04 June 2021 TELUGU Murli Today – Brahma Kumari
3 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - శివబాబా మరియు బ్రహ్మాబాబా, ఇరువురి మతము ప్రసిద్ధమైనది, మీరు ఇరువురి మతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణం చేసుకోవాలి”
ప్రశ్న: -
నంబరు వన్ ట్రస్టీ ఎవరు మరియు ఎలా?
జవాబు:-
శివబాబా నంబరు వన్ ట్రస్టీ, వారికి అసలు ఆసక్తి ఉండదు. భక్తి మార్గంలో కూడా మీరు వారి పేరు మీద ఏవైతే దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారో, అదంతా ఇన్ష్యూర్ (బీమా) అయిపోతుంది, దాని ఫలం మరుసటి జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా తండ్రి పేరు మీద తమదంతా ఏదైతే ఇన్ష్యూర్ చేస్తారో, దానికి తండ్రి పూర్తి రిటర్న్ ఇస్తారు, ఎందుకంటే బాబా అంటారు – నేను స్వయం సుఖం అనుభవించను, నేను మీది తీసుకుని ఏమి చేసుకుంటాను.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ప్రమాణము చేసి మీ ద్వారం వద్దకు వచ్చాము….. (దర్ పర్ ఆయే హై కసమ్ లేకే…..)
ఓంశాంతి. మధురాతి-మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారిని పిల్లలు అని అనడం జరుగుతుంది. ఇది అంతిమ మరజీవా జన్మ అని తండ్రి అర్థం చేయించారు. జీవిస్తూ తండ్రికి చెందినవారిగా అవ్వాలి. శ్రీమతం గాయనం చేయబడిందని పిల్లలకు తెలుసు. శ్రీమతమనేది భగవానువాచ. గీతలో కృష్ణుని పేరు వేసేశారు కానీ శ్రీమతం శివబాబాది. వారి తర్వాత బ్రహ్మా, ఆ తర్వాత కృష్ణుడు. శ్రీమతం కృష్ణుడిది అని అనరు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు మన తండ్రి. పతితపావన అని కృష్ణుడిని గాని, రాధను గాని అనరు. వారు దైవీ గుణాలు కల మనుష్యులు. మనుష్యులను పతితపావనులని అనరు. సత్యయుగంలో, పతితపావనా రండి అని అనరు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి శ్రీమతంపైనే మీరు నడుస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మా మతం కూడా ప్రసిద్ధమైనది. శ్రీమతం కూడా ప్రసిద్ధమైనది. కానీ అందులో తండ్రి పేరుకు బదులుగా కృష్ణుని పేరు వేసి పొరపాటు చేసారు. అన్ని ధర్మాల వారికి తండ్రి ఒక్కరే. కృష్ణుడిని అందరూ ఒప్పుకోరు. క్రైస్తవులు క్రీస్తును ఫాదర్ గా అంగీకరిస్తారు కానీ కృష్ణుడిని అంగీకరించరు, ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తు యొక్క ముఖవంశావళి. శివబాబా వచ్చి మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ప్రమాణం చేసి తండ్రికి చెందినవారిగా అయ్యాము అని అంటారు. కావున వారి డైరెక్షన్లపై నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు తండ్రికి మీ మతాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా మతాన్ని ఇచ్చేవారు. మీరంతా పిల్లలే. శివబాబా ప్రసిద్ధమైనవారు. వారు ఏ మతాన్ని ఇస్తారో, ఏమి చేస్తారో అదంతా రైట్. ఇది చేయండి అని ఈ బ్రహ్మాకు కూడా వారు మతాన్ని ఇస్తారు. మీ కనెక్షన్ శివబాబాతో ఉంది. ఎవరి అవగుణాలను చూడకూడదు, శ్రీమతాన్ని అనుసరించాలి. శివబాబా నిరాకారుడు. ఇది వారి ఇల్లు కాదు. ఇక్కడ మీరు పాత ఇంట్లో ఉంటారు, తర్వాత స్వర్గంలోకి వెళ్ళి మీ ఇంట్లో ఉంటారు. నేనైతే ఉండను అని శివబాబా అంటారు. నేనైతే ఇప్పుడు కొద్ది సమయం కోసం ఇక్కడకు వస్తాను.
మీరు సత్యాతి-సత్యమైన ఆత్మిక ముక్తి దళం. డ్రామా ప్లాన్ అనుసారంగా, కల్పక్రితం వలె సుప్రీమ్ ఆత్మ డైరెక్షన్లు ఇస్తున్నారు. కల్ప-కల్పం ఏ డైరెక్షన్లు అయితే ఇస్తూ ఉంటారో, అవే ఇస్తారు. రాత్రింబవళ్ళు గుహ్యమైనవి వినిపిస్తూ ఉంటారు. కొత్తవారు ఎవరూ ఇవి అర్థం చేసుకోలేరు. కొందరు 35-40 సంవత్సరాల నుండి ఉంటారు, కానీ ఈ గంభీరమైన విషయాలను అర్థం చేసుకోనివారు చాలా మంది ఉన్నారు. బాబా అయితే రోజూ కొత్తవి వినిపిస్తూ ఉంటారు. కరాచీ నుండి మొదలుకొని మురళీ పంపిస్తూ వచ్చారు. మొదట్లో బాబా మురళీ వినిపించేవారు కాదు. రాత్రి 2 గంటలకు లేచి 10-15 పేజీలు రాసేవారు. బాబా రాయించేవారు. తర్వాత దాని కాపీలు తీసేవారు. భక్తి మార్గంలోనైతే శాస్త్రాలు మొదలైనవాటి కాగితాలను సంభాళిస్తారు. రోజురోజుకు పెద్ద-పెద్ద పుస్తకాలను తయారుచేస్తూ ఉంటారు. ఎన్ని బయోగ్రఫీలను తయారుచేస్తూ ఉంటారు. వాటిని చదువుకొని అలా పెట్టుకుంటారు. మీరైతే మురళీ చదువుకుని వదిలేస్తారు. వాస్తవానికి ఈ మహావాక్యాలను సదా కోసం పెట్టుకోవాలి. కానీ ఇవన్నీ వినాశనమైపోతాయని తెలుసు. చిత్రాలు మొదలైనవి ఏవైతే మీరు తయారుచేస్తారో, అవి కొద్ది సమయం కోసమే ఉంటాయి. తర్వాత భూమిలో పూడ్చుకుపోతాయి, ఇక అక్కడ ఈ శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇదంతా కల్పం తర్వాత కూడా జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ ద్వాపరం నుండి ప్రారంభమవుతాయి. గ్రంథ్ కూడా మొదట్లో చేతితో రాయబడినదిగా, చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు పెద్దగా తయారుచేశారు. రోజురోజుకు పెద్దగా తయారుచేస్తూ ఉంటారు. అలా చూస్తే, శివబాబా జీవిత కథను ఎంత రాయాలి. పరమపిత పరమాత్ముని జీవిత కథ మాకు తెలుసు అని ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు. తాను భక్తి మార్గంలో ఏం చేస్తారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా ఇన్ష్యూరెన్స్ చేస్తాను. ఈశ్వరార్థము మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు కదా. ఫలానావారు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేశారని, అందుకు ఈశ్వరుడు పెద్ద ఇంట్లో జన్మనిచ్చారని అంటారు. భక్తి మార్గంలో ధర్మాత్ములు చాలామంది ఉంటారు. ఈశ్వరార్థము, శ్రీకృష్ణార్థము దాన-పుణ్యాలు చేస్తారు, అందుకే నేను పిల్లలకు మరుసటి జన్మకు అల్పకాలం కోసం ఫలాన్ని ఇస్తూ వచ్చానని తండ్రి అర్థం చేయిస్తారు. మంచి లేక చెడు ఫలం లభిస్తుంది కదా. ఎంత ఇన్ష్యూరెన్స్ అయ్యింది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే, దాని అనుసారంగా ఫలం లభిస్తుంది. మాయ తప్పుడు కర్మలు చేయిస్తుంది, వాటి వల్ల మీరు దుఃఖం పొందుతారు. ఇప్పుడు నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే, ఇక మీకు ఎప్పుడూ దుఃఖం కలగదు మరియు మాయ కూడా అక్కడ ఉండదు. ఇకపోతే, ఎవరు ఎంత ఇన్ష్యూర్ చేసుకుంటే, అంత పదవి లభిస్తుంది. శివబాబా కూడా ట్రస్టీ కదా. వారు నంబరు వన్ ట్రస్టీ. వేరే ట్రస్టీలకు ఆసక్తి కలుగుతుంది, కొందరు ట్రస్టీలైతే ఇతరులకు కష్టాలు కలిగిస్తారు. తండ్రి ఎటువంటి ట్రస్టీనో చూడండి, ఇదంతా పిల్లల కోసమే అని అంటారు. మీ కనెక్షన్ అంతా శివబాబాతో ఉంది. నేను సత్యమైన ట్రస్టీను అని తండ్రి అంటారు. నేను స్వయం సుఖం తీసుకోను, మొత్తం రాజధాని అంతా పిల్లలకు ఇస్తాను. లౌకిక తండ్రి కూడా పిల్లలకు అంతా వారసత్వంగా ఇచ్చేస్తారు. నేనైతే స్వర్గంలో ఏమీ తీసుకోను. అంతా మీకే ఇస్తాను. కావున మీ కనెక్షన్ అంతా శివబాబాతో ఉంది. నేను కూడా పూర్తిగా ఇన్ష్యూర్ చేసుకున్నానని ఈ బాబా అంటారు. తనువు-మనస్సు-ధనము అంతా తండ్రి సేవలో ఉంది. సింధీలో ఒక నానుడి ఉంది – ఎవరి చేతులు ఇలా (దాత రూపంలో) ఉంటాయో, వారికి మొట్టమొదటి ఫలం లభిస్తుంది అని. తండ్రి వద్ద అంతా ఇన్ష్యూర్ చేసుకోవాలి. రెండు పిడికెళ్ళ బియ్యాన్ని ఇస్తే మహల్ లభించింది. ఇప్పుడు చూడండి, ఇల్లు తయారయ్యింది, మా ఇటుక కూడా వేయండి అని ఒకరు ఒక రూపాయి పంపించారు. తండ్రి వారికి ఇలా రాసారు – మీకు అందరికన్నా మంచి మహల్ లభిస్తుంది ఎందుకంటే మీరు పేదవారు. నేను పేదల పెన్నిధిని. పేదవారి ఒక రూపాయి షావుకారుల పదివేల రూపాయలతో సమానము. ఇద్దరికీ ఒకే పదవి లభిస్తుంది. షావుకారులు చాలా అరుదుగా వస్తారు. కన్యలు అందరికన్నా ఫ్రీ గా ఉంటారు. మమ్మా నంబరు వన్ అయ్యారు చూడండి. వారి వద్ద ఏమీ లేదు. పేద కుటుంబం నుండి వచ్చారు కానీ నంబరు వన్ లోకి వెళ్ళిపోయారు. ఇతను (బ్రహ్మాబాబా) తమదంతా ఇచ్చేసారు, అయినా కానీ ముందు లక్ష్మీ, ఆ తర్వాత నారాయణుడు అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన ఆట. కావున ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం ఉండకూడదు. బాప్ దాదా తక్కువేమీ కాదు. ఇందులో కొద్దిగా కూడా సంశయం రానివ్వకూడదు. చాలా మధురంగా కూడా అవ్వాలి. అడుగడుగునా శ్రీమతం తీసుకోవాలి. లేదంటే మాయ చాలా నష్టం కలిగిస్తుంది. పిల్లలకు ఎన్ని డైరెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం రాయండి అని బాబా అంటారు. బాబా అన్ని రకాలుగా సంభాళిస్తారు. ఫలానా బడ్డ ఉన్నతంగా అవ్వాలని బాబాకు చాలా సంకల్పం ఉంటుంది. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉండాలి. మనం మోస్ట్ బిలవెడ్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ (అత్యంత ప్రియమైన ఈశ్వరీయ విద్యార్థులము). భగవానువాచ అని కూడా రాయబడి ఉంది కానీ కృష్ణుడి పేరు వేసేశారు. కృష్ణుడు కూడా మనుష్యులందరిలోనూ ఉన్నతోన్నతమైనవారు కదా. వారు మొదటి రాకుమారుడు. కృష్ణుని పేరు తీసుకుంటారు కానీ నారాయణుని పేరు ఎందుకు తీసుకోరు? కృష్ణుడు బాలుడు. చిన్నతనంలో బాలుడు సతోప్రధానంగా ఉంటాడు. తర్వాత బాల్యం నుండి యువావస్థ, తర్వాత వృద్ధావస్థ వస్తుంది. పిల్లలకు మహిమ చేస్తారు ఎందుకంటే పిల్లలు పవిత్రమైనవారు కదా. పిల్లలను బ్రహ్మా జ్ఞానుల సమానమైనవారు అని అంటారు. పిల్లల ద్వారా ఏ పాపము జరగదు. కావున, కృష్ణుడు కూడా చిన్న బాలుడు అయిన కారణంగా వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అయినా కృష్ణుడిని ద్వాపరంలో చూపించారు. ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ విషయాలన్నీ తెలిసినవారు బ్రాహ్మణులైన మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. బ్రాహ్మణులు ఉత్తమమైనవారు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. సత్యయుగంలో ఈశ్వరీయ సంతానమని అనరు. ఈశ్వరుని ద్వారా తప్పకుండా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఇది మీ అతి దుర్లభమైన, అమూల్యమైన జీవితము. అందరిదీ ఇలా ఉండదు. ఈ డ్రామా ఇలా తయారై ఉంది. ఎవరైతే కల్పక్రితం చదువుకున్నారో, వారు చదువుకుంటున్నారు. భగవంతుడు తప్పకుండా భగవాన్-భగవతీలను సృష్టించారు కానీ వారిని భగవాన్-భగవతి అని అనలేరు. గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే). నిరాకారుడికి మహిమ ఉంది. సాకారునికి మహిమ జరగదు. ఈ లక్ష్మీనారాయణులను నిరాకారుడే ఈ విధంగా తయారుచేసారు. వీరు ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. రాజధాని స్థాపన అయినప్పుడు, ఆ సమయంలో వినాశనం కూడా జరిగింది. తండ్రి తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడిది సంగమయుగం యొక్క విషయము. శివబాబా వచ్చినప్పుడు ఆట పూర్తవుతుంది, ఆ తర్వాత కృష్ణుని జన్మ జరుగుతుంది. మనుష్యులు పాపం తికమకపడిపోయారు, అందుకే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా శాస్త్రాలన్నింటి సారాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు మీరు మాస్టర్ నాలెడ్జ్ పుల్ గా అయ్యారు. మహిమ అంతా ఆత్మదే. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, బ్లిస్ ఫుల్ – ఇది తండ్రి మహిమ. తండ్రి అంటారు – ఈ భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము కానీ కృష్ణుని పేరు వేయడంతో మహిమను అంతా మాయం చేసారు. లేదంటే అందరూ శివుని మందిరంలో పుష్పాలు అర్పిస్తారు, అందరి సద్గతిదాత వారొక్కరే. అర్ధకల్పం మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, తర్వాత కిందకు వస్తారు. అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. పిల్లలైన మీ కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను అని ఇప్పుడు తండ్రి అంటారు. నేను అక్కడకు రాను, అంతా పిల్లలైన మీ కోసమే. ఇది క్లియర్ విషయము. మనుష్యులు తమ కోసం చేసుకుంటారు కానీ నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. నిష్కామ సేవను ఎవ్వరూ చేయలేరు. ప్రతి దానికి తప్పకుండా ఫలం లభిస్తుంది. నేను పిల్లలైన మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తాను. మీ కోసమే వైకుంఠాన్ని తీసుకొచ్చాను. పిల్లలకు సావరిన్టీ యొక్క సావనీర్ (రాజ్యాధికార స్మారక) ను ఇస్తారు కావున అది తీసుకునేందుకు ఆ విధంగా యోగ్యులుగా అవ్వాలి. స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. అరచేతిలో వైకుంఠం లభిస్తుంది. క్షణంలో జీవన్ముక్తి అనగా క్షణంలో రాజ్యాధికారము. శివబాబా దివ్యదృష్టి దాత. క్షణంలో వైకుంఠానికి తీసుకువెళ్తారు, ఈ బాబా (బ్రహ్మా) చేతిలో తాళంచెవి ఏమీ లేదు. నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇస్తాను, నేను రాజ్యం చేయను అని తండ్రి అంటారు. తర్వాత మీరు భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు, మిమ్మల్ని దివ్యదృష్టితో ఆహ్లాదపరచవలసి ఉంటుంది. ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇలాంటి బాబా కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. తయారై ఉన్నదే తయారవుతుంది, ఇప్పుడు కొత్తగా ఏదీ తయారవ్వదు….. ఏది జరుగుతుందో, అది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. దానిని సాక్షీగా అయి చూడండి. బాబా చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలూ, నేను మీ ఇన్ష్యూరెన్స్ మ్యాగ్నెట్ ను. మీ ఒక్క పైసాను కూడా నేను వ్యర్థంగా పోగొట్టను. గవ్వ నుండి మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారుచేస్తాను. ఇదంతా శివబాబా వీరి ద్వారా చేస్తారు, శివబాబా కరన్ కరావన్ హార్ (చేసి చేయించేవారు). వారు నిరాకారుడు, నిరహంకారి. గాడ్ ఫాదర్ ఎలా కూర్చొని చదివిస్తారు. చరణాలపై పడండి అని వారు చెప్పరు. తండ్రి విధేయుడైన సేవకుడు. ఎవరినైతే యజమానులుగా చేసానో, వారు సుఖాన్ని అనుభవించి-అనుభవించి ఇప్పుడు దుఃఖమయంగా అయ్యారు అని తండ్రి అంటారు. సుఖం కూడా చాలా లభిస్తుంది. ఇంత సుఖం ఏ ధర్మం వారికీ లభించదు. భారతవాసులకే ఎందుకు లభిస్తుంది, మిగిలినవారు ఏమి చేసారు అని అనకూడదు. అరే, ఇంతమంది మనుష్యులున్నారు, అందరూ రాలేరు కదా. ఈ డ్రామా తయారై ఉంది. భారత్ లోనే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. భగవంతుడు వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. నేను మళ్ళీ వచ్చి ఉన్నాను అని తండ్రి అంటారు. 84 జన్మల పాత్రను అభినయించాము, ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్తామని మీకు కూడా తెలుసు. ఇది చాలా పాత శరీరం అయిపోయింది (సర్పం యొక్క ఉదాహరణ). సన్యాసులేమో ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని అంటారు. ఇటువంటి అవస్థలో ఉంటూ-ఉంటూ శరీరాన్ని వదిలేస్తారు కానీ బ్రహ్మా తత్వంలో ఎవరూ లీనమవ్వరు. వారిలో కూడా కొందరు చాలా చురుకుగా ఉంటారు. శాంతిగా కూర్చొని శరీరం వదిలి వెళ్ళిపోతారు, అప్పుడు ఆ వాయుమండలంలో 2-3 రోజుల వరకు నిశ్శబ్దత ఏర్పడుతుంది. ఈ పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తామని మీకు తెలుసు. బ్రహ్మా తత్వం బాబా కాదు, ఇది పాపం వారి భ్రమ. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షీగా చూడాలి ఎందుకంటే తయారై ఉన్నదే తయారవుతుంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు.
2. తండ్రి ఇన్ష్యూరెన్స్ మ్యాగ్నెట్ కావున తనువు-మనసు-ధనమును తండ్రి సేవలో సఫలం చేసుకుని తమ భవిష్యత్తును తయారుచేసుకోవాలి. తండ్రితో పూర్తి కనెక్షన్ పెట్టుకోవాలి. వారికి పూర్తి సమాచారం ఇవ్వాలి.
వరదానము:-
ఏ వస్తువైనా ఎంత ఎక్కువ శక్తిశాలిగా ఉంటే, దాని క్వాంటిటీ (పరిమాణం) అంత తక్కువగా ఉంటుంది. అలాగే మీరు మీ నిర్వాణ స్థితిలో స్థితులై వాణిలోకి వస్తే, మాటలు తక్కువగా ఉంటాయి కానీ యథార్థంగా మరియు శక్తిశాలిగా ఉంటాయి. ఒక్క పదంలో వేలాది మాటల రహస్యం ఇమిడి ఉంటుంది, దీని ద్వారా వ్యర్థ వాణి స్వతహాగా సమాప్తమవుతుంది. ఒక్క మాటతో జ్ఞానం యొక్క సర్వ రహస్యాలను స్పష్టం చేయగలరు, విస్తారం సమాప్తమైపోతుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!