18 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 17, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“సంగమయుగ బ్రాహ్మణ జీవితము యొక్క 3 విశేషతలు”

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు బాప్ దాదా తమ సదా తోడుగా ఉండే, సదా సహయోగులుగా, సేవా సహచరులుగా అయి సేవ చేసే, తమ తోడుగా వెళ్ళే, శ్రేష్ఠమైన పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. తోడుగా ఉండేవారు అనగా సహజయోగి, స్వతఃయోగి ఆత్మలు. సదా సేవలో సహయోగులుగా, సహచరులుగా అయి నడుచుకునేవారు అనగా జ్ఞానయుక్త ఆత్మలు, సత్యమైన సేవాధారులు. తోడుగా వెళ్ళేవారు అనగా సమాన మరియు సంపన్న కర్మాతీత ఆత్మలు. బాప్ దాదా పిల్లలందరిలోనూ ఈ మూడు విశేషతలను చూస్తున్నారు, ఈ మూడు విషయాలలోనూ ఎంతవరకు సంపూర్ణంగా అయ్యారు అనేది చూస్తున్నారు. సంగమయుగం యొక్క శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితంలో ఈ మూడు విశేషతలు అవసరమే. యోగయుక్త ఆత్మ, జ్ఞానయుక్త ఆత్మ మరియు బాప్ సమాన్ కర్మాతీత ఆత్మ – ఈ మూడు విశేషతలలో, ఒకవేళ ఒక్క విశేషత తక్కువగా ఉన్నా సరే, బ్రాహ్మణ జీవితంలోని విశేషతల అనుభవజ్ఞులుగా అవ్వనట్లు అనగా సంపూర్ణ బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము మరియు ప్రాప్తుల నుండి వంచితులైనట్లు, ఎందుకంటే బాప్ దాదా పిల్లలందరికీ సంపూర్ణ వరదానాలిస్తారు, అంతేకానీ యథాశక్తి యోగీ భవ, యథాశక్తి జ్ఞానీ భవ అనే వరదానాలను ఇవ్వరు. దీనితో పాటు, పూర్తి కల్పమంతటిలోనూ విశేషమైనది సంగమయుగము, ఈ యుగాన్ని అనగా ఈ సమయాన్ని కూడా వరదానీ సమయం అని అంటారు, ఎందుకంటే వరదాత అయిన తండ్రి వరదానాలను పంచేందుకు ఈ సమయంలోనే వస్తారు. వరదాత వచ్చిన కారణంగా సమయం కూడా వరదానీ సమయంగా అయింది. ఈ సమయానికి ఈ వరదానముంది. సర్వ ప్రాప్తులనూ సంపూర్ణంగా ప్రాప్తి చేసుకునే సమయమిదే. సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు కూడా ఇదే వరదానీ సమయము. మిగితా కల్పమంతా కర్మల అనుసారంగా ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు లేదా ఎటువంటి కర్మనో అటువంటి ఫలము స్వతహాగా ప్రాప్తిస్తూ ఉంటుంది. కానీ ఈ వరదానీ సమయంలో, మీరు కర్మ అనే ఒక అడుగు వేస్తే, తండ్రి నుండి పదమాల రెట్ల సహాయం సహజంగా ప్రాప్తిస్తుంది. సత్యయుగంలో ఒకటికి పదమాల రెట్లు ప్రాప్తి ఉండదు, కానీ ఇప్పుడు ఏదైతే ప్రాప్తిస్తుందో, దానిని ప్రారబ్ధం రూపంలో అనుభవించేందుకు అధికారులుగా అవుతారు. కేవలం జమ చేసుకున్నదానిని తింటూ కిందకు వస్తూ ఉంటారు. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక యుగం పూర్తి అవ్వడంతో కళలు కూడా 16 నుండి 14 అవుతాయి కదా. కానీ 16 కళా సంపూర్ణులుగా అయ్యే సంపూర్ణ ప్రాప్తి ఏ సమయంలో ఉంటుంది? ఆ ప్రాప్తి పొందే సమయము ఈ సంగమయుగ సమయము. ఈ సమయంలో తండ్రి విశాల హృదయంతో సర్వ ప్రాప్తుల భాండాగారాన్ని, వరదాన రూపంలో, వారసత్వ రూపంలో, చదువుకు ఫల స్వరూపంగా ప్రాప్తి యొక్క రూపంలో, మూడు సంబంధాలతో, మూడు రూపాలలో, విశేషమైన తెరిచి ఉన్న భాండాగారాలను, నిండుగా ఉన్న భాండాగారాలను పిల్లల ముందు ఉంచుతారు. ఎంత చేస్తే అంత అనే లెక్క కాదు, ఒకటికి పదమాల రెట్ల లెక్కలో ఇస్తారు. కేవలం మీ పురుషార్థం మీరు చేయండి, పారబ్ధాన్ని పొందండి అని చెప్పరు. కానీ దయాహృదయుడై, దాతగా అయి, విధాతగా అయి, సర్వ సంబంధాలలోనూ మీ వాడిగా అయి, ప్రతి సెకండు స్వయంగా సహాయకునిగా అవుతారు. ఒక్క సెకండు ధైర్యము చేస్తే, అనేక సంవత్సరాల శ్రమకు సమానమైన సహాయాన్ని అందిస్తూ సదా సహయోగిగా అవుతారు. ఎందుకంటే మీరు అనేక జన్మల నుండి భ్రమిస్తున్న నిర్బల ఆత్మలని, అలసిపోయి ఉన్నారని వారికి తెలుసు, అందుకే ఇంత సహయోగము చేస్తారు, సహాయకునిగా అవుతారు. అన్ని రకాల భారాలను తండ్రికి ఇచ్చేయండని స్వయంగా వారే ఆఫర్ చేస్తున్నారు. మీ భారాన్ని తీసుకుంటానని ఆఫర్ చేస్తున్నారు. భాగ్య విధాతగా అయి, నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేసి, శ్రేష్ఠ కర్మల జ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేయించి, భాగ్య రేఖను గీసుకునే కలమును మీ చేతికి ఇస్తున్నారు. భాగ్య రేఖను ఎంత పొడవుగా కావాలంటే అంత పొడవుగా గీసుకోండి. అన్ని తెరిచి ఉన్న ఖజానాల తాళంచెవిని మీ చేతికి ఇచ్చారు. ఆ తాళంచెవి కూడా ఎంత సహజమైనది! ఒకవేళ మాయ తుఫానులు వచ్చినా సరే, ఛత్రఛాయగా అయి సదా సురక్షితంగా కూడా ఉంచుతారు. ఎక్కడైతే ఛత్రఛాయ ఉంటుందో, అక్కడ తుఫానులు ఏమి చేస్తాయి. సేవాధారులుగా కూడా తయారుచేస్తారు, కానీ దానితోపాటు బుద్ధివంతుల బుద్ధిగా అయి ఆత్మలకు టచింగ్ కూడా ఇస్తారు. దీని వలన చాలా సహజంగా పిల్లలకు పేరు వస్తుంది, తండ్రి పని పూర్తవుతుంది. ఎంత అపురూపంగా, ప్రేమగా, ప్రియమైన పిల్లలుగా చేసుకొని పాలన చేస్తారంటే, ఇక సదా అనేక ఊయలలో ఊపుతూ ఉంటారు! పాదాలను కింద పెట్టనివ్వరు. ఒక్కోసారి సంతోషపు ఊయలలో, ఒక్కోసారి సుఖపు ఊయలలో, ఒక్కోసారి తండ్రి ఒడి అనే ఊయలలో, ఆనందము, ప్రేమ, శాంతి యొక్క ఊయలల్లో ఊగుతూ ఉండండి. ఊగడం అనగా ఆనందంగా గడపడం. ఈ సర్వ ప్రాప్తులు ఈ వరదానీ సమయం యొక్క విశేషతలే. ఈ సమయంలో వరదాత, విధాతగా ఉన్న కారణంగా, తండ్రి మరియు సర్వ సంబంధాలను నిర్వర్తిస్తున్న కారణంగా, తండ్రి దయాహృదయులుగా ఉన్నారు. ఒకటికి పదమాల రెట్లు ఇచ్చే విధి ఈ సమయానికి సంబంధించినదే. చివర్లో, లెక్కాచారాలను సమాప్తం చేసుకున్న వారు తమ సహచరుని సహాయాన్ని తీసుకుంటారు. సహచరుడు ఎవరు అనేది తెలుసు కదా? ఇక తర్వాత ఇప్పుడున్న ఒకటికి పదమాల రెట్ల లెక్క సమాప్తమైపోతుంది. ఇప్పుడింకా దయాహృదయునిగా ఉన్నారు, తర్వాత లెక్కాచారము ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనైతే క్షమిస్తారు కూడా. కఠినమైన తప్పులను కూడా క్షమించి, సహాయకునిగా అయి ముందుకు ఎగిరేలా చేస్తారు. కేవలం హృదయపూర్వకంగా రియలైజ్ అవ్వడం అనగా క్షమించబడడం. ఎలాగైతే ప్రపంచంలోని వారు క్షమాపణ తీసుకుంటారో, ఇక్కడ ఆ విధంగా ఉండదు. రియలైజేషన్ యొక్క విధియే క్షమాపణ. కనుక హృదయపూర్వకంగా రియలైజ్ అవ్వాలి. ఎవరో చెప్పినందుకు లేదా ఆ సమయానికి నడిపించే లక్ష్యముతో ఈ క్షమాపణ లభించదు. చాలామంది పిల్లలు చతురులుగా కూడా ఉంటారు. వాతావరణాన్ని గమనించి – ప్రస్తుతానికి రియలైజ్ అవుతాను, క్షమాపణ అడుగుతాను, తర్వాత చూద్దాము అని అంటారు. కానీ తండ్రి కూడా జ్ఞానసాగరుడు, వారికి తెలుసు, ఇక నవ్వుతూ వదిలేస్తారు కానీ క్షమించరు. విధి లేకుండా సిద్ధి లభించదు కదా. విధి ఒక అడుగు అంత మాత్రమే ఉంటుంది, సిద్ధి పదమాల అడుగుల అంత ఉంటుంది. కానీ ఒక అడుగు యొక్క విధి యథార్థమే కదా. కనుక ఈ సమయానికి ఎన్ని విశేషతలున్నాయి మరియు వరదానీ సమయం ఎటువంటిది అనేది వినిపించాము.

వరదానీ సమయంలో కూడా వరదానాలు తీసుకోకపోతే ఇంకే సమయంలో తీసుకుంటారు? సమయం సమాప్తమైనప్పుడు, సమయమనుసారంగా ఈ సమయానికి గల విశేషతలన్నీ కూడా సమాప్తమైపోతాయి. అందుకే ఏమి చేయాలన్నా, ఏమి తీసుకోవాలన్నా, ఏమి తయారుచేసుకోవాలన్నా, అవి ఇప్పుడు వరదాన రూపంలో, తండ్రి సహాయం లభించే సమయంలో చేసుకోండి, తయారుచేసుకోండి. ఇక తర్వాత ఈ డైమండ్ ఛాన్స్ లభించదు. ఈ సమయానికి గల విశేషతలనైతే విన్నారు. సమయం యొక్క విశేషతల ఆధారంగా, బ్రాహ్మణ జీవితానికి ఏ 3 విశేషతలున్నాయి అనేది మీకు వినిపించాను, ఈ మూడింటిలోనూ సంపూర్ణులుగా అవ్వండి. మీ విశేషమైన స్లోగన్ కూడా ఇదే – ‘యోగిగా అవ్వండి, పవిత్రంగా అవ్వండి, జ్ఞానీగా అవ్వండి, కర్మాతీతులుగా అవ్వండి.’ తోడుగా వెళ్ళాల్సిందే అన్నప్పుడు, సదా తోడు ఉండేవారే కలిసి వెళ్తారు. తోడుగా ఉండనివారు ఎలా కలిసి వెళ్తారు? తోడుగా వెళ్ళేందుకు సమయానికి తయారవ్వరు, ఎందుకంటే తండ్రి సమానంగా అవ్వడం అనగా తయారవ్వడము. సమానతయే తోడు మరియు చేయి. లేదంటే ఏమవుతుంది? ముందు ఉన్న వారిని చూస్తూ, వెనుక వస్తూ ఉంటే సహచరులుగా అయినట్లు కాదు. సహచరులు కలిసి వెళ్తారు. చాలాకాలం తోడుగా ఉండడం, సహచరులుగా అయి సహయోగులుగా అవ్వడము – ఈ బహుకాలపు సంస్కారమే సహచరులుగా చేసి తోడుగా తీసుకువెళ్తుంది. ఇప్పుడు కూడా తోడుగా లేకపోతే, దూరంగా ఉన్నారని ఋజువవుతుంది. కనుక దూరంగా ఉండే సంస్కారము, కలిసి వెళ్ళే సమయంలో కూడా దూరాన్ని అనుభవం చేయిస్తుంది. అందుకే, ఇప్పటి నుండే 3 విశేషతలను చెక్ చేసుకోండి. సదా తోడుగా ఉండండి. సదా తండ్రికి సహచరులుగా అయి సేవ చేయండి. చేయించేవారు తండ్రి, నేను నిమిత్తంగా ఉంటూ చేసేవాడిని – ఇలా ఉన్నట్లయితే సేవ ఎప్పుడూ అలజడిలోకి తీసుకురాదు. ఒంటరిగా ఉన్నారంటే మైపన్ (నేను, నాది) లోకి వస్తారు, అప్పుడు మాయ పిల్లి మ్యావ్ మ్యావ్ అని అంటుంది. మీరు మై, మై (నేను-నేను) అని అంటారు, అదేమో మై ఆవూ, మై ఆవూ (నేను వస్తాను, నేను వస్తాను) అని అంటుంది. మాయను పిల్లి అని అంటారు కదా. కనుక సహచరులుగా ఉంటూ సేవ చేయండి. కర్మాతీతులుగా అయ్యే పరిభాష కూడా చాలా గుహ్యమైనది, అది తర్వాత వినిపిస్తాము.

ఈ రోజు కేవలం ఈ 3 విషయాలను చెక్ చేసుకోండి. సమయానికి గల విశేషతల వలన కలిగే లాభాన్ని ఎంతవరకు ప్రాప్తి చేసుకున్నారు? ఎందుకంటే సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకోవడం అనగా మహాన్ గా అవ్వడము. స్వయాన్ని తెలుసుకోవడము, తండ్రిని తెలుసుకోవడము – వీటికి ఎంత మహత్యముందో, అలా సమయాన్ని తెలుసుకోవడం కూడా అవసరము, కావున ఏమి చేయాలో అర్థమయిందా? బాప్ దాదా కూర్చొని రిజల్టును వినిపిస్తారు. అంతకన్నా ముందే మీ రిజల్టును మీరే తెలుసుకోండి, ఎందుకంటే బాప్ దాదా రిజల్టును అనౌన్స్ చేసారంటే, రిజల్టును విని, ఆలోచిస్తారు – రిజల్టు అనౌన్స్ అయిపోయింది, ఇప్పుడేమి చేయగలను, ఇప్పుడెలా ఉన్నానో, బాగానే ఉన్నాను అని అనుకుంటారు. అందుకే ఇది చెక్ చేసుకోండి, అది చెక్ చేసుకోండి అని బాప్ దాదా చెప్తూ ఉంటారు. ఇన్ డైరెక్ట్ రిజల్టును వినిపిస్తున్నారు. ఎందుకంటే ముందు నుండే రిజల్టు వినిపిస్తాము అని చెప్పాము మరియు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి 6 మాసాలు, ఇంకొకసారి ఒక సంవత్సరం ఇచ్చారు. కొంతమంది, 6 మాసాలు పూర్తి అయిపోయింది కానీ ఇంకా ఏమీ వినిపించలేదని అనుకుంటారు. కానీ ఇప్పుడింకా కొంత సమయం దయాహృదయునిగా ఉంటారు, వరదానీ సమయం ఉంటుంది. ఇప్పుడింకా చిత్రగుప్తుడు గుప్తంగా ఉన్నాడు. తర్వాత ప్రత్యక్షమవుతాడు. అందుకే తండ్రికి ఇంకా దయ కలుగుతుంది – సర్లే, ఇంకొక సంవత్సరం ఇద్దాము, ఎంతైనా పిల్లలు కదా అని అనుకుంటారు. తండ్రి తలుచుకుంటే చేయలేనిది ఏముంటుంది? అందరి గురించి అన్ని విషయాలను అనౌన్స్ చేయగలరు. చాలామంది వారిని భోళానాథుడని (అమాయకుడని) అనుకుంటారు కదా. చాలామంది పిల్లలు ఇప్పటికీ కూడా తండ్రిని భోళాగా చేస్తూ ఉంటారు. వారు భోళానాథుడే, కానీ మహాకాలుడు కూడా. ఆ రూపాన్ని ఇంకా పిల్లల ముందు చూపించడం లేదు. ఒకవేళ చూపిస్తే ఎదురుగా నిలబడలేరు. అందుకే, అన్నీ తెలిసినా కానీ భోళానాథునిగా ఉంటారు. ఏమీ తెలియనివారిలా అవుతారు. కానీ ఎందుకు అలా చేస్తారు? పిల్లలను సంపూర్ణంగా చేసేందుకు. అర్థమయిందా? బాప్ దాదా ఈ దృశ్యాలను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఏమేమి ఆటలు ఆడుతారు, అన్నీ చూస్తూ ఉంటారు. అందుకే బ్రాహ్మణ జీవితము యొక్క విశేషతలను స్వయంలో చెక్ చేసుకోండి మరియు స్వయాన్ని సంపన్నులుగా చేసుకోండి. అచ్ఛా.

నలువైపులా ఉన్న సర్వ యోగయుక్త ఆత్మలు, జ్ఞానయుక్త ఆత్మలు, బాబా సమానమైన కర్మాతీత శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయం యొక్క మహత్యాన్ని, సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకొని మహాన్ గా అయ్యే మహాన్ ఆత్మలకు, సదా తండ్రి నుండి సర్వ సంబంధాల ప్రాప్తి యొక్క లాభాన్ని తీసుకునే తెలివిగల, విశాల బుద్ధి గల, స్వచ్ఛ బుద్ధి గల, సదా పావనులైన పిల్లలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక – సదా తమను తాము సర్వ శక్తులతో సంపన్నులైన మాస్టర్ సర్వ శక్తివాన్ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? తండ్రి సర్వ శక్తుల ఖజానాలను వారసత్వంగా ఇచ్చేసారు. కనుక సర్వ శక్తులు మీ వారసత్వము అనగా ఖజానాలు. మీ ఖజానాలు మీతో పాటు ఉంటాయి కదా. తండ్రి ఇచ్చారు, ఖజానాలు పిల్లలవిగా అయ్యాయి. సొంత వస్తువులు స్వతహాగా గుర్తుంటాయి. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ వినాశీ వస్తువులు, కానీ ఈ వారసత్వము మరియు శక్తులు అవినాశీగా ఉంటాయి. ఈ రోజు వారసత్వం లభించి, రేపు సమాప్తమైపోతుంది అన్నట్లు కాదు. ఈ రోజు ఖజానాలు ఉన్నాయి, రేపు వాటిని ఎవరో కాల్చేస్తారు, దొంగలిస్తారు అనేటువంటివి కాదు. ఇవి ఎంత ఖర్చు చేస్తే, అంత వృద్ధి చెందే ఖజానాలు. జ్ఞాన ఖజానాను ఎంతగా పంచుతారో, అంతగానే పెరుగుతూ ఉంటుంది. సాధనాలన్నీ కూడా స్వతహాగా ప్రాప్తిస్తూ ఉంటాయి. కనుక సదా కొరకు వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఈ సంతోషముంటుంది కదా. వారసత్వము కూడా ఎంత శ్రేష్ఠమైనది! అప్రాప్తి అనేదేమీ లేదు, సర్వ ప్రాప్తులు ఉన్నాయి. అచ్ఛా.

అమృతవేళ వీడ్కోలు సమయంలో దాదీలతో మరియు దాదీ నిర్మల శాంతతో బాప్ దాదా కలయిక –

మహారథుల ప్రతి అడుగులోనూ సేవ ఉంటుంది. మాట్లాడినా, మాట్లాడకపోయినా, వారి ప్రతి కర్మలో, ప్రతి నడవడికలో సేవ ఉంటుంది. సేవ లేకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు. మనసా సేవలో ఉన్నా, వాచా సేవలో ఉన్నా, సంబంధ-సంపర్కాలలోనైనా, నిరంతర యోగులుగా కూడా ఉంటారు, నిరంతర సేవాధారులుగా కూడా ఉంటారు. మంచిది, మధువనంలో జమ చేసుకున్న ఖజానాలను అందరికీ పంచి తినిపించేందుకు వెళ్తున్నారు. మహారథులు ఏ స్థానంలోనైనా ఉండడమనేది కూడా, అనేక ఆత్మలకు స్థూలమైన ఆధారంగా అవుతుంది. ఎలాగైతే తండ్రి ఛత్రఛాయలా ఉన్నారో, అలా తండ్రి సమానమైన పిల్లలు కూడా ఛత్రఛాయలా అవుతారు. మిమ్మల్ని చూసి అందరూ ఎంత సంతోషపడతారు. కావున మహారథులందరికీ ఇది వరదానము వంటిది. కనులకు వరదానము, మస్తకానికి వరదానము, ఎన్ని వరదానాలు ఉన్నాయి! కర్మ చేసే ప్రతి కర్మేంద్రియానికి వరదానముంది. మీరు కనులతో చూసినప్పుడు అందరూ ఏమని భావిస్తారు? ఈ ఆత్మల దృష్టి ద్వారా బాబా దృష్టి అనుభవమవుతుందని అందరూ భావిస్తారు కదా. కావున ఇది కనులకు వరదానమయింది కదా. నోటికి వరదానముంది, ఈ ముఖానికి వరదానముంది, అడుగడుగుకు వరదానముంది. ఎన్ని వరదానాలున్నాయి. లెక్కపెడతారా! మీరు ఇతరులకు వరదానాలిస్తారు కానీ మీకు ముందే నుండే వరదానాలు లభించాయి. ఏ అడుగు వేసినా, వరదానాలతో జోలి నిండి ఉంది. ఉదాహరణకు లక్ష్మి చేతి నుండి అందరికీ ధనం లభిస్తూనే ఉంటుందని చూపిస్తారు కదా. కొంత సమయానికి కాదు, సదా సంపదకు దేవిగా అయి సంపదను ఇస్తూనే ఉంటారు. కనుక ఇది ఎవరి చిత్రము?

మరి మీకు ఎన్ని వరదానాలు ఉన్నాయి! ఏ వరదానము మిగలలేదని తండ్రి చెప్తున్నారు. కనుక ఏమి ఇవ్వాలి? వరదానాలతో అలంకరించబడి నడుచుకుంటున్నారు. చేయి ఊపుతూనే వరదానం లభించిందని అంటారు కదా. తండ్రి అయితే సమాన భవ అనే వరదానమునిచ్చారు. ఈ వరదానంతో అన్ని వరదానాలు లభించేసాయి. తండ్రి అవ్యక్తమైనప్పుడు అందరికీ సమాన భవ అనే వరదానమునిచ్చారు కదా. కేవలం ఎదురుగా ఉన్నవారికే కాదు, అందరికీ ఇచ్చారు. సూక్ష్మ రూపంలో మహావీరులందరూ తండ్రి ఎదురుగా ఉన్నారు మరియు వరదానం లభించింది. అచ్ఛా.

మీకు అందరి ఆశీర్వాదాలున్నాయి, అంతేకాక ఔషధము కూడా ఉంది. అందుకే పెద్ద వ్యాధి కూడా చిన్నదిగా అయిపోతుంది. కేవలం దాని రూపురేఖలను చూపిస్తుంది కానీ దాడి చేయలేదు. బల్లెం నుండి ముల్లు రూపాన్ని చూపిస్తుంది. ఇకపోతే, తండ్రి చేయి మరియు తోడు సదా ఉండనే ఉన్నాయి. ప్రతి అడుగులో, ప్రతి మాటలో, తండ్రి ఆశీర్వాదములు, ఔషధము లభిస్తూనే ఉంటాయి. అందుకే నిశ్చింతగా ఉండండి (దీని నుండి ఎప్పుడు ఫ్రీ అవుతాను). ఎంత ఫ్రీగా అవ్వండి అంటే సూక్ష్మవతనానికి చేరుకోవాలి. దీని ద్వారా ఇతరులకు కూడా బలం లభిస్తుంది. ఈ వ్యాధి కూడా మీకు సేవ చేస్తుంది. కనుక వ్యాధి, వ్యాధి కాదు, సేవ యొక్క సాధనము. లేదంటే ఇతరులు అనుకుంటారు – వీరికి సహాయముంది, వీరికి అనుభవము లేదు అని. కానీ అనుభవజ్ఞులుగా చేసి ఇతరులకు ధైర్యాన్ని ఇప్పించే సేవ కొరకు కొద్దిగా రూపురేఖలను చూపిస్తుంది. లేదంటే అందరూ నిరాశ చెందుతారు. మీరందరూ శ్యాంపుల్ లా కొద్ది రూపురేఖలను చూస్తారు, మీ మిగితా లెక్కంతా సమాప్తమైపోయింది. కేవలం రూపురేఖలంత మాత్రం మిగిలి ఉంది.

విదేశీ సోదరీ-సోదరులతో –

హృదయపూర్వకంగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను పెట్టుకోవాలి – ఇదే హృదయపూర్వకంగా థాంక్స్ అందుకోవడము. తండ్రి యొక్క ప్రతి అడుగులోనూ ప్రతి బిడ్డకు హృదయపూర్వక థాంక్స్ లభిస్తూ ఉంటుంది. సంగమయుగాన్ని సర్వ ఆత్మలకు సదా కొరకు థాంక్స్ చెప్పే సమయమని అంటారు. పూర్తి సంగమయుగమంతా ‘థాంక్స్ డే’. సదా ఒకరికొకరు శుభ కామనలను, శుభ భావనలను ఇస్తూ ఉండండి. తండ్రి కూడా ఇస్తారు. అచ్ఛా.

వరదానము:-

ఏ పిల్లలకైతే జమ చేసుకోవడం తెలుసో, వారు శక్తిశాలురుగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించుకొని, స్వయంలో ఇముడ్చుకోకుండా, ఇప్పుడిప్పుడే పంచితే శక్తి ఉండదు. కేవలం పంచినందుకు లేదా దానం చేసినందుకు సంతోషం కలుగుతుంది. సంతోషంతో పాటు శక్తి ఉన్నట్లయితే సహజంగానే విఘ్నాలు దాటి విఘ్నజీతులుగా అవుతారు. ఇక తర్వాత ఏ విఘ్నము, తపనను డిస్టర్బ్ చేయదు. అందుకే, ఎలాగైతే మీ ముఖము ద్వారా సంతోషపు మెరుపు కనిపిస్తుందో, అలా శక్తి యొక్క మెరుపు కూడా కనిపించాలి.

స్లోగన్:-

సూచన:- ఈ రోజు ఈ నెలలోని 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము, బాబా పిల్లలందరూ సా.6.30 నుండి 7.30 గం. వరకు విశేషంగా పరంధామములో ఉన్నతమైన స్థానంలో స్థితులై, లైట్-మైట్ హౌస్ గా అయి, ప్రకృతి సహితంగా పూర్తి విశ్వానికి సెర్చి లైట్ ఇచ్చే సేవ చేయాలి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top