01 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
30 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - బెగ్గర్ నుండి ప్రిన్స్ గా అయ్యేందుకు ఆధారము పవిత్రత. పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచం యొక్క రాజ్యం లభిస్తుంది”
ప్రశ్న: -
ఈ పాఠశాలలోని ఏ పాఠం మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేస్తుంది?
జవాబు:-
మీరు ప్రతిరోజు ఈ పాఠశాలలో చదివే పాఠమేమిటంటే – నేను శరీరం కాదు, ఆత్మను. ఆత్మాభిమానులుగా అవ్వడంతోనే మీరు మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ పూజారులుగా అనగా పతితులుగా, దేహాభిమానులుగా ఉన్నారు, అందుకే పతితపావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఆకాశ సింహాసనాన్ని వదిలిరా….. (చోడ్ భీ దే ఆకాష్ సింహాసన్…..)
ఓంశాంతి. ఓంశాంతి అని ఎవరన్నారు అనేది పిల్లలకు తెలుసు. ఏ పిల్లలు? ఓంశాంతి అని ఎవరి ఆత్మ చెప్పింది అనేది ఆత్మలకు తెలుసు. పరమపిత పరమాత్మ చెప్పారు. ఇది మనుష్యాత్మ చెప్పలేదు, పరమపిత పరమాత్మ శివుడు చెప్పారని పిల్లలకు తెలుసు. వారు అందిరకీ తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైనవారు. భారత్ పై మాయ నీడ చాలా విస్తరించి ఉందని ఇప్పుడు పాటలో విన్నారు. చాలా పతితంగా అయిపోయారు, అందుకే ఓ పతితపావనా, పావనంగా చేయడానికి మళ్ళీ రండి అని పిలుస్తారు. ఆత్మనే తన తండ్రిని పిలుస్తుంది, వారిని భగవంతుడని అంటారు. వారినే పతితపావనుడని అంటారు. ఆ ఒక్కరికే మహిమ జరుగుతుంది. వారు ఆత్మలందరికీ అనంతమైన తండ్రి. ఇక్కడ అందరూ పతితంగా అయిపోయారు, అందుకే ఓ పరమపిత పరమాత్మ, అని పిలుస్తారు. వారే జ్ఞాన సాగరుడు కూడా, పతితపావనుడు కూడా. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా ఎందుకంటే వారు జ్ఞాన సాగరుడు కూడా, వరల్డ్ ఆథారిటి కూడా. వారు వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు అన్ని తెలిసినవారు కూడా. వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. కనుక ఈ సమయంలో అందరూ పారలౌకిక తండ్రిని పిలుస్తారు ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. వారిని గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. వారికి పేరు కూడా ఉండాలి కదా. వారిని శివబాబా అనే పేరుతో పిలుస్తారు. వారే ఉన్నతాతి ఉన్నతమైన జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, శాంతిసాగరుడు. మనుష్యాత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ ఎవరిది? పరమపిత పరమాత్మునిది. వారు పరమ (ఉన్నతమైనవారు). పతిత మనుష్యులు వారిని స్మృతి చేస్తారు. సత్యయుగంలో పావన భారత్ ఉన్నప్పుడు, దేవీ దేవతల రాజ్యమున్నప్పుడు పతితులెవ్వరూ ఉండేవారు కాదు. ఇది తమోప్రధాన ప్రపంచము అనగా ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ పాపాత్ములు. ఇదే భారత్ పావనంగా ఉండేది, ఇదే భారత్ పతితంగా అయిపోయింది. ఇక్కడ కలియుగంలో అందురూ పతితంగా ఉన్నారు. జ్ఞాన సాగరుడు, పతితపావనుడైన పరమపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చి, బ్రహ్మా ద్వారా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. వారికి తప్పకుండా శరీరమైతే కావాలి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. అథారిటీ అయిన జ్ఞానసాగరునికే అంతా తెలుసు. భారత్ లో విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చిత్రం కూడా చూపిస్తారు, బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణువేమీ అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించరు. జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ, బ్రహ్మా ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా వారే రచయిత. బ్రహ్మా లేక విష్ణువును జ్ఞానసాగరుడని అనరు. ఇక శంకరుని విషయాన్ని అయితే వదిలేయండి. ఇప్పుడు జ్ఞానసాగరుడు ఎవరు? నిరాకారుడైన ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్మయే పతితపావనుడు. ఈ మహిమ ఆ పరమపిత పరమాత్మునిది. ఇక్కడ కూడా ఆత్మకే మహిమ జరుగుతుంది. ఆత్మయే శరీరం ద్వారా, నేను ప్రెసిడెంటును, నేను బ్యారిస్టరును, నేను ఫలానా మినిస్టరును అని అంటుంది. ఆత్మయే పదవి తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ శరీరం ద్వారా అంటుంది. ఈ సమయంలో తండ్రి వచ్చినప్పుడు – పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి అని అంటారు. మీకు ఈ పాఠాన్ని నేర్పించేందుకే మీ తండ్రినైన నేను వచ్చాను. ఇది మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యే పాఠశాల. ఓ పరమపిత పరమాత్మ….. ఇప్పుడు నిరాకారి ప్రపంచం నుండి సాకారి ప్రపంచానికి రండి, రూపాన్ని మార్చుకొని రండి అని ఆత్మలందరూ తండ్రిని పిలుస్తారు. నిరాకారి ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు గర్భంలో ప్రవేశిస్తారు, పునర్జన్మలు తీసుకుంటారు. మీరు 84 జన్మలు గర్భం ద్వారానే తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భంలోకి వెళ్తారు, ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేను గర్భంలో ప్రవేశించను. వాస్తవానికి భారతవాసులు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత మెట్లు కిందకు దిగుతూ వచ్చారు, క్షత్రియ వర్ణంలోకి, తర్వాత వైశ్య, శూద్ర వర్ణాలలోకి వస్తూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. భారత్ 16 కళల సంపూర్ణంగా ఉండేది, తర్వాత 14 కళలు కలదిగా అయ్యింది. భారతవాసులకు తమ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను భారతవాసులే తీసుకుంటారు. ఇంకే ధర్మం వారు 84 జన్మలు తీసుకోరు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు, ఇది జ్ఞానం యొక్క విషయము. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో మీరు స్వర్గానికి చక్రవర్తి మహారాజులుగా అవుతారు. మీరు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారని మీకు మంచిరీతిగా తెలుసు. ఇది పతిత ప్రపంచము. పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అందరూ వారినే పిలుస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు, కృష్ణుడిని కాదు. కృష్ణుడు గీతను వినిపించలేదు. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. భారత్ యొక్క గీత ఏ ధర్మానికి చెందిన శాస్త్రము? ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన శాస్త్రము. గీతను ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? పరమపిత పరమాత్మ పతితపావనుడైన తండ్రి నేర్పించారు. నిరాకారిగా ఉండే మీ ఆత్మ ఇప్పుడు ఈ సాకార శరీరాన్ని ధారణ చేసింది. సాకార మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులు ఉంటారు కానీ వారిని కూడా భగవంతుడని అనరు. ఇది కేవలం ఒక టైటిల్ లా వారికి ఇవ్వడం జరుగుతుంది. నియమానుసారంగా భగవంతుడు ఒక్కరే. రచయిత ఒక్కరే. ఇకపోతే, వారు దేవతలు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. అప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, వీరిని మహారాజా-మహారాణి అని అనేవారు. భగవంతుడు మహారాజుగా అవ్వరు. వారు తండ్రి, వారు వచ్చి భారతవాసులను ఇటువంటి దేవీ దేవతలుగా తయారుచేస్తారు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ఎవరూ లేరు. ఇక్కడున్న వారిని రావణ సంప్రదాయము వారని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడిని ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు ఎందుకంటే అతను పాత శత్రువు కానీ భారతవాసులకు అతని గురించి తెలియదు. రావణుడు ఎవరు, రావణునికి 10 తలలు ఎందుకు చూపించారు అన్నదాని గురించి శాస్త్రాలలో కూడా వర్ణించలేదు. ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. మనుష్యులు పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైనవారిని పారసబుద్ధి కలవారని అంటారు. పారసనాథుడు, పారసనాథిని యొక్క రాజ్యముండేది. అక్కడ యథా రాజా రాణి, తథా ప్రజ ఉండేవారు. భారత్ వంటి సుఖధామంగా ఇంకే ఖండము ఉండదు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు, ఎటువంటి అనారోగ్యం, దుఃఖం ఉండేవి కావు. సంపూర్ణ సుఖముండేది. ఈశ్వరుని మహిమ అపారమైనదని గాయనం చేయబడుతుంది. అలా భారత్ మహిమ కూడా అపారమైనది. అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. పిలవడం కూడా అందరూ పతితంగా ఉన్నారనే పిలుస్తూ ఉంటారు. శాంతి లేదు, సంపద కూడా లేదు. భారతవాసులైన మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా పతితంగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దీనిని మృత్యులోకమని అంటారు. దీనికి నిప్పు అంటుకోనున్నది. ఇది శివ జ్ఞాన యజ్ఞము, దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా అంటారు. మనుష్యులైతే అనేక పేర్లు పెడతారు. శివుని మూర్తిని ఎక్కడ చూసినా, అక్కడ ఎన్నో రకాల పేర్లు పెట్టేస్తారు. ఒక్కరికే అనేక పేర్లతో మందిరాలు నిర్మిస్తారు. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది, మీకు భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది అనగా ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచం వినాశనమవ్వనున్నది.
బాబా, మేము పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అని పిల్లలు అడుగుతారు. చాలామంది కొత్తవారు వస్తారు, వారిని లోపలికి అనుమతించడం జరగదు. ఎలాగైతే ఎవరైనా కొత్తవారు వెళ్ళి కాలేజిలో కూర్చున్నట్లయితే, ఏమీ అర్థం చేసుకోలేరు. మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారవుతున్నారు అనేది ఎవరికీ తెలియదు. పతితంగా ఉన్న మనుష్యులే పావనంగా అవుతారు. ఈ సమయంలో భారత్ కూడా బెగ్గర్ లా ఉంది. సత్యయుగంలో భారత్ ప్రిన్స్ లా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క మొదటి నంబర్ ప్రిన్స్. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. రాజ్యము లక్ష్మీనారాయణులకు చెందినదని అంటారు. కృష్ణుడు ప్రిన్స్ గా ఉండేవారు, రాధ ప్రిన్సెస్ గా ఉండేవారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు….. అని ప్రిన్స్ అయిన కృష్ణుని గురించే మహిమ చేయడం జరుగుతుంది. వారేమీ గీతను వినిపించలేదు. వారు సత్యయుగం యొక్క ప్రిన్స్. వారు పతిత మనుష్యులను పావనంగా చేయడానికి గీతా పాఠాన్ని వినిపించడమనేది జరగదు. ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. శాస్త్రాలకు ఎంత మహిమ ఉంది. సత్యయుగంలో భక్తి మార్గపు శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ 21 జన్మలకు జ్ఞానం యొక్క ప్రారబ్ధం ఉంటుంది. మీరు మళ్ళీ సత్యయుగ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. భారతవాసులు 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఆ సమయంలో వేరే పార్టిషన్లు ఏమీ ఉండేవి కాదు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. ఇప్పుడిది కలియుగాంతము కదా. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. భగవంతుడు పతిత కలియుగాన్ని పావన సత్యయుగంగా తయారుచేసేందుకు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు కనుక తప్పకుండా పతిత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన అని అంటూ ఉంటారు, అది ఇప్పుడు శివబాబా బ్రహ్మా ద్వారా చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారని పాడుతారు కూడా. వారు ప్రజాపిత, అందరూ వారి సంతానము. తప్పకుండా బ్రహ్మా ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం కూడా, మీకు ఈ రాజయోగాన్ని నేర్పించడానికి నేను సంగమంలో వచ్చాను. నేను వచ్చాను, కృష్ణుడు కాదు. కృష్ణుడు పతిత ప్రపంచంలోకి రాలేరు. తండ్రియే వస్తారు. వారే సర్వుల సద్గతిదాత. మనుష్యులు మనుష్యులకు సద్గతినివ్వలేరు. స్మృతి కూడా అందరూ ఒక్కరినే చేస్తారు. పరమపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు? వారు పరంధామంలో ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటాయి, మహాత్మల వలె ఉంటాయి. ఇక్కడ కూడా మహాన్ ఆత్మ, పతితాత్మ అని అంటారు కదా. వాస్తవానికి ఇక్కడ మహాన్ ఆత్మలు ఒక్కరు కూడా లేరు. ఆత్మే పావనంగా, సతోప్రధానంగా అవ్వాలి, అది కూడా జ్ఞాన-యోగాల ద్వారా, నీటి ద్వారా కాదు. ఆత్మయే పతితంగా అయ్యింది. ఆత్మలోనే మాలిన్యం చేరుతుంది. ఆత్మయే బంగారం, వెండి, రాగి, ఇనుములా అవుతుంది. ఇప్పుడు పతితంగా ఉన్న ఆత్మలను పావనంగా ఎవరు చేయాలి. పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ చేయలేరు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయని తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పతితం నుండి పావనంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, సత్యయుగంలో ఎంత సమయం రాజ్యం నడుస్తుంది, తర్వాత రావణుడు ఎలా వస్తాడు అనే జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. రావణుడు ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎప్పటి నుండి రావణుడిని కాలుస్తూ వస్తున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం కాలుస్తారు. సత్యయుగంలోనైతే కాల్చరు. ఇప్పుడున్నదే రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని అయితే ఎవరూ స్థాపన చేయలేరు. ఇది కేవలం తండ్రి పని మాత్రమే. పతిత మనుష్యులు చేయలేరు. వారందరూ వినాశనమైపోతారు. ఈ పతిత ప్రపంచమే వినాశనమవ్వనున్నది. సత్యయుగంలో ఓ పతితపావనా రండి, అని ఒక్కరు కూడా పిలవరు. అది పావన ప్రపంచం కదా. ఈ లక్ష్మీనారాయణులను ఇలా స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారుచేసారు, తర్వాత వీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే 84 జన్మలు తీసుకున్నారు. వారే ఈ సమయంలో శూద్ర వంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులే ఉన్నతాతి ఉన్నతమైనవారు పిలకవంటి వారు. ఇప్పుడు మీరు శివబాబాకు పిల్లలు కూడా, మనవలు, మనవరాళ్ళు కూడా. మీరు శివవంశీయులు మరియు బ్రహ్మాకుమార-కుమారీలు. తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు – నన్ను నిరంతరం స్మృతి చేయండి, పావనంగా అయినట్లయితే మీరు నా వద్దకు ముక్తిధామానికి వచ్చేస్తారు. ఎవరైతే కల్పక్రితం ఈ విషయాలను అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అటువంటివారు వేల సంఖ్యలో ఉన్నారు. ఎంతమంది బి.కె.లు ఉన్నారు అని కొంతమంది అడుగుతారు. వేల సంఖ్యలో ఉన్నారని చెప్పండి. ఈ దైవీ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది ఎందుకంటే దేవతా ధర్మం ఇప్పుడు లేదు. అందరూ తమను తాము హిందువులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. మళ్ళీ అందరూ తిరిగి వచ్చేస్తారు, వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వం పొందేందుకు అనగా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పతితం నుండి పావనంగా అయ్యేందుకు జ్ఞాన-యోగాలలో దృఢంగా అవ్వాలి. ఆత్మలో ఏర్పడిన మాలిన్యాన్ని స్మృతి యొక్క శ్రమతో తొలగించుకోవాలి.
2. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మేము పిలక వంటి వారమనే నషాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు ఎందుకంటే శివబాబాకు మనవలు.
వరదానము:-
ఆత్మ యొక్క అనాది మరియు ఆది, రెండు కాలాల వాస్తవిక స్వరూపం పవిత్రత. అపవిత్రత కృత్రిమమైనది, శూద్రులు ఇచ్చినటువంటిది. శూద్రుల వస్తువును బ్రాహ్మణులు ఉపయోగించలేరు. అందుకే, కేవలం అనాది-ఆది రియల్ రూపంలో నేను పవిత్రాత్మను అనే సంకల్పం చేయండి. ఎవరిని చూసినా సరే, వారి రియల్ రూపాన్ని చూడండి, రియల్ ను రియలైజ్ అవ్వండి, అప్పుడు సంపూర్ణ పవిత్రులుగా అయి ఫస్ట్ క్లాస్ లేక ఎయిర్ కండిషన్ టికెట్ కు అధికారులుగా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!