత రాజ్యాధికారం కూడా చూసారు, అప్పుడు – ఇక చాలు, ఈ దాసత్వాన్ని వదిలేయాలి అని అన్నారు. సాక్షాత్కారం జరిగింది కానీ జ్ఞానం లేదు. నాకు చక్రవర్తి పదవి లభిస్తుంది, అంతే. తండ్రి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చారని గమనించినప్పుడు వారిని వెంటనే పట్టుకోవాలి కదా. బాబా, ఇదంతా మీదే. మీ కార్యంలోనే ఉపయోగపడుతుంది. బాబా కూడా అంతటినీ ఈ మాతల చేతికి ఇచ్చారు. మాతల కమిటీని తయారుచేసారు, వారికి ఇచ్చారు. బాబానే అంతా చేయించేవారు. బాబా నుండి 21 జన్మల కోసం రాజ్యాధికారం లభిస్తుందని అర్థం చేసుకున్నారు, కావున ఇప్పుడు మీరు కూడా తీసుకోండి కదా. బాబా వెంటనే దాసత్వాన్ని వదిలేసారు. ఎప్పటి నుండైతే వదిలేసారో, అప్పటి నుండి చాలా సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఈ విధంగా మనం అనేకసార్లు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపించాము. బాబా బ్రహ్మాకుమార-కుమారీల ద్వారా అనేక సార్లు స్థాపన చేసి ఉంటారు. విషయమిది అన్నప్పుడు ఇక ఆలస్యమెందుకు చేయాలి? బాబా నుండైతే మనం 21 జన్మల వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. బాబా ఇళ్ళు-వాకిళ్ళను వదిలిపెట్టేలా చేయరు. వాటిని కూడా మంచి రీతిలో సంభాళించండి కానీ కేవలం తండ్రిని స్మృతి చేయండి. మేము బాబాకు చెందినవారిగా అయ్యాము అన్న నషా ఉండాలి. బాబాకు రాస్తారు – బాబా, ఫలానావారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలవారిగా, వివేకవంతులుగా ఉన్నారు, వారు అనేక మందికి అర్థం చేయిస్తారు అని. కానీ నిశ్చయబుద్ధి కలవారు నా వద్దకైతే రావడం లేదే. బాబాను కలుసుకోకుండానే మరణిస్తే, ఇక బాబా నుండి వారసత్వం ఎలా లభిస్తుంది. ఇక్కడ తండ్రి ఒడిలోకి రావాల్సి ఉంటుంది కదా. నిశ్చయం ఏర్పడింది, శరీరం వదిలారు, ఇక అప్పుడు ఏ శ్రమ చేయలేనట్లు. ఇనుప యుగం వారి నుండి బంగారు యుగం వారిగా అవ్వలేదంటే సాధారణ ప్రజల్లో జన్మ తీసుకుంటారు. ఒకవేళ పిల్లలుగా అయి మంచి రీతిలో పక్కాగా అయిన తర్వాత శరీరం వదిలితే, అప్పుడు వారసులుగా అవుతారు. వారసులుగా అయ్యేందుకు శ్రమ ఏమైనా అనిపిస్తుందా. కొందరు సూర్యవంశ రాజ్యాన్ని పొందుతారు, కొందరు సేవ చేస్తూ-చేస్తూ చివర్లో ఒక్క జన్మ కోసం రాజ్య పదవిని పొందుతారు. అదేమైనా సుఖమా. రాజ్య సుఖము అనేది ముందు నుండే ఉంటుంది, ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. పిల్లలు పురుషార్థం చేసి తల్లిదండ్రులను ఫాలో చేయాలి. మమ్మా-బాబాల సింహాసనంపై కూర్చునేందుకు యోగ్యులుగా అవ్వండి. హార్ట్ ఫెయిల్ ఎందుకవ్వాలి! పురుషార్థం చేసి ఫాలో చేయ్యండి. సూర్యవంశ సింహాసనానికి యజమానులుగా అవ్వండి. స్వర్గములోకైతే రండి కదా. ఫెయిల్ అయితే చంద్రవంశములోకి వెళ్ళిపోతారు, రెండు కళలు తగ్గిపోతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి ఆశీర్వాదాలను అడిగేందుకు బదులుగా స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి. ఆత్మిక యాత్రలో ఎప్పుడూ అలసిపోకూడదు.

2. శివబాబాను తమ వారసునిగా చేసుకుని వారిపై పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి. తల్లిదండ్రులను ఫాలో చేయాలి. 21 జన్మల రాజ్య సుఖాన్ని తీసుకోవాలి.

వరదానము:-

నిమిత్తంగా అయ్యే పాత్ర సదా అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. ఒకవేళ నిమిత్త భావం యొక్క అభ్యాసం స్వతహాగా మరియు సహజంగా ఉన్నట్లయితే, సదా స్వయం యొక్క ప్రగతి మరియు సర్వుల ప్రగతి ప్రతి అడుగులో ఇమిడి ఉంటుంది. అటువంటి ఆత్మల అడుగు భూమిపై కాదు కానీ స్టేజిపై ఉంటుంది. నిమిత్తంగా ఉన్న ఆత్మలు సదా ఈ స్మృతి స్వరూపంలో ఉంటారు – మేము విశ్వం ఎదురుగా తండ్రి సమానము అన్నదానికి ఉదాహరణగా ఉన్నాము.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top