18 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

18 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

17 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - పరచింతనను వదిలి మీ కళ్యాణం చేసుకోండి, మీరు బంగారం వలె తయారై ఇతరులకు మార్గాన్ని తెలియజేయండి”

ప్రశ్న: -

ఎవరైతే అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని సదా చేస్తూ ఉంటారో, వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి?

జవాబు:-

వారు తమ కర్మేంద్రియాలను హఠంతో వశం చేసుకోరు, కానీ వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమైపోతాయి. ఆత్మలమైన మనం సోదరులము అనే స్మృతి స్వతహాగానే ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. నామ రూపాల నషా సమాప్తమవుతూ ఉంటుంది. ఇతరుల స్మృతి కలగదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు ప్రేమ సాగరుడవు… (తూ ప్యార్ కా సాగర్ హై…)

ఓంశాంతి. వీరు కేవలం ప్రేమసాగరుడు మాత్రమే కాదు, జ్ఞానసాగరుడు కూడా. జ్ఞానము మరియు అజ్ఞానము. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానమనే పదం మంచిది. అజ్ఞానం అనే పదం చెడ్డది. అర్ధకల్పం జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. అర్ధకల్పం అజ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది, అజ్ఞాన ప్రారబ్ధము దుఃఖము. జ్ఞాన ప్రారబ్ధము సుఖము. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. పగలు జ్ఞానానికి సంబంధించింది, రాత్రి అంటే అజ్ఞానము. జ్ఞానమని దేనినంటారు, అజ్ఞానమని దేనినంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు, ఇవి అనంతమైన విషయాలు. జ్ఞానమంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అనేది మీరు అందరికీ అర్థం చేయిస్తారు. జ్ఞానం ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. మీరు పూజ్యులుగా అయినప్పుడు పూజా సామగ్రి గురించి తెలుసుకుంటారు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ స్మృతిచిహ్నాలని మీకు తెలుసు. వారి జీవిత కథ ఏమిటి అనేది మీకు తెలుసు. ఎవరైతే పూజ చేసేందుకు వెళ్తారో, వారికి ఈ విషయాలు తెలియవు. పూజను భక్తి అని అంటారు, భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులను కలవాల్సి ఉంటుంది. ఆ భగవంతుడే వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తారు. పూజ్యులుగా సత్యయుగంలో, పూజారులుగా కలియుగంలో ఉంటారు. ఈ రోజు ఏముంది, రేపు ఏమి జరగనున్నది అని పిల్లలైన మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగబోతుంది, అది ఎప్పుడైనా జరగవచ్చు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయని అంటూ ఉంటారు. ఇలా రాయాలి – గృహ యుద్ధాలను మరియు ప్రాకృతిక ఆపదలను ఈశ్వరీయ ఆపదలు అనరు, ఇవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలన్నీ సంభవించనున్నాయి, ఇవి వినాశనంలో కూడా సహయోగం చేస్తాయి, కుండపోత వర్షం కురుస్తుంది, ఆకలితో మరణిస్తారు, భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి. వీటి ద్వారానే వినాశనం జరగనున్నది. ఇవన్నీ తప్పకుండా జరుగబోతున్నాయని పిల్లలకు తెలుసు. లేదంటే సత్యయుగంలో ఇంత తక్కువ మంది మనుష్యులు ఎలా ఉంటారు, తప్పకుండా ఒక్కసారిగా అంతా వినాశనం అవుతుంది. ఈ వస్త్రాలన్నీ శుభ్రం చేయబడతాయని, ఇది అనంతమైన పెద్ద మెషినరీ అని పిల్లలకు మంచి రీతిలో తెలుసు. మురికి పట్టిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేస్తారు… అని అంటూ ఉంటారు. ఇది ఈ స్థూల వస్త్రాలకు సంబంధించిన విషయం కాదు. ఇది శరీరానికి సంబంధించిన విషయము. ఆత్మలను యోగబలంతో శుభ్ర పరచుకోవాలి. ఈ సమయంలో 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి కావున శరీరాలు కూడా అదే విధంగా తయారవుతాయి. పతితపావనుడైన తండ్రి వచ్చి పావనంగా తయారుచేస్తారు, మిగిలినవారంతా సమాప్తమైపోతారు. పావనంగా ఎలా అవుతారు అనేది మీకు తెలుసు. చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడైతే భక్తి, యజ్ఞాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో, అక్కడకు వెళ్ళి ఇలా అర్థం చేయించాలి – మీరు ఎవరి భక్తినైతే చేస్తున్నారో, వారి జీవితచరిత్ర గురించి తెలుసుకుంటేనే మీరు దేవతలుగా అవ్వగలరు, వారు జీవన్ముక్తిని ఎలా పొందారు అనేదైతే అర్థం చేసుకోండి, అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందగలరు. మందిరాలలో కూర్చొని వారి జీవిత కథను అర్థం చేయించినట్లయితే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు.

మీరు కూడా ఇప్పుడు తండ్రి నుండి జీవిత కథను వింటున్నారు, పిల్లలైన మీకు ఎంత వివేకం లభిస్తుంది. పరమపిత పరమాత్మ యొక్క జీవిత కథ గురించి ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనడంతో అది జీవిత కథ అవ్వదు. ఇప్పుడు పిల్లలైన మీకు పరమపిత పరమాత్మ యొక్క జీవిత కథ గురించి తెలుసు అనగా ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తున్న ఈ సమయాన్ని ఆది సమయము అని అంటారు, తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది. తండ్రి అంటారు – ఈ సమయంలో నేను వచ్చి స్థాపన చేస్తాను మరియు చేయిస్తాను, నేను చేసేవాడిని-చేయించేవాడిని. ప్రేరణ ఇవ్వడాన్ని చేయడమని అనరు. బాబా వచ్చి వీరి కర్మేంద్రియాల ద్వారా చేస్తారు, ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. చేసేవారు-చేయించేవారు తప్పకుండా సమ్ముఖంగా ఉంటూ చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఈశ్వరుడే ప్రేరణతో అంతా చేస్తారని చాలామంది అంటూ ఉంటారు – బాబా, నా పతి యొక్క బుద్ధి బాగయ్యేలా మీరు ప్రేరణ ఇవ్వండి. తండ్రి అంటారు – ఇందులో ప్రేరణ యొక్క విషయమే లేదు. అటువంటప్పుడు శివజయంతిని ఎందుకు జరుపుకుంటారు. ప్రేరణతో పని జరిగితే, ఇక వారు ఎందుకు రావాలి? ముందు, ఈశ్వరుడంటే ఎవరు అనేది తెలియదు. ఈశ్వరుని ప్రేరణతోనే అంతా జరుగుతుందని కేవలం అనేస్తారు. నిరాకారుడు ప్రేరణతో ఎలా చేస్తారు, వారు చేసేవారు-చేయించేవారు. వారు వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని వినిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారం తీసుకోనంత వరకు మురళిని ఎలా వినిపించగలరు. వారు జ్ఞానసాగరుడు, మరి వినిపించడానికి నోరు కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానం లభించింది. జ్ఞానం లేకుండా గతి ఉండదని భావిస్తారు. మరి జ్ఞానం ఎవరు ఇవ్వాలి. అజ్ఞాన మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి మధ్యన తేడాను చూడండి. విజ్ఞానము అని కూడా అంటారు. అజ్ఞానం అంటే అంధకారం, ఇకపోతే జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని మనం ముక్తి-జీవన్ముక్తి అని కూడా అనవచ్చు. ఇప్పుడు మీకు పావనంగా అయ్యే జ్ఞానం లభిస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఆత్మ, జ్ఞానం తీసుకుంటుందంటే తప్పకుండా ఆ సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా, మరి మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారంటే ఈ జ్ఞానం కూడా తర్వాత నిలవాలి కదా అని అంటారు. కానీ తండ్రి అర్థం చేయిస్తారు – ఈ పురుషార్థము ప్రారబ్ధాన్ని పొందడం కోసమే, ప్రారబ్ధం లభించిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది. సత్యయుగం అంటేనే పిల్లలైన మీ ప్రారబ్ధము. ఈ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. ఈ జ్ఞానం పరంపరగా ఎందుకు నడవదు అని పిల్లలు అడిగితే, ఇది ప్రాయః లోపమైపోతుంది అని తండ్రి అంటారు. పగలు రాగానే ఇక అజ్ఞానం ఉండదు కావున అక్కడ జ్ఞానం అవసరం ఉండదు. ఇవి కూడా అర్థం చేసుకొని, అర్థం చేయించాల్సిన విషయాలు. ఒక్కసారిగా ఎవరూ అర్థం చేసుకోలేరు. శివబాబా భారత్ లోనే వస్తారు, భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల కోసం కానుకను తీసుకొస్తారు. భక్తి తర్వాత సద్గతి ఉంటుంది. ఈ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. దీని గుర్తులు కనిపిస్తున్నాయి. నిప్పు రవ్వ అంటుకుందంటే, ఇక ఒకటి-రెండు గంటల్లోనే ఇల్లు అంతా కాలి భస్మమైపోతుందని మీరు వింటూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. వినాశనం తప్పకుండా జరగాల్సిందే. సత్యయుగంలో కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు, వారు శ్రేష్ఠాచారులు. మరి శ్రేష్ఠాచారులుగా అవ్వడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధంగా పడిపోయేవారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కోలుకునేందుకు ఎంతో సమయం పడుతుంది. కామ వికారం యొక్క దెబ్బ చాలా పెద్దది, అందుకే కామం మహాశత్రువు అని అంటారు. ఇదే పతితంగా చేస్తుంది. వికారాల కారణంగానే గొడవలు జరుగుతాయి. వికారాల విషయంలో మిమ్మల్ని వదలడం లేదంటే – దీని కన్నా పాత్రలు శుభ్రం చేయడం మంచిదని, తుడిచి, తడి బట్ట పెడతాను కానీ పవిత్రంగా ఉంటాను అని తప్పకుండా చెప్పండి. ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎవరైనా తండ్రి శరణులోకి వస్తే, మాయ కూడా యుద్ధం చేయడం మొదలుపెడుతుంది. 5 వికారాల రోగం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ముందు పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉండాలి. మీరు జీవిస్తూ మరణించి ఉన్నారు. ఇక్కడ నుండి లంగరు ఎత్తివేయబడింది. కలియుగీ, వికారీ తీరాన్ని మీరు వదిలేసారు. ఇప్పుడు మనం యాత్రకు వెళ్తున్నాము – మనం అశరీరులుగా అయ్యి మన ఇంటికి వెళ్తాము. మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తామనే జ్ఞానం ఆత్మకు ఉంది. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అయి యాత్రలో ఉంటాము. ఇది స్మశానవాటిక, తర్వాత మనం సుఖధామంలోకి వెళ్తామని బుద్ధిలో గుర్తుండాలి. బాబా వారసత్వాన్ని ఇచ్చేందుకు మనకు యుక్తులను తెలియజేస్తున్నారు. పావనంగా అయ్యేందుకు మనం యోగంలో ఉంటాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు ఆత్మ శరీరాన్ని వదులుతుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర. కేవలం తండ్రిని స్మృతి చేయండి, తమ రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయం కూడా గుర్తుండదు. అల్ఫ్ ను స్మృతి చేయండి, అంతే. కానీ మాయ అది కూడా స్మృతి చేయనివ్వదు, శ్రమ అనిపిస్తుంది. మా బాబా వచ్చి ఉన్నారని ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలు పరస్పరంలో సోదరులు. దేహాభిమానంలోకి రావడంతో అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు సోదరీ-సోదరులుగా ఉన్నారు. పరస్పరంలో సోదరులు కూడా, సోదరీ-సోదరులు కూడా. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇరువురికీ వారసత్వం కావాలి. ఆత్మనే పురుషార్థం చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించడమే కష్టము. దేహాభిమానం ఉండకూడదు. శరీరమే లేనప్పుడు వికారాలలోకి ఎలా వెళ్తారు. మనం ఆత్మలము, తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీర భానం ఉండకూడదు. ఎంతగా యోగులుగా అవుతూ ఉంటారో, అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. దేహాభిమానంలోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఆత్మకు, తనకు ప్రాప్తి లభిస్తున్న విషయం తెలుసు. శరీరం నుండి వేరు అవుతూ ఉంటే, కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. సన్యాసులు మందులు తీసుకొని కర్మేంద్రియాలను శాంత పరచుకుంటారు. అది హఠయోగం అయినట్లు కదా. మీరు యోగాన్ని ఉపయోగించాలి. యోగబలంతో మీరు వశం చేసుకోలేరా? ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో, అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తాయి. చాలా శ్రమించాల్సి ఉంటుంది, ప్రాప్తి చాలా ఉన్నతమైనది కదా. తండ్రి అంటారు – యోగబలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, కర్మేంద్రియాలపై విజయం పొందుతారు, అందుకే భారత్ యొక్క యోగం ప్రసిద్ధమైనది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగబలంతో మీరు స్వర్గవాసులుగా అవుతారు. బాహుబలంతో స్వర్గవాసులుగా అవ్వలేరు. ఇందులో చాలా శ్రమ ఏమీ లేదు. కుమారీలకు అయితే శ్రమ ఏ మాత్రం లేనట్లే. వారు ఫ్రీగా ఉంటారు. వికారాలలోకి వెళ్తే, పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారిగా ఉండడం మంచిది. లేకపోతే అధర్ కుమారి అనే పేరు వస్తుంది. యుగళులుగా కూడా ఎందుకవ్వాలి! ఇందులో కూడా నామ రూపాల నషా ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ఠ కావాలి. చాలా మంది ధైర్యం చేస్తారు కానీ అగ్ని సెగ తగిలిందంటే ఇక ఆట సమాప్తమైపోతుంది, అందుకే కుమారిగా ఉండడం చాలా మంచిదని బాబా అంటారు. అధర్ కుమారిగా అవ్వాలనే ఆలోచన కూడా ఎందుకు చేయాలి. కుమారీల పేరు ప్రసిద్ధి చెందింది. వారు బాల బ్రహ్మచారులు. బాల బ్రహ్మచారులుగా ఉండడం మంచిది, శక్తి ఉంటుంది. ఇంకెవరి స్మృతి కలగదు. మరి ధైర్యముంటే చేసి చూపించండి, కానీ ఇందులో శ్రమ ఉంటుంది. అక్కడ ఇద్దరు అయిపోతారు కదా. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు. ఇద్దరు ఉంటే ద్వైతం ఏర్పడుతుంది. ఎంత వీలైతే అంత, కుమారిగా ఉండడం మంచిది. కుమారీలు సేవ చేసేందుకు వెళ్ళొచ్చు. బంధనంలో చిక్కుకోవడంతో ఆ బంధనాలు ఇంకా వృద్ధి చెందుతాయి. బుద్ధి చిక్కుకుపోయే విధంగా అసలు వల అల్లుకోవడం ఎందుకు. ఇలా వలలో చిక్కుకోవడం మంచిది కాదు. కుమారీలకు చాలా బాగుంటుంది. కుమారీలు పేరును నిలబెట్టారు. కన్నయ్య అనే పేరును తలచుకుంటూ ఉంటారు కదా. కుమారీలుగా ఉండడం చాలా మంచిది. వీరికి ఇది చాలా సహజము. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితం కూడా. బుద్ధి కూడా ఫ్రెష్ గా ఉంటుంది. కుమారులు భీష్మ పితామహుని వలె అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలా ఉన్నారు, అందుకే దిల్వాడా మందిరంలో స్మృతిచిహ్నం తయారుచేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తున్నారు – నన్ను స్మృతి చేయండి, మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి, తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణముంది. పొరపాట్లు జరుగుతాయి, పిల్లలు పడిపోతారు, మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం చేసుకోండి. వేరే చింతనలోకి వెళ్ళనే వెళ్ళకండి. మీరు బంగారం వలె అవ్వండి, ఇతరులకు కూడా మార్గాన్ని చూపించండి. సతోప్రధానంగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయముంది. పావనంగా అవ్వకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు. ఉపాయం ఒక్కటే ఉంది, తర్వాత అంత మతి సో గతి అవుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). పరచింతన విషయాలను వదిలేయండి. వదలకపోతే మిమ్మల్ని మీరే నష్టపరచుకుంటారు. తండ్రి ఏమీ శాపమివ్వరు. శ్రీమతంపై నడుచుకోకపోతే మిమ్మల్ని మీరే శాపగ్రస్తులుగా చేసుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నిశ్చయబుద్ధి కలవారిగా అయి జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి మీ లంగరును ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి తమ కళ్యాణం చేసుకోవాలి.

2. ఇతరుల చింతన వదిలి తమ బుద్ధిని స్వచ్ఛమైన బంగారం వలె తయారుచేసుకోవాలి. వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని నష్టపరచుకోకూడదు. యోగబలంతో తమ కర్మేంద్రియాలను శాంతిగా, శీతలంగా చేసుకోవాలి.

వరదానము:-

ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావిస్తూ నడుచుకుంటారో, వారు తమ దేహమనే ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అవుతారు. అతిథులకు తమదంటూ ఏమీ ఉండదు, పనులకు అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అనే భావముండదు. వారు అన్ని సాధనాలను ఉపయోగిస్తూ కూడా, ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియంగా ఉంటారు. దేహం, దేహ సంబంధాలు మరియు వైభవాలతో సహజంగా ఉపరామంగా ఉంటారు. అతిథిని అనే వృత్తి ఎంతగా ఉంటుందో, అంతగా ప్రవృత్తి శ్రేష్ఠంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top