01 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

September 30, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు చాలా ఉన్నతమైన జాతికి చెందినవారు, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి, అందుకే అశుద్ధమైన వికారీ అలవాట్లను తొలగించుకోవాలి”

ప్రశ్న: -

ఈ చదువుకు ఏ విషయంతో కనెక్షన్ లేదు?

జవాబు:-

ఈ చదువుకు డ్రెస్సు మొదలైనవాటితో కనెక్షన్ లేదు, ఇందులో డ్రెస్సు మార్చుకోవాల్సిన విషయమేమీ లేదు. తండ్రి అయితే ఆత్మలను చదివిస్తారు. ఇది పాత పతిత శరీరమని ఆత్మకు తెలుసు, దీనికి ఎలాంటి సాధారణ వస్త్రాలను ధరింపజేసినా ఫర్వాలేదు. శరీరం మరియు ఆత్మ, రెండు నల్లగా ఉన్నాయి. తండ్రి నల్లగా ఉన్నవారినే తెల్లగా తయారుచేస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక పాఠశాలలో ఆత్మిక తండ్రి ఎదురుగా ఆత్మిక పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇది భౌతిక పాఠశాల కాదు. ఆత్మిక పాఠశాలలో ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనం మళ్ళీ నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు అనగా దేవీ-దేవతా పదవిని ప్రాప్తించుకునేందుకు ఆత్మిక తండ్రి వద్ద కూర్చొన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇది కొత్త విషయము. ఒకప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యముండేదని, వారు డబల్ కిరీటధారులుగా ఉండేవారని కూడా మీకు తెలుసు. ఆ సమయంలో లైట్ కిరీటం మరియు రత్నజడిత కిరీటం, రెండూ ఉండేవి. మొట్టమొదటగా లైట్ కిరీటముంటుంది. ఎవరైతే ఉండి వెళ్ళారో, వారికి తెల్లటి లైట్ ను చూపిస్తారు. ఇది పవిత్రతకు గుర్తు. అపవిత్రులకు ఎప్పుడూ లైట్ ను చూపించరు. మీకు ఫోటో తీసినప్పుడు అందులో లైట్ ను చూపించలేరు. ఇది పవిత్రతకు గుర్తుగా చూపిస్తారు. లైట్ మరియు చీకటి ఉంటాయి, బ్రహ్మా పగలు లైట్, బ్రహ్మా రాత్రి చీకటి. చీకటి అనగా వారికి లైట్ ఉండదు. తండ్రియే వచ్చి ఇంతమంది పతితులను అనగా ఎవరైతే పూర్తి నల్లగా అయిపోయారో, వారందరినీ పావనంగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పవిత్ర రాజధాని లేదు. సత్యయుగంలో యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ పవిత్రంగా ఉండేవారు. అక్కడ ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఈ చిత్రాన్ని చూపించి పిల్లలైన మీరు చాలా బాగా అర్థం చేయించాలి. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. అర్థం చేయించేందుకు ఇంకా మంచి చిత్రాలున్నాయి, అందుకే ఇన్ని చిత్రాలను ఉంచడం జరుగుతుంది. మనం ఈ స్మృతి యాత్రతో తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతామని, తర్వాత ముక్తి-జీవన్ముక్తిలలోకి వెళ్ళిపోతామని మనుష్యులెవ్వరూ వెంటనే అర్థం చేసుకోరు. జీవన్ముక్తి అని దేనినంటారు అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుండేది అనేది కూడా ఎవరికీ తెలియదు. మనం తండ్రి నుండి పవిత్రత యొక్క దైవీ స్వరాజ్యాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మీరు చిత్రాలను చూపిస్తూ చాలా బాగా అర్థం చేయించవచ్చు. భారత్ లోనే డబల్ కిరీటధారులను పూజిస్తారు. దీనికి సంబంధించిన చిత్రం కూడా మెట్ల చిత్రంలో ఉంది. మిగతావారికి స్థూల కిరీటముంటుంది కానీ లైట్ కిరీటం ఉండదు. పవిత్రులకే పూజ జరుగుతుంది. లైట్ పవిత్రతకు గుర్తు. అలాగని ఎవరైనా సింహాసనంపై కూర్చోగానే లైట్ వస్తుందని కాదు. ఇది పవిత్రతకు గుర్తు. ఇప్పుడు మీరు పురుషార్థులు, అందుకే మీకు లైట్ ను చూపించలేము. దేవీ దేవతలకు ఆత్మ మరియు శరీరం, రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడైతే ఎవరికీ పవిత్రమైన శరీరం లేదు, అందుకే లైట్ ను చూపించలేము. మీలో కూడా, కొందరైతే పూర్తి పవిత్రంగా ఉంటారు, కొందరు సెమీ (సగం) పవిత్రంగా ఉంటారు. మాయా తుఫానులు చాలా వస్తే, వారిని సెమీ పవిత్రులని అంటారు. కొందరైతే పూర్తిగా పతితులుగా అయిపోతారు. మేము పతితులుగా అయ్యామని వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మయే పతితంగా అవుతుంది, అప్పుడు లైట్ ను చూపించలేము.

మేము ఉన్నతోన్నతమైన తండ్రి సంతానమని పిల్లలైన మీరు మర్చిపోకూడదు, మరి ఎంత రాయల్టీ ఉండాలి! ఎవరైనా పాకీపని చేసేవారు ఎం.ఎల్.ఏ గా లేక ఎం.పి గా అయితే లేక చదువుకొని ఏదైనా మంచి పొజిషన్ కు చేరుకుంటే, అతను టిప్ టాప్ గా తయారవుతారు. ఈ విధంగా చాలామంది తయారయ్యారు. వారి జాతి అదే కానీ పొజిషన్ లభించడంతో నషా ఎక్కుతుంది. ఇక డ్రెస్సు మొదలైనవి కూడా అటువంటివే ధరిస్తారు. అలాగే ఇప్పుడు మీరు కూడా పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు చదువుకుంటున్నారు. వారు కూడా చదువు ద్వారా డాక్టరు, బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతారు కానీ వారు పతితులే కదా, ఎందుకంటే వారి చదువేమీ పావనంగా తయారుచేసేది కాదు. మనం భవిష్యత్తులో పవిత్ర దేవీ-దేవతలుగా తయారవుతామని మీకు తెలుసు కనుక శూద్రత్వము యొక్క అలవాట్లు తొలగుతూ ఉంటాయి. లోలోపల, మమ్మల్ని పరమపిత పరమాత్మ డబల్ కిరీటధారులుగా తయారుచేస్తున్నారనే నషా ఉండాలి. మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము, తర్వాత దేవతలుగా అవుతాము కనుక ఆ అశుద్ధమైన వికారీ అలవాట్లు తొలగిపోతాయి. ఆసురీ వస్తువులన్నింటినీ వదిలేయాల్సి ఉంటుంది. పాకీపని చేసేవారు ఎం.పి.గా అయినప్పుడు, అతని జీవన శైలి, ఇల్లు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్ గా అవుతాయి. వారిది ఈ సమయం కోసమే ఉంటుంది. మనం భవిష్యత్తులో ఎలా తయారవ్వనున్నాము అనేది మీకు తెలుసు. మీతో మీరు ఇలా మాట్లాడుకోవాలి – మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అయ్యాము అని. మీరు కూడా శూద్ర జాతికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎవరైనా ఉన్నత పదవిని పొందినప్పుడు, ఆ నషా ఉంటుంది కదా. మరి మీరు కూడా ఎలా ఉండేవారు? (పతితులు) ఛీ-ఛీ గా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివించి అనంతమైన యజమానులుగా తయారుచేస్తారు. పరమపిత పరమాత్మ తప్పకుండా ఇక్కడికే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మూలవతనం లేక సూక్ష్మవతనంలో నేర్పించరు. మీరంతా దూరదేశంలో నివసించే ఆత్మలు, ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. 84 జన్మల పాత్రను అభినయించాల్సిందే. వారు 84 లక్షల యోనులని అంటారు. ఎంతటి ఘోరమైన అంధకారంలో ఉన్నారు. 5 వేల సంవత్సరాల క్రితం మనం దేవీ-దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పతితులుగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఓ పతితపావనా రండి, మమ్మల్ని పావనంగా చేయండి అని పాడుతారు కూడా, కానీ అర్థం చేసుకోరు. ఇప్పుడు స్వయంగా తండ్రి పావనంగా తయారుచేసేందుకు వచ్చారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. చదువు లేకుండా ఎవ్వరూ ఉన్నత పదవిని పొందలేరు. బాబా మనల్ని చదివించి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారని మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ప్రజా పదవి లక్ష్యమేమీ కాదు. చిత్రము కూడా లక్ష్మీనారాయణులదే ఉంది. ఎక్కడైనా ఇలాంటి చిత్రాలు పెట్టి చదివిస్తారా? మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మనం 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యాము. మెట్ల చిత్రం చాలా బాగుంది. ఇది పతిత ప్రపంచం కదా, ఇందులో సాధు-సత్పురుషులంతా ఉన్నారు. స్వయంగా వారు కూడా పతితపావనా రండి – అని పాడుతూ ఉంటారు. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచమని అనరు. కొత్త ప్రపంచము పావన ప్రపంచము. పాత పతిత ప్రపంచంలో పావనమైనవారు ఎవరూ ఉండరు. కనుక పిల్లలైన మీకు ఎంత నషా ఉండాలి. మనం గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్, మనల్ని ఈశ్వరుడు చదివిస్తారు. తండ్రి వచ్చి పేదవారినే చదివిస్తారు. పేదవారి వస్త్రాలు మొదలైనవి మురికిగా ఉంటాయి కదా. మీ ఆత్మ చదువుకుంటుంది కదా. ఇది పాత శరీరమని ఆత్మకు తెలుసు. దీనికి సాధారణ వస్త్రాలు వేసినా పర్వాలేదు. ఇందులో డ్రెస్సు మొదలైనవి మార్చుకోవడం లేక ఆర్భాటం చేసే విషయమేమీ లేదు. ఇక్కడ డ్రెస్సుతో ఎలాంటి సంబంధము లేదు. తండ్రి ఆత్మలను చదివిస్తారు. శరీరమైతే పతితంగా ఉంది. శరీరానికి ఎంత మంచి వస్త్రాలు వేసినా కానీ, ఆత్మ మరియు శరీరం పతితంగా ఉన్నాయి కదా. కృష్ణుడిని నల్లగా చూపిస్తారు కదా. వారి ఆత్మ మరియు శరీరం, రెండు నల్లగా ఉండేవి. పల్లెటూరి బాలునిగా ఉండేవారు, మీరంతా పల్లెటూరి పిల్లలుగా ఉండేవారు. ప్రపంచంలో మనుష్యమాత్రులంతా అనాథలుగా ఉన్నారు. తండ్రి గురించి తెలియనే తెలియదు. హద్దు తండ్రి అయితే అందరికీ ఉన్నారు. అనంతమైన తండ్రి బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభించారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భక్తి మరియు జ్ఞానము. భక్తి అంతమైనప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడిది అంతిమము. సత్యయుగంలో ఇవేవీ ఉండవు. ఇప్పుడు పాత ప్రపంచ వినాశనం సమీపంగా ఉంది. పావన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. చిత్రాలలో ఎంత స్పష్టంగా అర్థం చేయించబడింది. రాధా-కృష్ణులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారని మీకు తెలుసు. మీరు స్వర్గం యొక్క స్వయంవరాన్ని కూడా చూసారు. పాకిస్తాన్ లో పిల్లలైన మిమ్మల్ని ఆహ్లాదపరిచేందుకు అన్ని రకాల వాయిద్యాలు ఉండేవి, మీకు అన్ని సాక్షాత్కారాలు కలిగేవి.

మనం రాజయోగం నేర్చుకుంటున్నామని మీకు తెలుసు, ఇది మర్చిపోకూడదు. వంట పని చేస్తున్నా లేక పాత్రలు శుభ్రం చేస్తున్నా, చదువుకునేది అయితే అందరి ఆత్మనే కదా. ఇక్కడికి అందరూ వచ్చి కూర్చొంటారు, అందుకే పెద్ద-పెద్ద వ్యక్తులు రారు – ఇక్కడ అందరూ పేదవారే ఉన్నారని అనుకుంటారు కావున వారికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రి పేదల పెన్నిధి. కొన్ని సెంటర్లకు పాకీపని చేసేవారు కూడా వస్తారు. కొందరు ముసల్మానులు కూడా వస్తారు. తండ్రి అంటారు – దేహ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టండి. మేము గుజరాతీలము, మేము ఫలానా – ఇదంతా దేహాభిమానము. ఇక్కడైతే ఆత్మలను పరమాత్మ చదివిస్తారు. తండ్రి అంటారు – నేను సాధారణ తనువులోకే వచ్చాను కనుక సాధారణమైన వారి వద్దకు సాధారణమైన వారే వస్తారు. ఇతను వజ్రాల వ్యాపారిగా ఉండేవారని తెలుసు. తండ్రి స్వయంగా గుర్తు తెప్పిస్తారు – నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తానని కల్పక్రితం కూడా చెప్పాను, అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు – అని వీరికి (బ్రహ్మాకు) చెప్తాను. కేవలం ఒక్క అర్జునుడికి మాత్రమే గుర్రం రథంలో కూర్చొని జ్ఞానం ఇవ్వలేదు కదా, దానిని పాఠశాల అని అనరు. ఇది యుద్ధ మైదానం కాదు, ఇది చదువు. పిల్లలు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. మనం పూర్తిగా చదువుకొని డబల్ కిరీటధారులుగా తయారవ్వాలి. ఇప్పుడైతే ఏ కిరీటము లేదు. భవిష్యత్తులో డబల్ కిరీటధారులుగా తయారవ్వాలి. ద్వాపరం నుండి లైట్ పోతుంది కనుక సింగిల్ కిరీటముంటుంది. సింగిల్ కిరీటధారులు, డబల్ కిరీటధారులను పూజిస్తారు. ఈ గుర్తు కూడా తప్పకుండా ఉండాలి. బాబా చిత్రాల గురించి డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు కనుక చిత్రాలు తయారుచేసేవారికి మురళీ పట్ల చాలా అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే, చిత్రాలతో అర్థం చేయించడం చాలా సహజము. ఉదాహరణకు కాలేజీలో మ్యాప్ చూపించినట్లయితే, యూరోప్ అటువైపు ఉంది, ఐర్లాండ్ ఇటువైపు ఉంది, లండన్ అటువైపు ఉంది అని బుద్ధిలోకి వస్తుంది. మ్యాప్ నే చూడలేదంటే, యూరోప్ ఎక్కడుందో వారికెలా తెలుస్తుంది. మ్యాప్ చూస్తే వెంటనే బుద్ధిలోకి వస్తుంది. పైన పూజ్య డబల్ కిరీటధారులైన దేవీ-దేవతలున్నారని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత, కిందకు వచ్చినప్పుడు పూజారులుగా అవుతారు. మెట్లు దిగుతారు కదా. ఈ మెట్ల చిత్రం చాలా సహజముగా ఉంది. ఈ చిత్రాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. కానీ, కొందరి బుద్ధిలో అసలేమీ కూర్చోదు. వారి భాగ్యమే అలా ఉంటుంది. స్కూల్లో కూడా పాస్ అయ్యేవారు, ఫెయిల్ అయ్యేవారు ఉంటారు. భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా జరగదు, రోగగ్రస్తులుగా అవుతారు, ఇక చదువుకోలేరు. కొందరైతే పూర్తిగా చదువుకుంటారు. కానీ, ఎంతైనా అది భౌతిక చదువు, ఇది ఆత్మిక చదువు. దీని కోసం బంగారు బుద్ధి కావాలి. తండ్రి బంగారం వంటి వారు, సదా పవిత్రమైనవారు, వారిని స్మృతి చేస్తే మీ ఆత్మ బంగారంగా తయారవుతూ ఉంటుంది. ఫలానావారు పూర్తి రాతి బుద్ధి కలవారని అంటూ ఉంటారు. ఆ ప్రపంచంలో ఈ విధంగా అనరు. అది స్వర్గంగా ఉండేది. భారత్ స్వర్గంగా ఉండేదని మర్చిపోయారు. ఇది కూడా ఎక్కడైనా ప్రదర్శనీలలో అర్థం చేయించవచ్చు, తర్వాత వారి చేత రిపీట్ కూడా చేయించవచ్చు. ప్రొజెక్టరుతో ఇది సాధ్యం కాదు. మొట్టమొదట ఈ త్రిమూర్తి, లక్ష్మీనారాయణులు మరియు మెట్ల చిత్రాలు చాలా అవసరము. ఈ లక్ష్మీనారాయణుల చిత్రంలో పూర్తి 84 జన్మల జ్ఞానం ఉంటుంది. పిల్లలకు రోజంతా ఇదే చింతన నడుస్తూ ఉండాలి. ప్రతి సెంటరులోనూ ముఖ్యమైన చిత్రాలను తప్పకుండా పెట్టాలి. చిత్రాల ద్వారా బాగా అర్థం చేసుకోగలరు. బ్రహ్మా ద్వారా ఈ రాజధాని స్థాపనవుతుంది. మనం ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలము, బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలము. ఇంతకుముందు మనం శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యాము, తర్వాత దేవతలుగా తయారవ్వనున్నాము. శివబాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. మన లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, మరి వీరు మెట్లు ఎలా దిగారు. ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు. పూర్తిగా బుద్ధు (మూర్ఖుల) వలె అయిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు భారత్ లో రాజ్యం చేసేవారు. మరి తర్వాత ఏమయింది, వారు ఎక్కడకు వెళ్ళిపోయారు, వారిపై ఎవరైనా విజయం పొందారా, వారు యుద్ధంలో ఎవరినైనా ఓడించారా అని భారతవాసులకు తెలియాలి కదా. వారు ఎవరిపైనా గెలుపొందలేదు, ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. ఇదంతా మాయకు సంబంధించిన విషయము. రావణ రాజ్యం ప్రారంభమవుతూనే 5 వికారాలలో పడి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, 5 వికారాలపై విజయం పొందడంతో మళ్ళీ అలా తయారవుతారు. ఇప్పుడిది రావణ రాజ్యం యొక్క ఆర్భాటము. మనం గుప్త రీతిలో మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. మీరు ఎంత సాధారణమైనవారు. చదివించేవారు ఎంత ఉన్నతోన్నతమైనవారు. నిరాకార తండ్రి పతిత శరీరంలోకి వచ్చి పిల్లలను ఇలా (లక్ష్మీనారాయణులుగా) తయారుచేస్తారు. దూరదేశం నుండి పతిత దేశంలోకి, పతిత శరీరంలోకి వస్తారు. అది కూడా వారు స్వయాన్ని లక్ష్మీనారాయణులుగా తయారుచేసుకోరు, పిల్లలైన మిమ్మల్ని అలా తయారుచేస్తారు. కానీ అలా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయరు. రాత్రింబవళ్ళు చదువుకోవాలి మరియు చదివించాలి. బాబా రోజు-రోజుకు చాలా సహజమైన యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు. వివరణ లక్ష్మీనారాయణులతో ప్రారంభించాలి – వారు 84 జన్మలు ఎలా తీసుకున్నారు, వారు ఇప్పుడు అంతిమ జన్మలో చదువుకుంటున్నారు, తర్వాత వారి వంశం తయారవుతుంది. అర్థం చేయించాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి. చిత్రాల కోసం బాబా డైరెక్షన్లు ఇస్తారు. ఏదైనా చిత్రాన్ని తయారుచేస్తే వెంటనే బాబా వద్దకు పరుగెత్తుకుని రావాలి. బాబా వాటిని సరిదిద్ది, అన్ని డైరెక్షన్లు ఇస్తారు.

బాబా అంటారు – నేను సావల్ షాహ్ (రాజాధి రాజు) ను, కనుక హుండీ నిండిపోతుంది. ఏ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇంతమంది పిల్లలు కూర్చొని ఉన్నారు. ఎవరి ద్వారా హుండీ నింపవచ్చు అనేది బాబాకు తెలుసు. జైపూర్ ను జోరుగా పైకెత్తాలని బాబాకు ఆలోచన ఉంది. అక్కడే హఠయోగుల మ్యూజియం ఉంది. మీ రాజయోగ మ్యూజియం కూడా ఎంత బాగా తయారై ఉండాలంటే, దానిని ఎవరైనా వచ్చి చూడగలగాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పవిత్రమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసేందుకు తమ బుద్ధి రూపీ పాత్రను బంగారంగా తయారుచేసుకోవాలి. స్మృతి ద్వారానే పాత్ర బంగారంగా అవుతుంది.

2. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక శూద్రత్వానికి సంబంధించిన అలవాట్లు అన్నింటినీ తొలగించాలి. చాలా రాయల్ గా ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అనే నషాలో ఉండాలి.

వరదానము:-

తమ వృత్తి యొక్క పరివర్తన ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి, అప్పుడు దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపాన్ని, యథార్థ ఇంటిని మరియు యథార్థ రాజధానిని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారం చేయించేందుకు వృత్తిలో కొంచెం కూడా దేహాభిమానం యొక్క చంచలత ఉండకూడదు. కనుక వృత్తిని సరిదిద్దుకొని దృష్టిగా దివ్యంగా తయారుచేసుకోండి, అప్పుడు ఈ సృష్టి పరివర్తనవుతుంది. మిమ్మల్ని చూసేవారికి – ఇవి నయనాలు కావు, ఇవి ఇంద్రజాలపు డిబ్బీలు అన్నట్లు అనుభవం అవుతుంది. ఈ నయనాలు సాక్షాత్కారాలకు సాధనంగా అవుతాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top