17 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 16, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు అనంతమైన సమాచారాన్ని వినిపిస్తారు, మీరు ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు, మీరు 84 జన్మల స్మృతిలో ఉండాలి మరియు అందరికీ ఈ స్మృతిని ఇప్పించాలి’’

ప్రశ్న: -

శివబాబా యొక్క మొదటి సంతానమని బ్రహ్మాను అంటారు, విష్ణువును అనరు – ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ సంప్రదాయాన్ని రచిస్తారు. ఒకవేళ విష్ణువును సంతానమని అన్నట్లయితే అతని ద్వారా కూడా సంప్రదాయం ఉత్పన్నం అవ్వాల్సి ఉంటుంది. కానీ విష్ణువు ద్వారా ఏ సంప్రదాయము ఉత్పన్నమవ్వదు. విష్ణువును ఎవరూ తల్లి-తండ్రి అని అనరు. వారు ఎప్పుడైతే లక్ష్మీ-నారాయణుల రూపంలో మహారాజు-మహారాణిగా ఉంటారో, అప్పుడు వారిని వారి సంతానము మాత్రమే తల్లి-తండ్రి అని సంబోధిస్తారు. బ్రహ్మా ద్వారానైతే బ్రాహ్మణ సంప్రదాయం ఉత్పన్నమవుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి, తండ్రివి… (తుమ్హీ హో మాతా పితా…)

ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు ఏమని అర్థం చేయిస్తారంటే – ఏ గురువులు కానీ, పండితులు కానీ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అని అనలేరు. తండ్రి పిల్లలకు ఏం అర్థం చేయిస్తారు? అది ఏ తండ్రి? ఇదైతే కేవలం మీకు తెలుసు, ఇతర ఏ సత్సంగాలలోనూ ఈ విధంగా అనలేరు. అయితే సాయి బాబా, మెహర్ బాబా అని అంటూ ఉంటారు కానీ ఆ విధంగా ఎందుకు సంబోధిస్తున్నారు అన్నది ఏమీ అర్థం చేసుకోరు. వీరు అనంతమైన తండ్రి అని, అనంతమైన సమాచారాన్ని వినిపిస్తారని మీకు తెలుసు. ఒకటేమో హద్దు సమాచారము, మరొకటి అనంతమైన సమాచారము. ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియనే తెలియదు. తండ్రి అంటారు – మీకు అనంతమైన సమాచారాన్ని వినిపిస్తాను కావున సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము బుద్ధిలోకి వస్తుంది. మీకు తెలుసు, తప్పకుండా తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది కూడా యథార్థ రీతిలో అర్థం చేయించారు. దానిని అర్థం చేసుకుని మనం ఇతరులకు అర్థం చేయిస్తాము. బీజాన్ని పరమపిత పరమాత్మ అని లేక తండ్రి అని అంటారు, మనం వారి పిల్లలము, ఆత్మలము. ఆత్మలమైన మనం పరమాత్ముని సంతానమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పరమపిత పరమాత్మ పరంధామ నివాసి. ఈ మాల అంతా ఎలా తయారవుతుంది అని వారు మూలవతన సమాచారాన్ని అర్థం చేయించారు. మొట్టమొదట తండ్రి అర్థం చేయిస్తారు, నేను మీ తండ్రిని మరియు నేను పరంధామంలో ఉంటాను. నన్నే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. నేను వచ్చి ఆత్మలైన మీకు పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తాను. పిల్లల బుద్ధిలో ఇది తిరుగుతూ ఉంటుంది. మనం నిజానికి ఎక్కడి నివాసులము. ఆత్మలమైన మనందరమూ కూడా పాత్రను అభినయించాలి. పాత్ర రహస్యాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు, కేవలం – పునర్జన్మలు తీసుకుంటామని, ఆత్మ ఇన్ని జన్మలు తీసుకుంటుందని అంటూ ఉంటారు. కొందరు 84 లక్షల జన్మలని అంటారు. ఎవరికైనా అర్థం చేయిస్తే, 84 జన్మలు అన్నది సరియైనదని అర్థం చేసుకుంటారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారు అన్నది బుద్ధిలో ఉండాలి. తప్పకుండా మనం సతోప్రధానంగా ఉండేవారము, తర్వాత సతో, రజో, తమోలలోకి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ సంగమంలో మనం సతోప్రధానంగా అవుతున్నాము. ఇది తప్పకుండా పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది, అందుకే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులని అంటారు. ఈ విషయాలు చాలా సహజమైనవి, అందుకే వృద్ధ మాతలు కూడా – తప్పకుండా మనం 84 జన్మలు తీసుకున్నాము, ఇతర ధర్మాల మనుష్యులెవరూ తీసుకోరు అని అర్థం చేయించగలరు. ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది – ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా ఉన్నాము, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. ఇది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ విధంగా మనం పునర్జన్మలు తీసుకుంటాము. పునర్జన్మలనైతే తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు మీ 84 జన్మల పాత్ర యొక్క స్మృతి కలిగింది. ఈ విధంగా అర్థం చేయించడము వృద్ధ మాతలకు కూడా చాలా సహజము. మీరు పుస్తకాలు మొదలైనవేవీ చదవాల్సిన అవసరముండదు. మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అన్నది తండ్రి అర్థం చేయించారు. మీరే దేవీ-దేవతలుగా ఉండేవారు, తర్వాత 8 జన్మలు సత్యయుగంలో, 12 జన్మలు త్రేతాలో, 63 జన్మలు ద్వాపర-కలియుగాలలో తీసుకున్నారు మరియు ఈ ఒక్క జన్మ అన్నింటికంటే ఉన్నతమైనది. కావున సులభంగా అర్థము చేసుకుంటారు కదా. కురుక్షేత్రములోని వృద్ధ మాతలు కూడా అర్థము చేసుకుంటున్నారు కదా! కురుక్షేత్రము యొక్క పేరు ప్రసిద్ధమైనది. వాస్తవానికి ఇదంతా కర్మక్షేత్రము. ఆ కురుక్షేత్రము ఒక ఊరు, ఇదంతా కర్మ చేసే క్షేత్రము, ఇందులో ఇప్పుడింకా యుద్ధము మొదలైనవి ప్రారంభమవ్వలేదు. మీకు ఈ మొత్తం కురుక్షేత్రము గురించి తెలుసు. కూర్చోవడమైతే ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది.

బాబా అర్థం చేయించారు – ఈ మొత్తం కర్మక్షేత్రముపై రావణుని రాజ్యముంది. రావణుడిని కాల్చడం కూడా ఇక్కడే కాలుస్తారు. రావణుని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే శివబాబా జన్మ జరుగుతుంది. ఇక్కడే దేవీ-దేవతలు కూడా ఉండేవారు. మళ్ళీ వారే మొట్టమొదట వామమార్గంలోకి వెళ్తారు. బాబా కూడా ఇక్కడ భారత్ లోనే వస్తారు. భారత్ కు చాలా మహిమ ఉంది. తండ్రి కూడా భారత్ లోనే కూర్చుని అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీరు 5 వేల సంవత్సరాల క్రితము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, రాజ్యం చేసేవారు. అందులో మొదటి నంబరు అయిన లక్ష్మీ-నారాయణులు విశ్వంపై రాజ్యం చేసేవారు. ఇది జరిగి 5 వేల సంవత్సరాలయ్యింది. వారిని విశ్వ మహారాజు, విశ్వ మహారాణి అని అనేవారు. అక్కడ వేరే ఏ ధర్మము ఉండేది కాదు. కావున అక్కడ ఏ రాజులైతే ఉంటారో, వారు విశ్వ మహారాజులుగానే పిలువబడతారు, ఆ తర్వాత వీరు ఫలానా ఊరికి, వీరు ఫలానా ఊరికి రాజులు అని పిలువబడతారు. మనం విశ్వ రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. మీరు యమునా తీరములో రాజ్యం చేస్తారని తండ్రి అర్థం చేయించారు. కావున 4 యుగాలు మరియు 4 వర్ణాలు ఉన్నాయని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. 5వ ది ఈ లీప్ యుగము, దీని గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యమైనది బ్రాహ్మణ ధర్మము. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మా ఎప్పుడు వచ్చారు? తప్పకుండా ఎప్పుడైతే తండ్రి సృష్టిని రచిస్తారో, అప్పుడు మొదట బ్రాహ్మణులు కావాలి. వీరు డైరెక్ట్ బ్రహ్మా ముఖవంశావళి. బ్రహ్మా శివబాబా యొక్క మొదటి సంతానము. విష్ణువును కూడా సంతానము అని అంటారా? లేదు. ఒకవేళ వారు సంతానమైతే వారి నుండి కూడా సంప్రదాయం ఉత్పన్నమవ్వాలి. కానీ విష్ణువు ద్వారానైతే సంప్రదాయం ఉత్పన్నమవ్వనే అవ్వదు. అలాగే వారిని తల్లి-తండ్రి అని సంబోధించరు. అక్కడ మహారాజు-మహారాణికి తమకంటూ ఒక కొడుకే ఉంటాడు. ఇది కర్మభూమి. పరమపిత పరమాత్మ కూడా వచ్చి కర్మలు చేయాల్సి ఉంటుంది, లేదంటే వారు వచ్చి ఏం చేసినందుకు వారికి ఇంత మహిమ జరుగుతుంది.

శివజయంతి అని కూడా అంటూ ఉంటారని మీరు చూస్తున్నారు. శివపురాణము రాసారు కానీ అందులో ఏ విషయమూ అర్థము కాదు. ముఖ్యమైనది గీతయే. శివబాబా ఏ విధంగా వస్తారు అన్నది మీరు మంచి రీతిలో అర్థము చేసుకున్నారు. బ్రహ్మా కూడా తప్పకుండా కావాలి. ఇప్పుడు బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? సూక్ష్మవతనంలోనైతే సంపూర్ణ బ్రహ్మా ఉన్నారు. ఈ విషయం దగ్గరే మనుష్యులు ఆగిపోతారు. బ్రహ్మా కర్తవ్యం ఏమిటి? సూక్ష్మవతనంలో ఉంటూ ఏం చేస్తూ ఉండవచ్చు? తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే వీరు వ్యక్త రూపంలో ఉంటారో, అప్పుడు వీరి ద్వారా జ్ఞానాన్నిస్తాను. తర్వాత వీరే జ్ఞానం తీసుకుంటూ-తీసుకుంటూ ఫరిశ్తాగా అవుతారు. అది సంపూర్ణ రూపము. అదే విధంగా, మమ్మా రూపము కూడా ఉంది, మీ సంపూర్ణ రూపము కూడా అలాగే తయారవుతుంది. వృద్ధ మాతలు – కేవలం తాము 84 జన్మలను ఎలా తీసుకుంటారు అన్నది ధారణ చేస్తే చాలు. బాబా కర్మక్షేత్రములో పాత్రను అభినయించేందుకు పంపిస్తారని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. అలాగని వారు నోటితో ఏమీ చెప్పరు. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. డ్రామానుసారంగా ప్రతి ఒక్కరు తమ-తమ సమయములో రావాల్సి ఉంటుంది. అందుకే సృష్టి ఆదిలో మొట్టమొదట ఎవరు ఉండేవారు, అంతిమంలో ఎవరుండేవారు అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అంతిమంలో మొత్తం సంప్రదాయమంతా శిథిలావస్థకు చేరుకుంది. అంతేగానీ ప్రళయమవుతుంది, మళ్ళీ శ్రీకృష్ణుడు బొటన వ్రేలును చప్పరిస్తూ వస్తారు అనేమీ కాదు. తండ్రి, బ్రహ్మా ద్వారా కొత్త సంప్రదాయాన్ని స్థాపన చేస్తారు. పరమపిత పరమాత్మ ఈ దైవీ సృష్టిని ఎలా రచిస్తారు, ఇది మీకు తెలుసు. వారైతే కృష్ణుడు రచించారని భావిస్తూ కూర్చున్నారు. తండ్రే పతితపావనుడని మీకు తెలుసు. వారు పావనంగా తయారుచేయడానికి అంతిమంలోనే వస్తారు. ఎవరైతే కల్పక్రితము పావనంగా అయ్యారో, వారే వస్తారు. వారు వచ్చి బ్రహ్మా ముఖవంశావళిగా అవుతారు మరియు పురుషార్థము చేసి శివబాబా నుండి తమ వారసత్వాన్ని తీసుకుంటారు. రచయిత, జ్ఞానసాగరుడు వారే కదా! వారసత్వము తండ్రి నుండి మాత్రమే లభించగలదు. దాదాకు కూడా వారి నుండే లభిస్తుంది. వారి మహిమయే గాయనము చేయబడుతుంది. త్వమేవ మాతాశ్చ పితా… తప్పకుండా సత్యమైన సుఖాన్ని ఇచ్చేవారు వారే. ఇది కూడా మీకు తెలుసు. ప్రపంచానికి తెలియదు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో, అప్పుడే దుఃఖము ప్రారంభమవుతుంది. రావణుడు తెలివితక్కువవారిగా తయారుచేస్తాడు. బాలుడిలో ఎప్పటివరకైతే వికారాలు ప్రవేశించవో, అప్పటివరకు అతడిని మహాత్ముని సమానమని అంటారు. ఎప్పుడైతే యువావస్థకు చేరుకుంటాడో, అప్పుడు లౌకిక సంబంధీకులు అతనికి దుఃఖము యొక్క దారిని చూపిస్తారు. నీవు వివాహం చేసుకోవాలి అన్న దారిని మొదట చూపిస్తారు. లక్ష్మీ-నారాయణులు మరియు సీతా-రాములు వివాహం చేసుకోలేదా? అని అంటారు. కానీ వారిది పవిత్రమైన ప్రవృత్తి మార్గమని వారికి తెలియనే తెలియదు. ఇది అపవిత్ర ప్రవృత్తి మార్గము. వారేమో పవిత్రమైన స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. మనము పతిత నరకానికి యజమానులుగా ఉన్నాము. ఈ ఆలోచన వారి బుద్ధిలోకి రాదు. మీరు భారత్ యొక్క మహిమను ఇలా వినిపిస్తారు – భారత్ స్వర్గంగా ఉండేదని, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేదని, వారు పవిత్రంగా ఉండేవారని మీరు మర్చిపోయారా. అందుకే అపవిత్రులు వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. పతితపావనుడైన తండ్రే పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తప్పకుండా పావన భారత్ ఉండేది. ఇప్పుడైతే తమ నోటితోనే – మేము పతితులమని అంటారు. ఏదైనా యుద్ధము మొదలైనది జరిగితే శాంతి కోసం యజ్ఞము రచిస్తారు. మంత్రాలను కూడా అదే విధంగా జపిస్తారు. కానీ శాంతి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. వాస్తవానికి ఇది చాలా సహజము. గాడ్ ఫాదర్ అని అంటున్నారంటే, మరి పిల్లలు అవుతారని కదా. వారు మనందరి తండ్రి కావున మనమంతా సోదరులయ్యాము కదా! తప్పకుండా మనము ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి, సోదరీ-సోదరులము. సత్యయుగంలో ముఖవంశావళి ఉండరు. కేవలం సంగమయుగంలో మాత్రమే ముఖవంశావళి అయినందుకు సోదరీ-సోదరులుగా పిలువబడతారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమయుగంలో, సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను, వారికి బ్రహ్మా అన్న పేరు పెడతాను. వారు మళ్ళీ జ్ఞానాన్ని ధారణ చేసి అవ్యక్త సంపూర్ణ బ్రహ్మాగా అవుతారు. వీరు, వారు ఒక్కరే. వేరొకరి విషయము కాదు. బ్రాహ్మణులు, మళ్ళీ వారే దేవతలుగా అవుతారు, చక్రములో తిరిగి అంతిమంలో శూద్రులుగా అవుతారు, మళ్ళీ బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. వృద్ధ మాతల విషయంలో కూడా బ్రాహ్మణీలు శ్రమ చేయాలి. మనము 84 జన్మలను పూర్తి చేసాము, ఇదైతే అర్థము చేసుకోగలరు కదా. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. వారు ఆత్మలందరికీ చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. శివబాబా అంటారు, లక్కీ సితారలు! ఓ సాలిగ్రామాలు! ఆత్మలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానాన్ని వేస్తారు. ఆత్మ వింటుంది, పరమాత్మ అయిన తండ్రి బ్రహ్మా ముఖము ద్వారా వినిపిస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటారు కావున తప్పకుండా వారు మనిషై ఉంటారు మరియు వృద్ధునిగా కూడా ఉంటారు. బ్రహ్మాను కూడా ఎల్లప్పుడూ వృద్ధునిగానే చూపిస్తారు. కృష్ణుడిని చిన్న బాలునిగా భావిస్తారు, బ్రహ్మాను ఎప్పుడూ చిన్న బాలునిగా చెప్పరు. వారి బాల్య రూపాన్ని చూపించరు. ఎలాగైతే లక్ష్మీ-నారాయణుల బాల్య రూపాన్ని చూపించరో, అలా బ్రహ్మాకు కూడా చూపించరు. నేను వృద్ధ తనువులోకి వస్తానని తండ్రి స్వయంగా అంటారు. కనుక పిల్లలైన మీరు కూడా ఇదే మంత్రాన్ని వినిపిస్తూ ఉండాలి. శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. శివుడిని, బ్రహ్మాను బాబా అని అంటారు, శంకరుడిని ఎప్పుడూ బాబా అని అనరు. వారైతే శివ-శంకరులను కలిపేస్తారు. కావున ఇది కూడా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ ఇప్పుడు వచ్చారు. ఇటువంటి సహజమైన విషయాలను వృద్ధ మాతలకు అర్థం చేయించాలి.

ఇంతకుముందు మిమ్మల్ని ఏ విధంగా తయారుచేసాను అని బాబా ప్రశ్న అడుగుతారు. అప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యాము అని కనీసం ఈ మాత్రమైనా చెప్పగలగాలి. తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయడంతో మీరు ఆత్మిక విదేశానికి వెళ్ళిపోతారు. ఆ విదేశము దూరదేశము కదా. ఆత్మలమైన మనమంతా దూరదేశంలో ఉండేవారము. మన ఇల్లు ఎక్కడ ఉందో చూడండి, సూర్య-చంద్రుల కన్నా పైన ఉంది. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. ఇప్పుడు ఆత్మలైన మీకు ఇల్లు గుర్తుకు వచ్చింది. మనము అక్కడ అశరీరిగా ఉండేవారము, శరీరముండేది కాదు. ఈ సంతోషముండాలి. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తాము. తండ్రి ఇల్లే మన ఇల్లు. బాబా అన్నారు – నన్ను స్మృతి చేయండి మరియు మీ ముక్తిధామాన్ని స్మృతి చేయండి. సైన్స్ గర్వము గలవారికి పరమాత్మ గురించి ఏమాత్రము తెలియదు. శివబాబాను స్మృతి చేయాలి అని వారి చెవులలో కూడా ఎంతోకొంత పడుతూ ఉండాలని తండ్రికి దయ కలుగుతుంది. దేహాభిమానము తొలగిపోవాలి, ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్య కథ. సత్యమైన తండ్రిని స్మృతి చేస్తే సత్యఖండానికి యజమానులుగా అయిపోతారు. సత్యమైన బాబాయే స్వర్గ స్థాపన చేస్తారు. ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచండి అని అంటారు. ప్రభుత్వ ఉద్యోగం 8 గంటలు చేస్తారు, దాని కన్నా ఇది చాలా ఉన్నతమైన సంపాదన. ఎక్కడికి వెళ్ళినా సరే, బుద్ధితో ఇది స్మృతి చేస్తూ ఉండాలి. మీరు కర్మయోగులు. ఎంత సులభంగా అర్థం చేయిస్తారు.

వృద్ధ మాతలను చూసి నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఎంతైనా వారు నా తోటివారు కదా. నేను యజమానిగా తయారై నా తోటివారు తయారవ్వకపోతే సరి కాదు కదా. తండ్రి అవినాశీ జ్ఞాన సర్జన్. జ్ఞాన ఇంజెక్షన్ ను సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమైంది. మీ అజ్ఞానము దూరమైపోయింది. బుద్ధిలోకి జ్ఞానం వచ్చింది. అన్ని విషయాలను తెలుసుకున్నారు.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉన్నతమైన సంపాదన చేసుకునేందుకు బుద్ధి యోగాన్ని ఇతరులందరి నుండి తెంచి ఒక్క తండ్రితో జోడించాలి. సత్యమైన తండ్రిని స్మృతి చేసి సత్యఖండానికి యజమానులుగా అవ్వాలి.

2. ఏ విధంగానైతే బ్రహ్మాబాబా జ్ఞానాన్ని ధారణ చేసి సంపూర్ణంగా అవుతారో, అలాగే తండ్రి సమానంగా సంపూర్ణంగా అవ్వాలి.

వరదానము:-

నిశ్చయానికి గుర్తు – మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలు, ప్రతి విషయములో సహజ విజయీ. ఎక్కడైతే నిశ్చయం ఎడతెగనిదిగా ఉంటుందో, అక్కడ విజయం తప్పకుండా లభిస్తుంది. ఇటువంటి నిశ్చయబుద్ధి గలవారే సదా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు. ఏ విషయంలోనైనా ఇది ఏమిటి, ఎందుకు, ఎలా అని అనడం కూడా చింతకు గుర్తు. నిశ్చయబుద్ధి నిశ్చింత ఆత్మ యొక్క స్లోగన్ ఏమిటంటే – ‘‘ఏదైతే జరిగిందో, మంచే జరిగింది, మంచే జరుగుతూ ఉంది మరియు మంచే జరగనున్నది.’’ వారు చెడులో కూడా మంచిని అనుభవం చేస్తారు. వారికి చింత అంటే ఏమిటో కూడా తెలియదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top