18 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 17, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ, ఉదయాన్నే లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయండి, బాబాను స్మృతి చేసినట్లయితే బాబా కూడా ప్రేమిస్తారు, ఆకర్షణ కలుగుతుంది’’

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము..

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలకు బాబా పదే-పదే అర్థం చేయిస్తారు, పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఈ శరీరం నాది కాదు, ఇది కూడా సమాప్తమవ్వనున్నది. మనం తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలా జ్ఞానం యొక్క ఆనందంలో ఉన్నట్లయితే మీలో చాలా ఆకర్షణ వస్తుంది. ఇదైతే తెలుసు, ఈ పాత వస్త్రాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఉండేది లేదు, ఈ శరీరం పట్ల మమకారం తొలగిపోవాలి. ఈ శరీరంలో కేవలం సేవ కోసమే ఉన్నాము, దీని పట్ల మమకారం లేదు. ఇక ఇంటికి వెళ్ళాలి, అంతే. ఈ సంగమ సమయం కూడా పురుషార్థం కోసం చాలా అవసరము. మేము 84 జన్మల చక్రం తిరిగాము అని ఇప్పుడే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటే చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి, ఇదంతా సమాప్తమయ్యేది ఉంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని. తండ్రి కూడా సదా ఇంట్లో ఉంటారు కదా. 8 గంటలు వ్యాపారం మొదలైనవాటిలో పెట్టండి, 8 గంటలు విశ్రాంతి తీసుకోండి, మిగిలిన సమయంలో అనంతమైన తండ్రితో ఈ సంభాషణ, ఆత్మిక సంభాషణ చేయండి.

తండ్రి శ్రీమతం ఏమిటంటే – మధురమైన పిల్లలూ, నిరంతరం స్మృతి యాత్రలో ఉండండి, ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో, అంతగా ప్రకృతి మీకు దాసిగా అవుతుంది. సన్యాసులు ఎప్పుడూ యాచించరు. వారు యోగులు కదా, మేము బ్రహ్మములో లీనమవ్వాలి అని వారికి నిశ్చయం ఉంటుంది. చాలా పక్కాగా ఉంటారు, ఇప్పుడిక మేము వెళ్ళిపోతాము, ఈ శరీరాన్ని విడిచి వెళ్తాము అని. చాలా శ్రమ చేస్తారు. భక్తి మార్గంలో చాలా మంది భక్తులు దేవతలను కలుసుకునేందుకు తమ జీవహత్యను కూడా చేసుకుంటారు. ఆత్మహత్య అనైతే అనరు, అది జరగదు. అయితే, జీవహత్య జరుగుతుంది. పిల్లలైన మీరు యోగంలో ఉంటారు కావున అమరులుగా ఉన్నట్లు. ఏదైనా చేయాలి అని ఎప్పుడూ ఎటువంటి ఆలోచన కూడా రాదు, కానీ ఆ అవస్థ దృఢంగా ఉండాలి. ముందైతే స్వయంలో చూసుకోవాలి, మాలో ఏ లోపము లేదు కదా? లోపం లేకపోతే సేవ కూడా బాగా చేయగలరు. తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు, కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేసారు మరియు పిల్లలైన మీరు మళ్ళీ కొత్త-కొత్త వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పిల్లలను తండ్రి తెలివైనవారిగా చేసేసారు. బాబాకు తెలుసు, సేవ చేసి వచ్చేటువంటి చాలా మంచి-మంచి పిల్లలున్నారు అని. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన నడుస్తుంది, మేము వీరి జీవితాన్ని ఎలా తయారుచేయాలి, దీని ద్వారా మా జీవితం కూడా ఉన్నతిని పొందుతుంది. మేము మా గ్రామం వారిని ఉద్ధరించాలి, మా తోటివారి సేవ చేయాలి అని సంతోషం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంటుంది. తండ్రి కూడా అంటారు, దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. తండ్రి కూర్చుని పిల్లలకే శిక్షణ ఇస్తారు, పిల్లలూ, మీరు మొదట మీ ఉన్నతిని చేసుకోవాలి.

ఆత్మిక కల్ప వృక్షము, కల్పక్రితం వలె ఉంది అని తండ్రికి తెలుసు. ఇది వృక్షం కదా, ఇందులో అన్ని సెక్షన్లు ఉన్నాయి. అందరూ ఎలా ఉంటారు అనేది మున్ముందు మీరు అన్నీ సాక్షాత్కారాలు చేసుకుంటారు, వంశ వృక్షమైతే తప్పకుండా ఉంటుంది కదా. అక్కడ నుండి ఆత్మలు మళ్ళీ నంబరువారుగా వస్తారు అని బుద్ధి కూడా చెప్తుంది. కావున పిల్లలకు విచార సాగర మథనం నడవాలి, ఇలా-ఇలా సేవ చేయాలి, ఇది చేయాలి అని. దీనితో పాటు తండ్రి స్మృతి కూడా ఉండాలి, స్మృతితోనే ఉన్నతి జరుగుతుంది. బాబా అంటారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే గడిచిందో, అది సరైనదే.

గారాబాల పిల్లలూ, మున్ముందు మీలో యోగబలం యొక్క శక్తి వస్తుంది. అప్పుడు మీరు ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా, వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది కూడా జ్ఞాన బాణము కదా. బాణం తగిలితే గాయపరుస్తుంది. ముందు గాయపడతారు, తర్వాత బాబాకు చెందినవారిగా అవుతారు. కావున ఏకాంతంలో కూర్చుని యుక్తులను తీయాలి. అంతేకానీ, రాత్రి పడుకున్నాము, ఉదయం లేచాము అన్నట్లు కాదు. ఉదయం లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి. రాత్రి కూడా స్మృతిలోనే నిదురించాలి. బాబాను స్మృతే చేయకపోతే మరి తండ్రి మళ్ళీ ఎలా ప్రేమిస్తారు. ఆకర్షణే ఉండదు. అయితే, బాబాకు తెలుసు, డ్రామాలో అన్ని రకాల వారు నంబరువారుగా తయారవ్వనున్నారు అని, అలాగని ఏమైనా మౌనంగా కూర్చుండిపోతారా. పురుషార్థం చేయిస్తారు కదా. పిల్లలు డ్రామా అని అంటూ ఆగిపోకూడదు, లేదంటే అంతిమ సమయంలో చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది, అనవసరంగా నేను అలా చేసాను, మాయకు వశమైపోయాను అని! తండ్రికైతే దయ కలుగుతుంది. బాగుపడకపోతే వారి గతి ఏమవుతుంది, ఏడుస్తారు, పెడబొబ్బలు పెడతారు, శిక్షలు అనుభవిస్తారు, అందుకే తండ్రి పిల్లలకు పదే-పదే శిక్షణనిస్తారు – పిల్లలూ, మీరు పర్ఫెక్ట్ గా అవ్వాలి. పదే-పదే తమ చెకింగ్ చేసుకోవాలి. పిల్లలు ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాలి, తండ్రి నుండి నాకు అన్నీ లభించాయి, మరి నాలో ఏ విషయం యొక్క లోటు ఉంది? తమ లోలోపల తొంగి చూసుకోవాలి. ఎలాగైతే నారదుడిని అడిగారు కదా, లక్ష్మిని వరించేందుకు స్వయాన్ని యోగ్యునిగా భావిస్తున్నారా? తండ్రి కూడా అడుగుతారు, లక్ష్మిని వరించేందుకు యోగ్యునిగా అయ్యారా? పురుషార్థం చేసి తొలగించుకోవాల్సిన లోపాలు ఏమేమి మిగిలి ఉన్నాయి. కొత్త-కొత్త పిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది, చెప్పండి, మీలో ఏ లోపమూ లేదు కదా? ఎందుకంటే మీరు ఇప్పుడే పర్ఫెక్ట్ గా అవ్వాలి, తండ్రి వచ్చేదే పర్ఫెక్ట్ గా తయారుచేయడానికి. కనుక స్వయాన్ని లోలోపల ప్రశ్నించుకోండి, మేము ఈ లక్ష్మీ-నారాయణుల వలె పర్ఫెక్ట్ గా అయ్యామా? ఒకవేళ లోపాలు ఉన్నాయి అంటే తండ్రికి తెలియజేయాలి, ఈ-ఈ లోపాలు మా నుండి పోవడం లేదు, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని. వ్యాధి అనేది సర్జన్ ద్వారానే దూరమవుతుంది. కనుక నిజాయితీగా, సత్యతతో చూసుకోండి, నాలో ఏ లోపం ఉంది! అని. లోపాలను చెప్తే తండ్రి సలహా ఇస్తారు. లోపాలు చాలామందిలో ఉన్నాయి. కొంతమందిలో క్రోధముంది లేక లోభముంది లేక వ్యర్థ చింతన ఉంది, కనుక వారికి జ్ఞానం యొక్క ధారణ జరగజాలదు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు, వాస్తవానికి ఇంతగా అర్థం చేయించాల్సిన అవసరం లేదు కానీ ఇవి ధారణ చేయాల్సిన విషయాలు. 5 వికారాలను జయించే విషయం ఈ సమయానిదే. మీలో ఆ భూతమేమీ (భ్రమించేటువంటిది) లేదు, ఈ 5 వికారాలు అనే జన్మ-జన్మాంతరాల భూతాలు లోపల ప్రవేశించి ఉన్నాయి, ఇవే దుఃఖితులుగా చేసాయి. కామం యొక్క భూతం గురించైతే రోజు అర్థం చేయించడం జరుగుతుంది. కనులు చాలా మోసం చేస్తాయి, అందుకే ఆత్మను చూసే ప్రాక్టీస్ మంచి రీతిలో చేయాలి. నేను ఆత్మను, వీరు కూడా ఆత్మ. ఆత్మలైన మీరైతే సోదరులు కదా. కనుక ఈ శరీరాన్ని చూడకూడదు. ఆత్మలమైన మనమందరము తిరిగి ఇంటికి వెళ్ళేవారము. తండ్రి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, ఇకపోతే, ఇది చూసుకోవాలి, మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా? ఏ గుణము తక్కువగా ఉంది? ఆత్మను చూసి చెప్పడం జరుగుతుంది, ఈ ఆత్మలో ఈ లోపముంది అని, అప్పుడు కూర్చొని కరెంటు ఇవ్వాలి, వీరి నుండి ఈ వ్యాధి తొలగిపోవాలి అని. పిల్లలు బాబాతో చాలా మధురాతి-మధురమైన మాటలను మాట్లాడాలి, బాబా, మీరు ఇలాంటివారు! బాబా, మీరు ఎంత మధురమైనవారు! కనుక తండ్రి స్మృతితో, తండ్రిని మహిమ చేయడంతో భూతాలు పారిపోతూ ఉంటాయి మరియు మీకు సంతోషం కూడా ఉంటుంది.

ఈ వృక్షం చాలా నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతుందని మీకు తెలుసు. మాయ అయితే నలువైపుల నుండి చుట్టుముడుతుంది, మాయ నీడ ఎలా పడుతుంది అంటే ఇక పూర్తిగా మాయమైపోతారు. తండ్రి చేతిని వదిలేస్తారు. పిల్లలైన మీ ప్రతి ఒక్కరి కనెక్షన్ తండ్రితో ఉంది, ఇకపోతే, పిల్లలందరూ నంబరువారుగా నిమిత్తంగా ఉన్నారు. అచ్ఛా.

అతి మధురమైన, అతి గారాబాల, సికీలధే పిల్లలందరికీ మాత-పిత బాప్ దాదాల యొక్క హృదయపూర్వకమైన, ప్రేమ భరితమైన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

అవ్యక్త మహావాక్యాలు – అంతిమ సేవ యొక్క అంతిమ స్వరూపము

తమ అంతిమ స్వరూపం యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుందా? ఎందుకంటే ఎంతెంతగా సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా ఎలా అనుభవం అవుతుందంటే, ఏదైనా వస్తువు సమ్ముఖంలో కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇలా తయారవుతాము అన్నట్లుగా అనుభవం అవుతుంది. ఎలాగైతే వృద్ధ అవస్థలో ఉన్నవారికి ఈ స్మృతి ఉంటుంది, ఇప్పుడు వృద్ధునిగా ఉన్నాను, ఇప్పుడిప్పుడే వెళ్ళి బాలునిగా అవుతాను అని. అలాగే, తమ అంతిమ స్వరూపం యొక్క స్మృతి కాదు కానీ సమ్ముఖంలో స్పష్టమైన రూపంలో – ఇప్పుడిలా ఉన్నాను, తర్వాత ఇలా అవుతాను అని సాక్షాత్కారం జరగాలి. ఎలాగైతే ప్రారంభంలో వినిపించేవారు, ఎప్పుడైతే గమ్యానికి చేరుకుంటారో, అప్పుడు, ఇక అడుగు పెట్టడమే ఆలస్యము అని భావిస్తారు. ఒక పాదాన్ని పెట్టేసాము, రెండవది పెట్టాలి. కేవలం ఇంత వ్యత్యాసమే ఉంది. మరి ఇలా తమ అంతిమ స్థితి యొక్క సమీపత అనుభవమవుతుందా? అపరోక్షంగా స్పష్టమైన సాక్షాత్కారం అవుతుందా? ఎలాగైతే అద్దంలో తమ రూపం స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే ఈ జ్ఞానం యొక్క దర్పణంలో తమ అంతిమ స్వరూపం అదే విధంగా స్పష్టంగా కనిపించాలి. ఉదాహరణకు, ఏదైనా చాలా మంచి సుందరమైన వస్త్రము ఎదురుగా పెట్టి ఉంటే మరియు ఇప్పుడు మేము దీనిని ధరించాలి అని తెలిస్తే, అప్పుడు వద్దనుకున్నా కూడా అది ధరించే సమయం సమీపంగా వచ్చే కొలది అటెన్షన్ వెళ్తుంది ఎందుకంటే ఎదురుగా కనిపిస్తూ ఉంది. అదే విధంగా తమ అంతిమ స్వరూపం ఎదురుగా కనిపిస్తుందా? ఆ స్వరూపం వైపు అటెన్షన్ వెళ్తుందా? దానిని లైట్ స్వరూపం అనండి లేక వస్త్రం అనండి, లైటే లైట్ కనిపిస్తుంది. ఫరిశ్తాల స్వరూపము ఎలా ఉంటుంది? లైట్. చూసేవారు కూడా ఇలా అనుభవం చేస్తారు, వీరు లైట్ వస్త్రధారులు, లైటే వీరి కిరీటము, లైటే వస్త్రాలు, లైటే వీరి అలంకరణ. ఎక్కడ చూసినా లైట్ నే చూస్తారు. మస్తకం పైన చూస్తే లైట్ కిరీటం కనిపిస్తుంది. నయనాలలో కూడా లైట్ కిరణాలు వెలువడుతూ ఉండడం కనిపిస్తుంది. మరి ఇటువంటి రూపం ఎదురుగా కనిపిస్తుందా? ఎందుకంటే మైట్ రూపం అనగా శక్తి రూపం యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో, అది దేని ద్వారా ప్రసిద్ధమవుతుంది? లైట్ రూపం ద్వారా. ఎవరు ఎదురుగా వచ్చినా కూడా, ఒక్క సెకండులో అశరీరిగా అయిపోవాలి, అది లైట్ రూపం ద్వారానే వీలవుతుంది. ఎలాంటి నడుస్తూ-తిరుగుతూ ఉన్న లైట్ హౌస్ గా అయిపోతారంటే, ఇక ఎవ్వరికీ ఈ శరీరం కనిపించదు. వినాశన సమయం యొక్క పేపర్ లో పాస్ అవ్వాలంటే సర్వ పరిస్థితులను ఎదుర్కునేందుకు లైట్ హౌస్ గా అవ్వాల్సి ఉంటుంది. నడుస్తూ-తిరుగుతూ మీ ఆ రూపం అనుభవమవ్వాలి. ఈ ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని పూర్తిగా మర్చిపోవాలి, ఒకవేళ ఏదైనా పని చేయాల్సి వచ్చినా, నడవాల్సి వచ్చినా, మాట్లాడాల్సి వచ్చినా, అప్పుడు కూడా నిమిత్తంగా ఆకారీ లైట్ రూపాన్ని ధారణ చేయాలి. ఎలాగైతే పాత్రను అభినయించే సమయంలో వస్త్రాన్ని ధరిస్తారు, కార్యం సమాప్తం అవ్వగానే వస్త్రాన్ని తీసేస్తారు. ఒక్క సెకండులో ధరిస్తారు, ఒక్క సెకండులో అతీతంగా అయిపోతారు. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ పక్కా అయిపోతుందో, అప్పుడు ఈ కర్మ భోగం సమాప్తమవుతుంది. ఎలాగైతే ఇంజెక్షన్ వేసి నొప్పిని సమాప్తం చేసేస్తారు. హఠయోగులైతే శరీరం నుండి అతీతంగా అయ్యే అభ్యాసం చేయిస్తారు. అలాగే ఈ స్మృతి స్వరూపం యొక్క ఇంజెక్షన్ వేసుకుని, దేహం యొక్క స్మృతి నుండి మాయమైపోవాలి. స్వయం కూడా తమను తాము లైట్ రూపంగా అనుభవం చేయండి, అప్పుడు ఇతరులు కూడా అదే అనుభవం చేస్తారు. అంతిమ సేవ ఇదే, దీనితో మొత్తం కార్య-వ్యవహారాలన్నీ కూడా లైట్ గా అనగా తేలికగా అవుతాయి. పర్వతం కూడా ఆవగింజ అయిపోతుంది అని సామెత ఉంది కదా. అలా, ఏ కార్యమైనా సరే, లైట్ రూపంగా అవ్వడంతో తేలికైపోతుంది, బుద్ధిని పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. తేలికపాటి పనులలో బుద్ధిని పెట్టాల్సిన అవసరం ఉండదు. కనుక ఈ లైట్ స్వరూపం యొక్క స్థితిలోనే, మాస్టర్ జానీ జానన్ హార్ (జ్ఞాత) మరియు మాస్టర్ త్రికాలదర్శుల లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవి వచ్చేస్తాయి. చేయాలా, వద్దా – ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఏదైతే యథార్థంగా చేయాలో, బుద్ధిలో ఆ సంకల్పమే వస్తుంది. ఈ అవస్థలో ఎలాంటి కర్మభోగం యొక్క అనుభవం ఉండదు. ఎలాగైతే ఇంజెక్షన్ యొక్క మత్తులో మాట్లాడుతారు, కదులుతారు, అన్నీ చేస్తూ కూడా ఏమీ గుర్తుండదు. చేస్తున్నాము అని గుర్తుండదు. స్వతహాగానే జరుగుతూ ఉంటుంది. అలా, కర్మభోగము లేక ఏ రకమైన కర్మ జరుగుతున్నా కానీ స్మృతి ఉండదు. అది తన వైపుకు ఆకర్షించదు. ఇటువంటి స్థితినే అంతిమ స్థితి అని అంటారు. ఇటువంటి అభ్యాసం ఉండాలి. ఈ స్థితి ఎంత సమీపంగా ఉంది? పూర్తిగా సమ్ముఖం వరకు చేరుకున్నారా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లైట్ రూపంగా అవ్వాలి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరంలోకి రావాలి మరియు ఏం చేయాలో అది చేయగలగాలి. సదా కాలానికి ఆ స్థితి ఏకరసంగా ఎప్పుడైతే ఉంటుందో, ఈ లోపు మధ్య-మధ్యలో కొంత సమయమైనా ఈ స్థితి ఉండాలి. అప్పుడిక ఇలా ఉంటూ-ఉంటూ సదాకాలానిదిగా అయిపోతుంది. ఎలాగైతే సాకారునిలో ఆకారుని అనుభవం చేసేవారు కదా! భూమిపై ఉంటూ కూడా ఫరిశ్తా యొక్క అనుభవం చేసేవారు. ఇటువంటి స్టేజ్ అయితే రావాలి కదా. ప్రారంభంలో చాలామందికి ఈ సాక్షాత్కారాలు జరిగేవి. లైటే లైట్ కనిపించేది. తమ లైట్ కిరీటాన్ని కూడా అనేక సార్లు సాక్షాత్కారం చేసుకునేవారు. ఆదిలో ఏదైతే శ్యాంపుల్ గా ఉండేదో, అది అంతిమంలో ప్రాక్టికల్ స్వరూపము అవుతుంది. సంకల్ప సిద్ధి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఎలాగైతే వాచా ద్వారా మీరు డైరెక్షన్ ఇస్తారు కదా, అలా సంకల్పంతో మొత్తం కార్య-వ్యవహారమంతా నడిపించగలరు. సైన్సు శక్తి ద్వారా కింద పృథ్వి నుండి పై వరకు డైరెక్షన్లు తీసుకుంటూ ఉంటారు, మరి శ్రేష్ఠ సంకల్పంతో కార్య-వ్యవహారము నడవదా? సైన్సు అయితే సైలెన్స్ నుండే కాపీ చేసింది. కనుక ఉదాహరణ ఇవ్వడానికి, ముందు నుండే స్పష్ట రూపంలో మీ ఎదురుగా ఉంది. కల్పక్రితం అయితే మీరే చేసారు కదా. ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎలాగైతే మాటలతో విషయాన్ని స్పష్టం చేస్తారో, అలా సంకల్పంతో మొత్తం కార్య-వ్యవహారమంతా నడవాలి. ఎంతెంతగా అనుభవం చేస్తూ ఉంటారో, ఒకరికొకరు సమీపంగా వస్తూ ఉంటారో, అప్పుడు సంకల్పాలు కూడా పరస్పరంలో కలుస్తూ ఉంటాయి. లైట్ రూపంగా అవ్వడంతో వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయం సమాప్తమైపోతాయి, అప్పుడు ఏదైతే జరగాలో, ఆ సంకల్పమే వస్తుంది. మీ బుద్ధిలో కూడా ఆ సంకల్పమే వస్తుంది మరియు ఎవరైతే చేయాలో, వారి బుద్ధిలో కూడా ఆ సంకల్పమే వస్తుంది, ఇది చేయాలి అని. ఇదే కదా నవీనత. ఈ కార్య-వ్యవహారాలను ఎవరైనా చూస్తే, వీరి కార్య-వ్యవహారాలు మాటలతో కాదు, సూచనలతోనే (సైగలతోనే) నడుస్తున్నాయి అని భావిస్తారు. కళ్ళతో చూడగానే అర్థం చేసుకుంటారు. సూక్ష్మవతనం ఇక్కడే తయారవ్వాలి. అచ్ఛా – ఓం శాంతి.

వరదానము:-

ఏ పిల్లలైతే తండ్రి స్నేహీలుగా ఉంటారో, వారు సదా బ్రహ్మాబాబా భుజాలలో ఇమిడి ఉంటారు. ఈ బ్రహ్మాబాబా భుజాలే పిల్లలైన మీకు రక్షణా సాధనాలు. ఎవరైతే ప్రియమైనవారిగా, స్నేహీలుగా ఉంటారో, వారు సదా భుజాలలో ఉంటారు. కనుక మీరు సేవలో బాప్ దాదాకు భుజాలు మరియు ఉండేది కూడా తండ్రి యొక్క భుజాలలో. ఈ రెండు దృశ్యాలను అనుభవం చేయండి – ఒక్కోసారి భుజాలలో ఇమిడిపోండి మరియు ఒక్కోసారి భుజాలుగా అయి సేవ చేయండి. నేను భగవంతుని కుడి భుజాన్ని అనే నషా ఉండాలి.

స్లోగన్:-

వలీన స్థితిని అనుభవం చేయండి

తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందంటే, అమృతవేళ నుండే పిల్లల పాలన చేస్తారు. రోజు ఆరంభమే ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! స్వయంగా భగవంతుడే మిలనాన్ని జరుపుకునేందుకు పిలుస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, శక్తులను నింపుతారు! తండ్రి యొక్క ప్రేమపూరిత గీతాలు మిమ్మల్ని లేపుతాయి. ఎంత స్నేహంతో పిలుస్తారు మరియు నిద్ర లేపుతారు – మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ, రండి… కావున ఈ ప్రేమ పాలనకు ప్రాక్టికల్ స్వరూపముగా ‘సహజ యోగీ జీవితము’ ను అనుభవం చేయండి

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top