18 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

18 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu 

June 17, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మీ సేవ చేసేందుకు వచ్చారు, మీరు కూడా తండ్రి సమానంగా అయి అందరి సేవ చేయండి”

ప్రశ్న: -

బ్రహ్మా బాబాకు కలిగే ఏ ఆలోచనకు, శివబాబా వెయిట్ ఎండ్ సీ (వేచి చూడండి), చింత చేయకండి అని అంటారు?

జవాబు:-

బాబాకు ఆలోచన కలుగుతుంది – సమయం చాలా సున్నితంగా అవుతూ ఉంది, పిల్లలకు అవినాశీ జ్ఞాన రత్నాలను తీసుకునేందుకు తండ్రి వద్దకు రావాల్సి ఉంటుంది, ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు, ఎన్ని ఇళ్ళు కట్టించాల్సి ఉంటుంది అని. శివబాబా అంటారు – వెయిట్ ఎండ్ సీ (వేచి చూడండి). కల్పక్రితం ఎలాగైతే వచ్చి ఉన్నారో, అలాగే వచ్చి ఉంటారు. నీవు చింతించకు, నీవు కేవలం చదువుకుంటూ ఉండు, మన్మనాభవ. నీవు కర్మాతీతంగా అయ్యే పురుషార్థం చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము….. (తుమ్హే పాకే హమ్ నే…..)

ఓంశాంతి. పిల్లలూ, ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు. ఇంకా ఏమంటారు! పిల్లలతో అంటారు – పిల్లలూ, ఓం శాంతి తతత్వమ్. ఓ పిల్లలూ, మీరు కూడా శాంతి స్వరూపులే. మీరు కూడా మాస్టర్ పతితపావనులే. ఈ విధంగా ఇంకెవరూ అనలేరు. కాకి ఎలా ఉంటుందో, దాని పిల్లలు కూడా అలాగే ఉంటాయని అంటారు. బాబా ఎలా ఉన్నారో, మేము కూడా అలాగే ఉంటాము అని – పిల్లలైన మీకు కూడా తెలుసు. తండ్రి అంటారు – నేను జ్ఞాన సాగరుడను. పిల్లలైన మీరు కూడా – మేము మాస్టర్ జ్ఞానసాగరులము అనగా నదులము అని భావిస్తారు. సాగరానికి పిల్లలు కూడా ఉంటాయి కదా. పెద్ద-పెద్ద నదులు కూడా ఉన్నాయి. పెద్ద-పెద్ద చెరువులు, పెద్ద-పెద్ద సరస్సులు కూడా ఉన్నాయి. అవి జడమైనవి, మీరు చైతన్యమైనవారు. మీరు సాగరం నుండి వెలువడినవారు. చాలామంది పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోరు, ఎందుకంటే కన్యలైతే చదువుకున్నవారు కాదు. పంచదార దేనితో తయారవుతుంది, బెల్లం దేనితో తయారవుతుంది అని బాబా ఒకసారి అడిగారు. అప్పుడు పిల్లలు ఎర్ర చెరుకుతో బెల్లం తయారవుతుందని, తెల్ల చెరుకుతో పంచదార తయారవుతుందని చెప్పారు. పాపం వారు చదువుకున్నవారు కాదు. ఇప్పుడు మీకు ఎంత పెద్ద విషయాలను అర్థం చేయిస్తారు. నీటి సాగరం నుండి నీటి నదులే వెలువడతాయి. మనుష్యుల సంఖ్య బాగా పెరుగుతూ ఉంటే, నీరు కూడా ఎక్కువ కావాలి కదా. కాలువలు మొదలైనవి ఎన్నో తయారుచేస్తూ ఉంటారు. కావున పిల్లలైన మీరు లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ – మేము ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తున్నాము అన్న ఆలోచనతో ఉండాలి. బాబా, మేము మీ నుండి విశ్వ రాజ్యాధికార వారసత్వాన్ని తీసుకుంటాము, దీనిని మా నుండి ఎవరూ లాక్కోలేరు అని పాటలో కూడా అంటారు. ఈ రాజ్యాధికారం 21 జన్మల వరకు నిలిచి ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. రాజ్య భాగ్యాన్ని నడిపించేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు, పవిత్రంగా తయారుచేస్తారు. ఓ పతితపావనా రండి, అని పిలుస్తారు కూడా. కృష్ణుడిని అలా పిలవరు. నిరాకార భగవంతుడిని పిలుస్తారు. ఓ పతితపావనా అని అన్నప్పుడు బుద్ధిలో కృష్ణుడు గుర్తుకు రారు, పరమాత్మ గుర్తుకొస్తారు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖంగా కూర్చొన్నారు. ఇతనేమీ సాధువు-సత్పురుషుడు కాదు. నిరాకార శివబాబా ఈ బ్రహ్మా తనువులోకి ప్రవేశించి మనల్ని చదివిస్తారని మీకు తెలుసు. పరమపిత పరమాత్మ బ్రహ్మా తనువు ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని గాయనం కూడా ఉంది. స్థాపన తర్వాతనే వినాశనం జరిగింది. దీనితో పరమాత్మ పాత ప్రపంచంలోకి వస్తారని ఋజువవుతుంది. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనాన్ని చేయిస్తారు. సత్యయుగంలో ఒకే ధర్మముండేది, ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. చక్రం మొదలైనవి ఒకే ధర్మం కల దేవీ-దేవతలకు గుర్తు. ఈ లక్ష్మీనారాయణులను విశ్వానికి యజమానులని అంటారు. స్వర్గానికి యజమానులే విశ్వానికి యజమానులు. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూర్చొన్నాయి. పిల్లలూ, మన్మనాభవ అని తండ్రి అంటారు. పిల్లలకు ఈ అటెన్షన్ పదే-పదే లభిస్తుంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. వేరే పాయింట్లు మర్చిపోతూ ఉంటారు కానీ ఇది ముఖ్యమైనది కదా. తండ్రియే పతితపావనుడు. పావనంగా అయ్యేందుకు వారు ఈ యుక్తిని తెలియజేస్తారు. తండ్రి అంటారు – మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా, పతితులుగా అయిపోయారు. 84 జన్మలను పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధానంగా అవ్వండి, అప్పుడే మీరు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళగలరు. నిరాకారీ ప్రపంచం కూడా పవిత్రమైనది, ఆ సాకారీ ప్రపంచం కూడా పవిత్రమైనది. ఇది అపవిత్రమైన పతిత ప్రపంచము. ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది, శరీరం కూడా తమోప్రధానంగా ఉంది. ఇది సృష్టి నాటకము, ఇందులో బ్రహ్మాండము మరియు సూక్ష్మవతనము కూడా కలిసి ఉన్నాయి. సృష్టి చక్రం ఇక్కడ తిరుగుతుంది. సత్య, త్రేతా యుగాలు ఇక్కడ ఉన్నాయి. అవి సూక్ష్మ వతనంలో లేదా మూల వతనంలో ఉండవు. అవి ఇక్కడే ఉంటాయి. దీనిని మనుష్య సృష్టి అని అంటారు. అది ఆత్మల నిరాకారీ ప్రపంచము. ఇంకొకటి బ్రహ్మా, విష్ణు, శంకరుల ఆకారీ ప్రపంచము. ఈ సాకారీ సృష్టి ఎంత పెద్దది. సత్యయుగంలో సృష్టి ఎంత చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. ఇకపోతే, అక్కడ కూడా రాక్షసులు మొదలైనవారు ఉండేవారని మనుష్యులు చెప్పేదంతా అసత్యము.

కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం అని అంటూ ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. అంతా వినాశనమైపోతుంది మరియు సత్యయుగ స్వర్గం స్థాపనవుతుంది. మీరు కూడా తండ్రితో పాటు సేవ చేస్తున్నారు. తండ్రి కూడా పిల్లల సేవ చేసేందుకే వస్తారు. వీరు అనంతమైన తండ్రి. నా పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారని చూసినప్పుడు వారికి తప్పకుండా జాలి కలుగుతుంది కదా. వారు దయాహృదయుడైన తండ్రి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అశాంతి ఉంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ శాంతిని ఇవ్వలేరు. హఠయోగులు కూడా చాలా మంది ఉన్నారు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. మనుష్యులకు తప్పుడు విషయాలను వినిపిస్తారు. వాస్తవానికి ఆత్మ యొక్క స్వచ్ఛత అవసరము. ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది, ఇది మిగిలినవారు ఎవరికీ తెలియదు. వీరు పాపాత్మ, చాలా పాపాలు చేస్తారు, వీరు మహాత్మ, వీరు పుణ్యాత్మ అని అంటూ ఉంటారు. అంతేకానీ మహాన్ పరమాత్మ అని అనరు. సన్యాసులను పవిత్ర ఆత్మలని అంటారు ఎందుకంటే వారు సన్యసించారు. ఒక్క తండ్రి అయిన పరమాత్మ తప్ప ఇంకెవరూ ఆత్మను పవిత్రంగా తయారుచేయలేరని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. పతిత ప్రపంచంలో పావన ఆత్మలెవరూ ఉండలేరు. ఇప్పుడు అంటు కట్టడం జరుగుతుంది. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న-చిన్న మఠాలు, మార్గాలు మొదలైనవి కొమ్మలు-రెమ్మలు. వాటిలో ఎలాంటి శ్రమ ఉండదు. అనేక రకాల మంత్రాలు ఇస్తారు. రకరకాల మంత్రాలు ఇస్తారు. ఇది కూడా వశీకరణ మంత్రము, దీని ద్వారా మీరు 5 వికారాలపై విజయాన్ని పొందుతారు. రామ-రామ అనే మంత్రాన్ని జపిస్తారు కానీ దీని వల్ల లాభమేమీ ఉండదు. ఇక్కడైతే, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయని, మీరు పవిత్ర ఆత్మలుగా అవుతారని తండ్రి అంటారు. స్మృతినే యోగమని అంటారు. భారత్ యొక్క ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధమైనది. ఈ యోగంతోనే మీరు విశ్వంపై విజయం పొందుతారు. భారత్ యొక్క రాజయోగం చాలా ప్రసిద్ధమైనది. దీనిని తండ్రి తప్ప ఇతరులెవరూ నేర్పించలేరు. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. బి.కె.లు ఇక్కడే ఉంటారు కదా. ప్రజాపిత బ్రహ్మా పిల్లలు తప్పకుండా బ్రహ్మాతోనే ఉంటారు. బ్రాహ్మణ కులము కూడా తప్పకుండా కావాలి. దీనిని సర్వోత్తమమైన, ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత తిరగబడతారు. పిల్లి మొగ్గలాటను ఆడతారు కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా….. అవుతారు. కావున, మధురాతి మధురమైన పిల్లలూ, ఇది చాలా చిన్న విషయము – తండ్రి స్మృతిలో ఉండండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. బాబా మనకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తున్నారు అనేది కూడా బుద్ధిలో ఉంది. 84 లక్షలు లేక 84 జన్మల లెక్క కావాలి కదా. ఇది ఎవరికీ తెలియదు. 84 లక్షల లెక్కల ఎవరూ చెప్పలేరు. మనుష్యులు 84 జన్మల చక్రాన్ని తిరుగుతారు. ఆత్మలు పాత్రను అభినయించేందుకు పై నుండి వస్తాయి. సత్యయుగం నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ-తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. ఒక్క తండ్రి మాత్రమే తెలుసుకోగలరు. మనుష్యులను ఎప్పుడూ పరమపిత, గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అంటే నిరాకార శివుని వైపుకు బుద్ధి వెళ్తుంది. జీవాత్మలకు తండ్రి ఉంటారు కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. నిరాకార తండ్రి పేరు శివ. మీకు కూడా ఒకే పేరుంది – ఆత్మ. తర్వాత శరీరాలకు రకరకాల పేర్లు ఉంటాయి. పరమపిత పరమాత్మ కూడా శరీరంలోకి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. శరీరం లేకుండా వినిపించలేరు. కావున తండ్రి అర్థం చేయిస్తారు – ఇతనికి తన పేరుంది, నా శరీరానికి ఎలాంటి పేరు లేదు, నేను పునర్జన్మలలోకి రాను. నేను ఇతనిలో ప్రవేశిస్తాను, ఈ విషయం ఇతనికి కూడా తెలియదు. తిథి, తారీఖులేమీ లేవు. కానీ, నేను కల్పం యొక్క అంతిమంలో అనగా రాత్రి సమయంలో వస్తాను. ఇప్పుడిది రాత్రి కదా. ఇది పతితుల ప్రపంచము. నేను పావన ప్రపంచాన్ని అనగా పగలును తయారుచేసేందుకు వస్తాను. బాబా ఎప్పుడు ప్రవేశించారనేది ఇతనికి కూడా తెలియదు. అయితే, వినాశన సాక్షాత్కారాన్ని చూసారు. చాలా మంది ధ్యానంలోకి వెళ్ళేవారు, వారు తిథి, తారీఖు, సమయం చెప్పలేకపోయేవారు. కృష్ణుడిని కూడా పూజిస్తారు, వారు రాత్రి వేళ జన్మించినట్లుగా చూపిస్తారు. ఏ సమయంలో జన్మించారు, ఎన్ని నిమిషాలకు జన్మించారు మొదలైన లెక్కంతా తీస్తారు. తండ్రి అంటారు – నేను నిరాకారుడను. నా జన్మ, మిగిలిన మనుష్యులు జన్మ తీసుకున్నట్లుగా జరగదు. నాది దివ్య, అలౌకిక జన్మ. నేను ఇతనిలో ప్రవేశిస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను. ఎద్దుపై రోజంతా సవారీ చేయరు. పిల్లలు నన్ను గుర్తు చేసుకున్నప్పుడు, నేను హాజరవుతాను. ఎలాగైతే మనుష్యులు పరస్పరంలో కలుసుకున్నప్పుడు, రామ-రామ లేదా నమస్తే అని చెప్పుకుంటారో, అలా తండ్రి వచ్చి పిల్లలను కలిసినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు. ఈ విషయాలను అనంతమైన ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. నేను పిల్లలైన మీ అందరికీ తండ్రిని. కావున శివబాబా సంతానమైన మీరందరూ ఆత్మలు, పరస్పరంలో సోదరులు. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, మాకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని సంతోషపు పాదరసం పైకి ఎక్కాలి. పిల్లలను చూసి తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది, చాలా మంది పిల్లలున్నారు. బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారని, రాజ్యాధికారాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. ప్రజలు కూడా – మా రాజ్యము అని అంటారు. ఎలాగైతే భారతవాసులు, ఇది మా భారత దేశం అని అంటారో, అలా రాజు మరియు ప్రజలు ఇరువురూ, ఇది మా దేశమని అంటారు. పిల్లలైన మీరు నరకవాసులుగా ఉన్నారు, తర్వాత స్వర్గవాసులుగా అవుతారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి, బాబా ఇంకే కష్టము ఇవ్వరు. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. ఇక్కడకు వచ్చి ఉండడం కాదు. అందరూ ఇక్కడకు పరుగెత్తుకుంటూ వస్తే, ఇంతమందిని బాబా ఎక్కడ ఉంచుతారు. ఇంతమంది పిల్లలందరూ ఒకేసారి ఎలా కలుసుకోగలరు. అన్ని సెంటర్ల పిల్లలు ఒకేసారి ఎలా కలుసుకోగలరు. ఎక్కడ ఉంటారు. కష్టం కదా. రోజు-రోజుకు పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు, దీనికి కూడా ఏదైనా యుక్తిని రచించవలసి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్నింటినీ తీసుకోవలసి ఉంటుంది. ఎంత కావాలని ఇంటికలవారిని అడుగుతారు. సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. సమయం చాలా సున్నితమవుతూ ఉంటుంది. తండ్రి మరియు పిల్లలు, ఇరువురు అవినాశీ. పిల్లలకు అవినాశీ ఖజానాను ఇస్తారు. చాలామంది పిల్లలు రావాల్సి ఉంటుంది. ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడుంటారని బాబా ఆలోచిస్తారు. శివబాబా అంటారు – నీవెందుకు చింతిస్తావు, ‘‘వెయిట్ ఆండ్ సీ’’. నీవు చదువుకుంటూ ఉండు, మన్మనాభవ.

ఇప్పుడు మేము కర్మాతీత అవస్థకు చేరుకోవాలని, సతోప్రధానంగా అవ్వాలని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. బాబా విషయాలను చాలా సహజంగా తెలియజేస్తారు. ఇది అతి సహజము – కేవలం బాబాను స్మృతి చేయాలి. దూడకు తన తల్లి గుర్తు రాగానే అరుస్తుంది కదా. అది జంతువు. పిల్లలైన మీరు కూడా ఆర్తనాదాలు చేసారు కదా. మున్ముందు ఇంకా ఆర్తనాదాలు చేస్తారు, చాలా స్మృతి చేస్తారు. బాబా వచ్చారని, వినాశనం తప్పకుండా జరగనున్నదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు రానున్నాయి. అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఎంత ఖర్చు చేసి బాంబులను తయారుచేస్తారు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఖర్చు అయితే అవుతుంది కదా. ఇంత ఖర్చు ఎక్కడ నుండి తీసుకొస్తారు. మృత్యువంటే భయపడతారు కూడా. అయినా సరే బాంబులు తయారుచేయడం ఆపరు. బాంబులతో యుద్ధం జరుగుతుంది. బాంబు పడుతూనే మనుష్యులు మరణించే విధంగా ఇప్పుడు బాంబులను తయారుచేస్తున్నారు. మొదట్లో వస్తువులను తయారుచేయడానికి సమయం పట్టేది కానీ ఇప్పుడు నిమిషాల్లో తయారవుతాయి. త్వరత్వరగా తయారుచేస్తూ ఉంటారు. బాంబులు కూడా తక్కువేమైనా తయారవుతాయా? ఈ పాత సృష్టి వినాశనమవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి.

గీత భారతవాసులైన మీ దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రము. మిగిలినవన్నీ చిన్న-చిన్నవి, వాటికి గాయనమేమీ లేదు. అన్నింటికంటే ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మము. కథను వినిపించడం బ్రాహ్మణుల పని. బ్రహ్మాకుమార-కుమారీలైన మనము బ్రహ్మాకు పిల్లలమని, మనకు తాతగారి వారసత్వం లభిస్తుందని మీరు చెప్పవచ్చు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకొని ఏ విషయం గురించి చింతించకూడదు. చదువు చదువుకుంటూ ఉండాలి. మన్మనాభవగా ఉంటూ కర్మాతీతులుగా అయ్యే శ్రద్ధ వహించాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారుచేసుకోవాలి.

2. ఆత్మలైన మనం శివబాబా సంతానము, పరస్పరంలో సోదరులము. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనే సంతోషంలో ఉండాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే శిక్షణలను కేవలం శిక్షణ రీతిలో బుద్ధిలో పెట్టుకోకుండా, వాటిని స్వరూపంలోకి తీసుకొస్తారో, వారు జ్ఞాన స్వరూప, ప్రేమ స్వరూప, ఆనంద స్వరూప స్థితిలో స్థితులై ఉంటారు. ఎవరైతే ప్రతి పాయింటును స్వరూపంలోకి తీసుకొస్తారో, వారే పాయింట్ రూపంలో స్థితులవ్వగలరు. పాయింటును మననం చేయడం లేదా వర్ణన చేయడం సహజమే, కానీ స్వరూపంగా అయి ఇతర ఆత్మలకు కూడా స్వరూపాన్ని అనుభవం చేయించడమే ఋజువునివ్వడం అనగా సుపుత్రులుగా మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వడము.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top